సయ్యద్ మోదీ టోర్నీలో భారత్‌కు షాక్.. డబుల్ టైటిల్ ఆశలు ఆవిరి!
ABN , Publish Date - Nov 29 , 2026 | 09:52 PM
సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో డబుల్ టైటిల్ సాధించాలనుకున్న భారత్‌కు నిరాశ ఎదురైంది. ఇవాళ లఖ్‌నవూ వేదికగా జరిగిన మహిళల డబుల్స్, సింగిల్స్ ఫైనల్స్‌లో భారత క్రీడాకారులు ఓటమి పాలయ్యారు.
స్పోర్ట్స్ డెస్క్: సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో డబుల్ టైటిల్ సాధించాలనుకున్న భారత్‌కు నిరాశ ఎదురైంది. ఇవాళ(ఆదివారం) లఖ్‌నవూ వేదికగా జరిగిన మహిళల డబుల్స్, సింగిల్స్ ఫైనల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్లు ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్.. టీనేజర్ తన్వి శర్మ ఓడారు. గత రెండు ఎడిషన్లలో డబుల్స్ విజేతగా నిలిచిన గాయత్రి గోపీచంద్- ట్రీసాలకు ఈ టోర్నీ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ఇసియానా-క్వినారా జంట షాక్ ఇచ్చింది. 79 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో గాయత్రి-ట్రీసా జోడీ 24-22, 12-21, 19-21 తేడాతో పరాజయం పాలైంది.
హోరాహోరీగా జరిగిన తొలి ఆటను 24-22 తేడాతో భారత ద్వయం సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో ఇసియానా-క్వినారా జంట దూకుడు ప్రదర్శించి గేమ్‌ను 21-12 కైవసం చేసుకుని స్కోరును సమం చేసింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 7-3తో వెనకబడిన భారత ద్వయం.. తర్వాత పుంజుకుని విరామ సమయానికి 11-8తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం గాయత్రి- ట్రీసా చేసిన తప్పిదాలను ఇండోనేసియా జంట సద్వినియోగం చేసుకుని 21-19 తేడాతో గెలిచి.. విజేతగా నిలిచింది. ఇక, మహిళల సింగిల్స్‌లో 17 ఏళ్ల తన్వి శర్మ కూడా నిరాశపర్చింది. తుది పోరులో తన్వి 21-11, 12-21, 15-21 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన సుపనిద కటేథాంగ్ చేతిలో పరాజయం చవిచూసింది.
ఇవి కూడా చదవండి:
బంగారం అనుకుని దాచుకున్నాడు.. చివరకు ఊహించని ట్విస్ట్!
ఇంద్రకీలాద్రికి మరోసారి అగ్రస్థానం.. ఐదోసారీ నంబర్-1గానే..