Share News

ఫ్రాన్స్‌ ఫట్‌.. స్పెయిన్‌ హిట్‌

ABN , Publish Date - Jul 16 , 2026 | 03:35 AM

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అప్పుడెప్పుడో, పదహారేళ్ల క్రితం ఫిఫా ప్రపంచక్‌పలో స్పెయిన్‌ చాంపియన్‌గా నిలిచింది.. ఆ తర్వాత మూడు పర్యాయాలు కప్పులో కనీసం నాకౌట్‌ దశ కూడా...

ఫ్రాన్స్‌ ఫట్‌.. స్పెయిన్‌ హిట్‌

16 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు స్పానిష్‌ జట్టు

సెమీ్‌సలో చేతులెత్తేసిన ఎంబాపె బృందం

అర్లింగ్టన్‌ (టెక్సాస్‌): ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అప్పుడెప్పుడో, పదహారేళ్ల క్రితం ఫిఫా ప్రపంచక్‌పలో స్పెయిన్‌ చాంపియన్‌గా నిలిచింది.. ఆ తర్వాత మూడు పర్యాయాలు కప్పులో కనీసం నాకౌట్‌ దశ కూడా దాటలేకపోయింది.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈసారి టోర్నీలో అడుగుపెట్టిన స్పానిష్‌ జట్టు అంచనాలకు అందని ఆటతో అదరగొట్టింది. ఒక్కో ప్రత్యర్థిని అలవోకగా దాటుకుంటూ అజేయంగా దూసుకెళ్తున్న స్పెయిన్‌.. అంతేదీటుగా సెమీఫైనల్లో హాట్‌ ఫేవరెట్‌ ఫ్రాన్స్‌పైనా విజృంభించింది. సారథి ఎంబాపె, డెంబెలెలాంటి స్టార్లున్న బలమైన ఫ్రెంచ్‌ జట్టుకు ఒక్క గోల్‌కు కూడా అవకాశమివ్వకుండా 2-0తో షాకిచ్చి ఫైనల్‌ చేరింది. నాటి స్వర్ణయుగాన్ని మరిపిస్తూ స్పానిష్‌ ఆటగాళ్లు వ్యూహాత్మక ఆటతీరుతో మాజీ చాంపియన్‌ ఫ్రాన్స్‌ను చిత్తుచేశారు. మైకేల్‌ ఓయర్జబల్‌ (22వ నిమిషం), పెడ్రో పోరో (58వ) చెరో గోల్‌ చేసి స్పెయిన్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. స్పెయిన్‌ దూకుడుతో ఫ్రాన్స్‌ పూర్తిగా చేతులెత్తేసింది. ముఖ్యంగా ఫ్రెంచ్‌ సూపర్‌స్టార్‌ ఎంబాపె గోల్‌ అవకాశాలను సృష్టించలేకపోయాడు. ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించలేకపోయాడు. దీంతో.. వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరాలన్న ఆ జట్టు కల భగ్నమైంది. రెండుసార్లు ప్రపంచకప్‌ విజేత (1998, 2018) అయిన ఫ్రాన్స్‌, ఈ మెగా టోర్నీలో సెమీ్‌సలో ఓడడం ఇది నాలుగోసారి. ఇక.. 17వ సారి ప్రపంచకప్‌ ఆడుతోన్న స్పెయిన్‌ ఒకేఒక సారి టైటిల్‌ నెగ్గింది. తొలిసారిగా 2010లో ఫైనల్‌ చేరడంతో పాటు విజేతగా నిలిచింది.

తేలిపోయారు..

మ్యాచ్‌ ఆరంభం నుంచే ఆధిపత్యం చాటుకున్న స్పెయిన్‌ తొలి పది నిమిషాల పాటు బంతిని పూర్తిగా తమ అధీనంలోనే ఉంచుకుంది. 22వ నిమిషంలో స్పెయిన్‌ యువ కెరటం లామినె యామల్‌ను ఫ్రాన్స్‌ డిఫెండర్‌ లుకాస్‌ డిగ్నే కాలితో తన్నడంతో స్పెయిన్‌కు పెనాల్టీ కిక్‌ లభించింది. ఈ పెనాల్టీని మైకేల్‌ ఓయర్జబల్‌ గోల్‌గా మలచి స్పెయిన్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ప్రథమార్ధంలో తేలిపోయిన ఫ్రాన్స్‌ ద్వితీయార్ధంలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. విరామం తర్వాత కూడా స్పెయిన్‌ బంతిని తమ అధీనంలోనే ఉంచుకొని ప్రత్యర్థి గోల్‌పో్‌స్టపై దాడులు చేసింది. 58వ నిమిషంలో ఓల్మో పాస్‌ను అందుకున్న పెడ్రో పోరో.. ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌ మైక్‌ను దాటుకుంటూ బంతిని లాఘవంగా నెట్‌లోకి పంపి స్పెయిన్‌కు 2-0తో స్పష్టమైన ఆధిక్యాన్నిచ్చాడు. దీంతో మరింత ఒత్తిడిలో పడిపోయి పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమైన ఫ్రాన్స్‌ ఆటగాళ్లు..మ్యాచ్‌ ముగిసేదాకా ఒక్క గోల్‌ కూడా కొట్టలేకపోయారు.


6-Sports.jpg

యామల్‌ గోల్‌ కొట్టకున్నా..

స్పెయిన్‌ యువ కెరటం, 19 ఏళ్ల లామినె యామల్‌ మ్యాచ్‌లో గోల్‌ చేయకపోయినా తనదైన వ్యూహంతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. 22వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాడు లుకాస్‌ డిగ్నే తప్పిదానికి పాల్పడేలా చేసి పెనాల్టీ కిక్‌ రూపంలో జట్టుకు అవకాశాన్ని సృష్టించాడు. ఈ పెనాల్టీతోనే సహచరుడు మైకేల్‌ గోల్‌ చేశాడు. ఆ తర్వాత కూడా జట్టులో సహచరులకు అండగా నిలుస్తూ, ప్రత్యర్థి డిఫెన్స్‌ ఛేదించడంలో యామల్‌ ప్రధాన భూమిక పోషించాడు.

5-Sports.jpg

ఎంబాపె.. ఓడినా రేసులోనే!

ఈ ప్రపంచక్‌పలో ఫ్రాన్స్‌ ఫైనల్‌ చేరడంలో విఫలమైనా.. ఆ జట్టు కెప్టెన్‌ ఎంబాపె మాత్రం గోల్డెన్‌ బూట్‌ రేసులో ఇంకా ఉన్నాడు. ఈ టోర్నీలో అతడు ఇప్పటికే 8 గోల్స్‌, 3 అసి్‌స్ట్సతో టాప్‌లో కొనసాగుతున్నాడు. అర్జెంటీనా సారథి మెస్సీ 8 గోల్స్‌, ఓ అసి్‌స్టతో ఎంబాపె తర్వాతి స్థానంలో ఉండగా, 7 గోల్స్‌తో నార్వే స్టార్‌ ఎర్లింగ్‌ హాలాండ్‌ మూడో స్థానంలో నిలిచాడు. అయితే, మెస్సీకి ఇంకా సెమీస్‌ మ్యాచ్‌ మిగిలున్న నేపథ్యంలో.. ఆ పోరులో ఇంగ్లండ్‌పై గోల్స్‌ చేస్తే మెస్సీ ముందుకెళ్తాడు. కానీ, ఫ్రాన్స్‌ జట్టు మూడోస్థానం కోసం తలపడాల్సి ఉండడంతో, ఎంబాపె ఇంకా గోల్డెన్‌ బూట్‌ కోసం పోటీలో ఉన్నట్టే.

ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 03:35 AM