కామన్వెల్త్ గేమ్స్ 2026: పసిడి వేటలో నీరజ్ చోప్రా..!
ABN , Publish Date - Jul 30 , 2026 | 03:49 PM
గ్లాస్గో వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్ 2026 ఎనిమిదో రోజు క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం ఆరంభమైంది. భారత ‘గోల్డెన్ బాయ్' నీరజ్ చోప్రా పురుషుల జావెలెన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్‌లో తన ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించాడు.
స్పోర్ట్స్ డెస్క్: గ్లాస్గో వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్ 2026 ఎనిమిదో రోజు క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం ఆరంభమైంది. భారత ‘గోల్డెన్ బాయ్’, మాజీ ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలెన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్‌లో తన ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించాడు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లోకి పునరాగమనం చేసిన నీరజ్, టాప్-3లో నిలవడమే లక్ష్యంగా మైదానంలోకి దిగాడు.
ఈ క్వాలిఫయింగ్ పోటీలో శ్రీలంకకు చెందిన రుమేష్ పతిరాగే తొలి ప్రయత్నంలోనే 82.84 మీటర్ల దూరం విసిరి ముందంజలో నిలవగా, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 78.63 మీటర్ల దూరాన్ని నమోదు చేశాడు. ఇక గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా తొలి యత్నంలో 76.28 మీటర్ల దూరం సాధించి ఫైనల్ అర్హత దిశగా అడుగులు వేశాడు. అలానే నీరజ్ తన రెండవ ప్రయత్నంలో మెరుగైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకున్నాడు. అతను రెండో ప్రయత్నంలో 79.61 మీటర్ల త్రోను నమోదు చేశాడు.
మరోవైపు అథ్లెటిక్స్ విభాగంలో భారత డెకాథ్లెట్ తేజస్విన్ శంకర్ 100 మీటర్ల స్ప్రింట్ రేసును 10.96 సెకన్లలో పూర్తి చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పటికే భారత వెయిట్‌లిఫ్టింగ్ బృందం ఆరు పతకాలతో అద్భుత ప్రదర్శన చేయగా, రాబోయే ఈవెంట్లలో మరిన్ని పతకాలను సొంతం చేసుకునేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. నీరజ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే పసిడి పతకం దిశగా భారత్ మరో అడుగు ముందుకేసినట్లేనని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
బంగ్లాదేశ్ అత్యంత సురక్షితం దేశం: తమీమ్ ఇక్బాల్
భారత హాకీ జెర్సీ మార్పుపై వివాదం.. వివరణ ఇచ్చిన హాకీ ఇండియా