Share News

విద్యార్థులపై లాఠీఛార్జ్ చేస్తే.. అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు? : ఖర్గే

ABN , Publish Date - Jul 30 , 2026 | 03:28 PM

నీట్ ప్రశ్న పత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై బాష్పవాయువు కూడా ప్రయోగించారని తెలిపారు.

విద్యార్థులపై లాఠీఛార్జ్ చేస్తే.. అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు? : ఖర్గే
mallikarjun kharge in rajya sabha

న్యూఢిల్లీ, జులై 30: నీట్ ప్రశ్న పత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై బాష్పవాయువు కూడా ప్రయోగించారని తెలిపారు. పోలీసుల తీరుపై కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. గురువారం రాజ్యసభలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ఇంతటి దారుణ ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత అని స్పష్టం చేశారు. దీనిపై ఇంతవరకు అమిత్‌ షా ఎలాంటి ప్రకటన చేయలేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


ఢిల్లీ ఘటనపై నోరు విప్పి మాట్లాడాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను ఖర్గే డిమాండ్ చేశారు. పేపర్‌ లీక్‌ వల్ల విద్యార్థులు నష్టపోవాలా? అని కేంద్రాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ కారణంగా.. చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్రానికి ఖర్గే స్పష్టం చేశారు. విద్యార్థులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? అని మోదీ సర్కారును ఆయన నిలదీశారు. పేపర్‌ లీక్‌ అనేది తలదించుకోవాల్సిన అంశమని ఖర్గే అభివర్ణించారు.


2024లోనే ఈ బిల్లు ఎందుకు తీసుకురాలేదని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపు తప్ప విద్యార్థులపై ప్రేమ లేదని కేంద్ర వైఖరిని ఎండగట్టారు. బిహార్‌లో ఆందోళనకు దిగిన విద్యార్థులపై తుపాకులు ఎక్కుబెట్టారని విమర్శించారు. ఆందోళన చేసిన యువత ఉగ్రవాదులు కాదు కదా? అని కేంద్రానికి ఖర్గే చురకలంటించారు.

Updated Date - Jul 30 , 2026 | 03:45 PM