విజయాల బాటలో 'గ్రాండ్'గా..
ABN , Publish Date - Sep 17 , 2026 | 06:25 AM
యారాడ కొండ... అక్కడో మత్స్యకార కుటుంబం. విద్యుత్ సదుపాయం కూడా లేని గ్రామం. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన ఓ యువతి ఇప్పుడు చెస్‌లో ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌మాస్టర్ హోదాను సాధించింది.
యారాడ కొండ... అక్కడ మత్స్యకార కుటుంబం. విద్యుత్ సదుపాయం కూడా లేని గ్రామం. కులవృత్తి అయిన చేపల వేటతో తాత కుటుంబాన్ని నడిపితే... తండ్రి స్కాలర్‌షిప్‌లపై చదువుకొని కెమికల్ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. నాన్న ఉద్యోగంతో కొండ దిగి.. విశాఖపట్నం వచ్చిన ఆ కుటుంబం నుంచి ఇప్పుడు చెస్‌లో ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌మాస్టర్ హోదాను సాధించింది 19 ఏళ్ల మూగి సాహితి వర్షిణి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఘనత సాధించిన మూడో అమ్మాయి సాహితిని 'నవ్య' పలుకరించింది.
'మాది మత్స్యకార కుటుంబం. యారాడ కొండపై విద్యుత్ సదుపాయం కూడా లేని ఓ చిన్న గ్రామంలో మావాళ్లు ఉండేవారు. మా తాత చేపలు పట్టి కుటుంబాన్ని పోషించేవారు. నాన్న లోకేశ్వర్‌రావు స్కాలర్‌షిప్‌లపై చదువుకొని కెమికల్ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించాక కొండ దిగి విశాఖపట్నం వచ్చాం. అప్పట్లో ‘ఈసెట్’లో నాన్నకు రాష్ట్రంలో పదో ర్యాంక్ వచ్చింది. ఇంజినీరింగ్ తరువాత ఆయనకు హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగం లభించింది. అయితే నా కెరీర్ కోసం 2022లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇప్పుడు చెస్ అకాడమీ నడుపుతున్నారు. అమ్మ జయశ్రీ గృహిణి. అక్క ఫాల్గుణి ఫిడే ఆర్బిటర్. మా ఇంటి దగ్గర దినేష్ అని, ఆంధ్రా యూనివర్సిటీ చెస్ ఛాంపియన్. నాన్న తనతో సరదాగా చెస్ ఆడేవారు. ‘చెస్‌లో నువ్వు ఎప్పటికీ నాపై గెలవలేవ’ని ఆయన అనడంతో నాన్న సవాల్‌గా తీసుకున్నారు. చెస్ పుస్తకాలు చదివి వ్యూహాలు, ఎత్తుల గురించి అవగాహన పెంచుకు న్నారు. కొన్ని నెలలకే దినేష్‌ను ఓడించడంతోపాటు హెచ్‌పీసీఎల్ తరఫున జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగారు. దిగ్గజ ప్లేయర్లు హంపి, హరికృష్ణ, జీఎంలు దీప్‌సేన్ గుప్త, పద్మిణి రౌత్‌తో నాన్న ఆడేవారు. అయితే క్రీడాకారుడిగా తాను సాధించ లేని విజయాలు తన పిల్లలు సాధించాలని కలలు కన్నారు. హంపి, హారికలా మా అక్కచెల్లెళ్లను పెద్ద చెస్ క్రీడాకారిణులుగా చూడాల ని ఆకాంక్షించారు. అలా మొదట అక్కకు చెస్‌లో శిక్షణ ఇప్పించారు.
అక్కతో కలిసి..
చిన్నప్పుడు అక్కతో పాటు నేను కూడా వెళ్లేదాన్ని. కోచ్ అక్కకు చెబుతుంటే.. నేను మధ్యలో వెళ్లి నాకు నచ్చినట్టు పావులు కదిపేదాన్ని. కోచ్ నాన్నకు ఫిర్యాదు చేశారు. ‘ఎందుకు అలా చేస్తున్నావ’ని నాన్న అడిగారు. అక్క సరిగ్గా ఆడటంలేదని, ఇంకా బాగా ఆడవచ్చని నేను నాలుగైదు మూవ్స్ నాన్నకు చూపించాను. అది చూసి ఆయన ఆశ్చర్యపోయారు. నన్ను ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా చేయాలని ఆరోజు నిశ్చయించుకున్నారు.
చావు అంచుల వరకు వెళ్లి..
నాకు ఐదేళ్లప్పుడు డెంగ్యూ వచ్చింది. నేను బతకడం కష్టమని వైద్యులు చెప్పారట. కానీ భగవంతుడి దయతో ఎలాగో బతికాను. అయితే, పూర్తిగా నీరసించి పోయానట. దాంతో ఏడాదిపాటు స్కూల్‌కు పంపలేదు. ఇంట్లో ఖాళీగా ఉంటున్న నాకు చెస్‌పై ఇష్టం పెరిగింది. నా ఇష్టాన్ని గమనించిన నాన్న నాకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. రెండేళ్లు గడిచేసరికి రాష్ట్ర స్థాయి అండర్-8 పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచా. జలంధర్‌లో జరిగిన జాతీయ అండర్-9 పోటీల్లో రన్నరప్ టైటిల్ సాధించా. అక్కడి నుంచి వెనుదిరిగి చూసింది లేదు. ఐదున్నరేళ్లప్పుడు మొదలైన చెస్.. ఇప్పుడు నా ఊపిరిగా మారింది.
గుకేశ్ కంటే..
ప్రస్తుత ప్రపంచ చెస్ ఛాంపియన్, తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ కంటే ఆసియా చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఒక పతకం ఎక్కువ సాధించా. 2017లో ఉజ్బెకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చిన ఆసియా చెస్ ఛాంపియన్‌షిప్ అండర్-10 విభాగంలో క్లాసికల్, బ్లిట్జ్ విభాగాల్లో స్వర్ణాలు నెగ్గాను. అదే ఏడాది జరిగిన కామన్వెల్త్ చెస్ పోటీల్లోనూ పసిడి పతకం సాధించా. ఆ తర్వాతి ఏడాది థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా చెస్ పోటీల్లో క్లాసికల్, ర్యాపిడ్ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణం, బ్లిట్జ్‌లో కాంస్యం, టీమ్ కేటగిరీ మూడు విభాగాల్లోనూ స్వర్ణాలు సాధించా. ఈ పోటీల ప్రారంభంలో తొలుత 13వ స్థానంలో ఉన్న నేను.. ఆ తర్వాత పట్టుదలతో ఆరు పతకాలు గెలుచుకున్నా. గుకేశ్ ఐదు పతకాలు సాధించాడు.
కొవిడ్‌తో తలకిందులు..
2018కే 1800ల ఎలో రేటింగ్ పాయింట్లు సాధించా. ఆసియా క్రీడల్లో సాధించిన పతకాల ప్రేరణతో మరో రెండు మూడేళ్లలో గ్రాండ్‌మాస్టర్ అవుతానని అనుకున్నా. 2019లో అండర్-12లో వరల్డ్ నంబర్ 2 ర్యాంక్‌తో పాటు ఫిడే మాస్టర్ హోదా దక్కించుకున్నా. ఈ తరుణంలో లాక్‌డౌన్ కారణంగా 2022 వరకు ప్రధాన చెస్ పోటీలన్నీ నిలిచిపోయాయి. ఆ సమయంలో నిర్వహించిన మాగ్నస్ ఛాలెంజ్‌లో వరల్డ్‌లోని మేటి టాప్-10 ప్లేయర్లు పాల్గొన్నారు. అందులో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో గ్రాండ్‌మాస్టర్ అయిన అమెరికా క్రీడాకారుడు అభిమన్యు మిశ్రాను నేను ఓడించడం అప్పట్లో ఒక సంచలనం. ఆ మూడేళ్లూ ఆన్‌లైన్ పోటీలకే పరిమితం కావాల్సి వచ్చింది. తిరిగి 2023లో చెన్నై వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో 14 ఏళ్లకే భారత్‌కు ప్రాతినిధ్యం వహించాను.
ఆర్థిక ఇబ్బందులున్నా..
కొవిడ్ తర్వాత నా కెరీర్ కోసం, నాతో మరింత సమయాన్ని వెచ్చించడానికి నాన్న ఉద్యోగం వదిలేశారు. ఐరోపాకు వెళ్లి ఎక్కువ పోటీల్లో ఆడి అనుభవం గడించడం కోసం మా ఫ్లాట్ అమ్మేశారు. అమ్మ బంగారం తాకట్టు పెట్టడంతో పాటు వ్యక్తిగత రుణాల ద్వారా రూ.25 లక్షల వరకు నా శిక్షణ కోసం నాన్న అప్పులు చేశారు. మొత్తంగా కోటిన్నర రూపాయల వరకు ఖర్చు పెట్టారు. తీవ్ర ఒత్తిళ్లతో నాన్నకు ఏడాది కిందట గుండె నొప్పి రావడంతో ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేశారు. ఆ సమయంలో అమ్మానాన్నలు పడుతున్న కష్టాల్ని చూసి ఎంతో బాధపడ్డాను. అయితే ఈ ఆలోచనలేవీ పెట్టుకోకుండా చెస్‌పై దృష్టి పెట్టాలని, దేశం గర్వించే స్థాయికి ఎదగాలని ఇంట్లోవాళ్లు నన్ను ప్రోత్సహించారు. ఆ ధైర్యంతో గత ఏడాది హంగేరీలో జరిగిన గోల్డెన్ హార్స్ టోర్నీలో తొలి జీఎం నార్మ్‌ను, గత నెలలో హంగేరిలోనే జరిగిన స్ట్రాంగ్ ఓపెన్ టోర్నీలో రెండో జీఎం నార్మ్‌ను, సోమవారం వినాయక చవితి రోజున మూడో జీఎం నార్మ్ సొంతం చేసుకొని గ్రాండ్‌మాస్టర్ హోదాను అధికారికంగా సాధించాను. నా ఈ ప్రయాణంలో ఎంతోమంది సహకరించి, భుజం తట్టారు. ఈ ఏడాది శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు రూ.11.5 లక్షల నగదు బహుమతి అందించారు. హెచ్‌పీసీఎల్, ప్రణవ ఫౌండేషన్ రూ.10 లక్షల చొప్పున సహాయం చేశాయి. అయితే మరింత మంది ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారులు తయారవ్వాలంటే కార్పొరేట్ సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా చేయూతనివ్వాలి. ఏదిఏమైనా ప్రపంచ టాప్-10 జాబితాలో చోటు సాధించడమే నా తదుపరి లక్ష్యం' అని మూగి సాహితి వర్షిణి చెప్పుకొచ్చారు.
ఇష్టమైన వంటలివే..
'లక్ష్మి అమ్మమ్మ చేసే చేపల పులుసు, ఫ్రై, అమ్మ చేసే బిర్యానీ, పాయసం అంటే నాకు చాలా ఇష్టం. చెస్ కాకుండా ఘంటసాల, సుశీల పాటలు, ‘గుండమ్మ కథ, మిస్సమ్మ’ లాంటి పాత సినిమాలు బాగా చూస్తాను. గ్రాండ్‌మాస్టర్లు కాస్పొరోవ్, బాబీ ఫిషర్, అర్జున్ ఇరిగేసి ఆటను ఇష్టపడతాను' అని వర్షిణి అన్నారు.
మరిచిపోలేని విజయం..
'2024లో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన మహిళల వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ప్రపంచ ఛాంపియన్, ఉక్రెయిన్ దిగ్గజ గ్రాండ్‌మాస్టర్ అన్నా ముజిచుక్‌పై గెలిచా. కెరీర్‌లో ఇది ఎప్పటికి మరిచిపోలేని విజయం' అని అన్నారు వర్షిణి.
-ఎస్.ఎస్.బి.సంజయ్