Share News

ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించిన సిరాజ్..

ABN , Publish Date - Jan 29 , 2026 | 09:13 PM

రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌తో ఇవాళ (జనవరి 29) మొదలైన మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్‌ చెలరేగిపోయాడు. జింఖానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించాడు. 17 ఓవర్లలో కేవలం 56 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు..

ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించిన సిరాజ్..
Mohammed Siraj

స్పోర్ట్స్ డెస్క్: రంజీ ట్రోఫీ 2025-26లో హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ మహమ్మద్ సిరాజ్ అదిరిపోయే ప్రదర్శన ఇస్తున్నాడు. ఛత్తీస్‌గఢ్‌తో ఇవాళ (జనవరి 29) మొదలైన మ్యాచ్‌లో కూడా సిరాజ్‌ చెలరేగిపోయాడు. జింఖానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించాడు. 17 ఓవర్లలో కేవలం 56 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఛత్తీస్‌గఢ్‌ మొదట బ్యాటింగ్ దిగి.. 283 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్‌తో పాటు రక్షన్‌ (9.3-1-28-2), తనయ్‌ త్యాగరాజన్‌ (20-3-81-1), హిమతేజ (4-0-18-1), అనికేత్‌ రెడ్డి (12-0-65-1) సత్తా చాటడంతో ఛత్తీస్‌ఘడ్‌ 283 పరుగులకే పరిమితమైంది. ఏడో స్థానంలో బరిలోకి దిగిన ప్రతీక్‌ యాదవ్‌ (99 బంతుల్లో 106) అనూహ్యంగా సెంచరీ చేసి.. ఛత్తీస్‌గఢ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. అతడు త్వరగా అవుట్ అయ్యి ఉంటే.. ఛత్తీస్‌గఢ్‌ జట్టు ఆ స్కోర్ కూడా చేసేది కాదు.


ప్రతీక్‌కు వికల్ప్‌ తివారి (94) సహకరించారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 183 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి జోడీని త్యాగరాజన్‌ విడగొట్టాడు. రెండు పరుగుల వ్యవధిలోనే సిరాజ్‌ సెంచరీకి చేరువైన వికల్ప్‌ తివారిని ఔట్‌ చేసి ఛత్తీస్‌గఢ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. వికల్ప్‌, ప్రతీక్‌ మినహా ఛత్తీస్‌గఢ్‌ ఇన్నింగ్స్‌లో ఎ‍వ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఆయుశ్‌ పాండే 11, అనుజ్‌ తివారి 4, సంజీత్‌ దేశాయ్‌ 1, కెప్టెన్‌ అమన్‌దీప్‌ ఖారే 16, మయాంక్‌ వర్మ 3, సహబాన్‌ ఖాన్‌ 20, ఆదిత్య సర్వత్ 4, దేవ్‌ ఆదిత్య సింగ్‌ 16 పరుగులు మాత్రమే చేశారు.


అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన హైదరాబాద్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 15 ఓవర్లకు 56 పరుగులు చేసింది. ఓపెనర్లు అమన్‌రావ్‌ 32, అభిరథ్‌ రెడ్డి 23 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ జట్టు 227 పరుగులు వెనుక ఉంది. కాగా, ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ కెప్టెన్‌గా సిరాజ్‌ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

ప్రపంచ కప్ -2026 నుంచి తప్పుకుంటే.. పాక్‌కు భారీ నష్టం!

నా రిటైర్మెంట్‌‌కు కారణం అదే.. యువీ షాకింగ్‌ కామెంట్స్‌..

Updated Date - Jan 29 , 2026 | 09:48 PM