Share News

జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. వన్డే సిరీస్ కైవసం!

ABN , Publish Date - Oct 25 , 2026 | 09:47 PM

జింబాబ్వే మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. 121 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.

జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. వన్డే సిరీస్ కైవసం!
India women won by 121 runs

ఇంటర్నెట్ డెస్క్: జింబాబ్వే మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. 121 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ శతకాలతో అదరగొట్టగా.. బౌలింగ్‌లో వైష్ణవి శర్మ నాలుగు వికెట్లతో సత్తాచాటింది. సెంచరీతో సత్తా చాటిన దీప్తి బంతితోనూ మెరిసి మూడు వికెట్లు పడగొట్టింది. (India Women vs Zimbabwe Women).


టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్‌ (121 బంతుల్లో 126), దీప్తి శర్మ (86 బంతుల్లో 126) శతకాలతో రాణించారు. ఇద్దరూ సమయోచితంగా రాణించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ప్రతీకా రావల్ (67) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడింది. 329 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే మహిళల జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి పోటీ ఇవ్వలేకపోయింది (India women win by 121 runs).


భారత యువ బౌలర్ వైష్ణవి శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టింది (Vaishnavi Sharma four wickets). పది ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను దెబ్బతీసింది. సెంచరీ చేసిన దీప్తి శర్మ బంతితో కూడా రాణించింది. మూడు వికెట్లు తీసి జింబాబ్వే వెన్ను విరిచింది. భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనతో జింబాబ్వే 48.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 121 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి వన్డేలోనూ భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లోనూ అదే ఆధిపత్యాన్ని కొనసాగించి సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను గెలుచుకుంది.


ఇవి కూడా చదవండి..

ముంబైలో తీవ్ర వాయు కాలుష్యం.. దుమ్ము, వాహనాల పొగ, నిర్మాణ పనులే ప్రధాన కారణాలు..


మామ ఇంట్లో బంగారం కాజేసి థార్ కొన్నాడు.. పూజకు ఆ మామనే ఆహ్వానిస్తే..

Updated Date - Oct 25 , 2026 | 09:47 PM