అదిరింది గురి వచ్చింది పసిడి
ABN , Publish Date - Sep 26 , 2026 | 02:08 AM
ఆసియా క్రీడల్లో ఆరో రోజున భారత అథ్లెట్లు ఆరు పతకాలతో ఆకట్టుకున్నారు. భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఇప్పటిదాకా నిరాశపర్చిన షూటర్లు శుక్రవారం మాత్రం తొలిసారి స్వర్ణంతో మెరిశారు.
షూటింగ్‌లో స్వర్ణం, రజతం
ఆసియా క్రీడల షూటింగ్‌లో పసిడి నిరీక్షణకు
పోల్‌వాల్ట్‌లో ఇలంగోవన్ చరిత్ర
రన్నర్ గుల్వీర్‌కు రజతం
షాట్‌పుట్, టీటీలో కాంస్యాలు
ఆసియా క్రీడలు
తెర దించుతూ.. ఆరో రోజు షూటర్లు ఓ స్వర్ణం, రజతం సాధించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో జోరు కొనసాగిస్తూ అథ్లెట్లు మరో మూడు పతకాలు కొల్లగొట్టగా.. టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు కంచు మోత మోగించారు. మొత్తంగా శుక్రవారం పోటీల్లో ఆరు పతకాలు నెగ్గిన భారత్.. పట్టికలో 23 పతకాలతో 12వ స్థానంలో కొనసాగుతోంది.
నగోయా: ఆసియా క్రీడల్లో ఆరో రోజున భారత అథ్లెట్లు ఆరు పతకాలతో ఆకట్టుకున్నారు. భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఇప్పటిదాకా నిరాశపర్చిన షూటర్లు శుక్రవారం మాత్రం తొలిసారి స్వర్ణంతో మెరిశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో కమల్జీత్-సురుచి ఇందర్ సింగ్ జోడీ చాంపియన్‌గా నిలిచింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లోనూ భారత షూటర్లు రజతంతో మురిపించారు. అథ్లెటిక్స్ పోటీల రెండో రోజు కూడా భారత అథ్లెట్లు మూడు పతకాలతో సత్తా చాటుకున్నారు. పురుషుల 10 వేల మీటర్ల రిలేలో రజతం, మహిళల పోల్‌వాల్ట్, షాట్‌పుట్‌లో ఒక్కో కాంస్యం భారత్ ఖాతాలో చేరింది. టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ సెమీఫైనల్లో భారత జోడీ ఓడి కాంస్యంతో సంతృప్తి చెందింది.
షూటింగ్‌లో ఎట్టకేలకు..
షూటింగ్‌లో భారత్ స్వర్ణ పతక ఎదురుచూపులకు కమల్జీత్-సురుచి ఇందర్ సింగ్ తెరదించారు. అంతకు ముందు రెండ్రోజుల క్రితం నాటి పోటీల్లో ఈ ఇద్దరు తమ టీమ్స్, వ్యక్తిగత విభాగాల్లో పేలవ ప్రదర్శనతో నిరాశపర్చారు. కానీ శుక్రవారం బరిలోకి దిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో మాత్రం వీరి గురి తప్పలేదు. 484.6 పాయింట్లతో ఆసియా గేమ్స్ రికార్డు నెలకొల్పి మరీ స్వర్ణం అందుకున్నారు. హరియాణాకు చెందిన 20 ఏళ్ల సురుచి 245.7, తొలిసారి ఈ గేమ్స్‌లో పాల్గొన్న కమల్జీత్ 238.9 పాయింట్లను అందించారు.
దక్షిణ కొరియా జోడీ (478.0)కి రజతం, ఇరాన్ జంట (415.8)కు కాంస్యం దక్కాయి. ఇక, పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంక్ష్ పాటిల్, నీరజ్ కుమార్‌లతో కూడిన భారత త్రయం రజతం అందుకుంది. భారత బృందం 1762 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. చైనా (1766) స్వర్ణం, దక్షిణ కొరియా (1751) కాంస్యం అందుకున్నాయి.
టీటీ సెమీ్‌సలో ఓడినా..
టేబుల్ టెన్ని్‌సలో భారత్ పతకాల బోణీ చేసింది. మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్ సెమీఫైనల్లో మానుష్ షా-దియా చిటాలే 8-11, 5-11, 8-11, 2-11తో చైనా జంట వాంగ్ చుకిన్-సున్ ఇంగ్‌షా చేతిలో ఓడారు. దీంతో నిబంధనల ప్రకారం భారత జోడీకి కాంస్యం దక్కింది. ఆసియా క్రీడల్లో టీటీ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కిది రెండో పతకం. ఎనిమిదేళ్ల క్రితం శరత్ కమల్, మనికా బత్రా ద్వయం కాంస్యం సాధించింది. మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ, పురుషుల సింగిల్స్‌లో మానవ్ రౌండ్-32లోనే ఓడారు.
పోల్‌వాల్ట్‌లో తొలిసారి..
ఆసియాడ్ మహిళల పోల్ వాల్ట్‌లో దేశానికి తొలిసారిగా పతకం అందించిన అథ్లెట్‌గా తమిళనాడుకు చెందిన 29 ఏళ్ల బరానికా ఇలంగోవన్ చరిత్ర సృష్టించింది. ఫైనల్లో ఇలంగోవన్ 4.25 మీటర్ల ఎత్తుతో కజకిస్థాన్ ప్లేయర్ పోలినాతో కలిసి కాంస్యం అందుకుంది. అయితే తనతో పాటు ఫైనల్లో అడుగుపెట్టిన భారత అథ్లెట్ సింధుశ్రీ గణేశ 3.85మీ. ఎత్తుకే పరిమితమై రేసు నుంచి తప్పుకొంది. మహిళల షాట్‌పుట్ ఫైనల్లో మన్‌ప్రీత్ కౌర్ 17.17 మీ. దూరం విసిరి కాంస్య పతకాన్ని సాధించింది. 2023 తర్వాత ఆమెకు ఇదే మేజర్ అంతర్జాతీయ టోర్నీ పతకం.
భారత లాంగ్ డిస్టెన్స్ స్టార్ రన్నర్ గుల్వీర్ సింగ్ వరుసగా రెండోసారి ఆసియాడ్‌లో పతకంతో అదరగొట్టాడు. గత క్రీడల్లో కాంస్యాన్ని ఈసారి మెరుగుపర్చుకున్నాడు. పురుషుల 10,000 మీటర్ల రేసులో గత క్రీడల్లో కాంస్యం నెగ్గిన 28 ఏళ్ల గుల్వీర్ ఈసారి తన ప్రదర్శనను మెరుగుపరచుకుంటూ రజతం సాధించాడు. ఫైనల్ రేసులో గుల్వీర్ 28 నిమిషాల 29.38 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచాడు. బహ్రెయిన్‌కు చెందిన డిఫెండింగ్ చాంప్ బిర్హను బాలె (బహ్రెయిన్) స్వర్ణం, ఆల్బర్ట్ కిప్టో కాంస్యం చేజిక్కించుకున్నారు. ఈ ప్రదర్శనతో గుల్వీర్.. 10వేల మీటర్ల రేసులో వరుసగా రెండుసార్లు ఆసియాడ్‌లో పతకాలు అందుకున్న భారత అథ్లెట్‌గా రికార్డుకెక్కాడు.
పతకాల పట్టిక
దేశం | స్వ | ర | కాం | మొ |
1. చైనా | 98 | 37 | 24 | 159 |
2. జపాన్ | 28 | 43 | 44 | 115 |
3. ద.కొరియా | 13 | 17 | 34 | 64 |
4. కజకిస్థాన్ | 8 | 8 | 14 | 30 |
5. ఉజ్బెకిస్థాన్ | 7 | 15 | 9 | 31 |
6. థాయ్‌లాండ్ | 7 | 6 | 8 | 21 |
7. ఇరాన్ | 6 | 11 | 7 | 24 |
8. హాంకాంగ్ | 4 | 11 | 11 | 26 |
9. ఉ.కొరియా | 4 | 4 | 3 | 11 |
10. బహ్రెయిన్ | 4 | 2 | 2 | 8 |
12. భారత్ | 2 | 9 | 12 | 23 |
గమనిక- స్వ: స్వర్ణం; ర: రజతం; కాం: కాంస్యం; మొ: మొత్తం
ఈ వార్తలనూ చదవండి: