Share News

పేసర్లు రాణించేనా?

ABN , Publish Date - Sep 30 , 2026 | 02:54 AM

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సను ఖాతాలో వేసుకోవాలనుకుంటున్న భారత్‌కు నిలకడలేని పేస్‌ బౌలింగ్‌ ఆందోళన కలిగిస్తోంది. తొలి మ్యాచ్‌ను బ్యాటర్ల అండతో గెలిచిన గిల్‌ సేన బుధవారం రెండో వన్డేకు సిద్ధమవుతోంది.

పేసర్లు రాణించేనా?
India Vs West Indies Second ODI

  • బ్యాటింగే బలంగా భారత్‌

  • గెలిచి నిలవాలని విండీస్‌

  • నేడు రెండో వన్డే

  • మ. 2 గం. నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..

గువాహటి: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సను ఖాతాలో వేసుకోవాలనుకుంటున్న భారత్‌కు నిలకడలేని పేస్‌ బౌలింగ్‌ ఆందోళన కలిగిస్తోంది. తొలి మ్యాచ్‌ను బ్యాటర్ల అండతో గెలిచిన గిల్‌ సేన బుధవారం రెండో వన్డేకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌ విజయంతో సిరీ్‌సను అందుకోవాలనుకుంటోంది. అటు విండీ్‌సకు మాత్రం చావోరేవో లాంటి పరిస్థితి నెలకొంది. తొలి మ్యాచ్‌లో బ్యాటర్లు మెరుగ్గా ఆడినా.. భారత బ్యాటింగ్‌ ముందు ఆ జట్టు బౌలర్లు తేలిపోయారు. అందుకే సిరీ్‌సలో నిలవాలంటే తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. దీనికి తోడు సెంచరీతో జోరు మీదున్న ఓపెనర్‌ గ్రీవ్స్‌ తొడ కండరాల గాయంతో ఈ మ్యాచ్‌కు దూరం కావడం జట్టుకు గట్టి దెబ్బే. దీంతో జెవెల్‌ ఆండ్రూ ఆర్డర్‌లో ముందుకు రానున్నాడు. ఇక తొలి వన్డేకు దూరమైన రూథర్‌ఫోర్డ్‌ ఆడే అవకాశం ఉంది.


విరాట్‌ ఆకర్షణగా..: నేటి పోరులోనూ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాడు. తిరువనంతపురంలో అతడి రికార్డు మెరుపు సెంచరీ అభిమానులను ఉర్రూతలూగించింది. అటు కెప్టెన్‌ గిల్‌ కూడా చెలరేగడంతో 42 ఓవర్లలోనే 296 పరుగులకు ఛేదించింది. వెటరన్‌ రోహిత్‌ కాస్త ఎక్కువ సమయం క్రీజులో నిలిస్తే భారీ స్కోరు ఖాయమే. ఈ స్టేడియంలో తనకు ఓ సెంచరీ అనుభవం కూడా ఉంది. మరోవైపు ఈ మైదానంలో జరిగిన రెండు వన్డేల్లోనూ విరాట్‌ శతకాలు బాదడం విశేషం. అయితే బౌలింగ్‌లో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఒక్కడే ప్రభావం చూపాడు.


పేసర్లు మాత్రం తీవ్రంగా నిరాశపర్చారు. సిరాజ్‌ను పక్కనబెట్టి నితీశ్‌ కుమార్‌తో ప్రయోగాత్మకంగా కొత్త బంతితో వేయిస్తే తను ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. గాయం నుంచి కోలుకుని ఆడుతున్న అతడు లయను కోల్పోయాడు. హార్దిక్‌ గాయంతో, బుమ్రా ఆసియాగేమ్స్‌లో ఆడుతుండడంతో వన్డే వరల్డ్‌కప్‌ కోసం భారత్‌ తమ యువ బౌలర్లను పరీక్షించాలనుకుంటోంది. కానీ ప్రసిద్ధ్‌, బ్రార్‌ సైతం విండీస్‌ను కట్టడి చేయలేకపోయారు. దీంతో రెండో వన్డేలో సిరాజ్‌ను ఆడిస్తారా? లేక కశ్మీర్‌ పేసర్‌ అకీబ్‌ నబీకి అరంగేట్ర అవకాశం ఇస్తారా? చూడాల్సిందే.


ఇవి కూడా చదవండి:

క్రికెట్‌లో భారత్‌ సెమీస్‌ ప్రత్యర్థి శ్రీలంక

ఆసియాడ్‌లో నేటి భారత షెడ్యూల్‌

Updated Date - Sep 30 , 2026 | 02:54 AM