Share News

అన్షుల్‌పై వేటు.. జడేజాకు చోటు?

ABN , Publish Date - Nov 26 , 2026 | 03:34 AM

న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్‌ పట్టుబిగించినా.. కివీస్‌ బ్యాటర్ల పోరాటంకారణంగా డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాలుగో ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయడంలో...

అన్షుల్‌పై వేటు.. జడేజాకు చోటు?

  • తుది జట్టుపై కసరత్తు

  • రేపటినుంచే రెండో టెస్టు

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్‌ పట్టుబిగించినా.. కివీస్‌ బ్యాటర్ల పోరాటంకారణంగా డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాలుగో ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయడంలో టీమిండియా బౌలర్ల వైఫల్యంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో జట్టు బౌలింగ్‌ కూర్పుపై మేనేజ్‌మెంట్‌ డైలమాలో పడింది. పేసర్లకు సహకరిస్తున్న పిచ్‌పై అన్షుల్‌ కాంబోజ్‌ ఆశించిన రీతిలో ఆకట్టుకోలేక పోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మూడు వికెట్లు పడగొట్టినా.. అతడి బౌలింగ్‌లో పదును లోపించింది. స్వింగ్‌, బౌన్స్‌ రాబట్టలేకపోవడంతో ప్రత్యర్థి బ్యాటర్లను పెద్దగా ఇబ్బందిపెట్టలేక పోయాడు. పరిమిత వేగం కారణంగా కాంబోజ్‌ షార్ట్‌ బాల్స్‌ ప్రభావం చూపలేక పోయాయి. దీంతో శుక్రవారం నుంచి క్రైస్ట్‌చర్స్‌లో జరిగే రెండో, ఆఖరి టెస్ట్‌లో నాలుగో పేసర్‌ వ్యూహాన్ని పక్కనబెట్టి.. అనుభవజ్ఞుడైన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు తుది జట్టులో చోటు కల్పిస్తారనే టాక్‌ నడుస్తోంది. ఇదే జరిగితే వాషింగ్టన్‌ సుందర్‌పై కూడా వేటుపడొచ్చు. మరోవైపు వికెట్‌పై బౌన్స్‌ ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చన్న వార్తలు వస్తున్న తరుణంలో పొడగరి అయిన ఫాస్ట్‌ బౌలర్‌ గుర్నూర్‌ బ్రార్‌ కూడా పరిశీలనలో ఉన్నాడు. కాగా, 17 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌లో టెస్ట్‌ సిరీస్‌ సొంతం చేసుకొనే అరుదైన అవకాశం ఇప్పుడు భారత్‌ను ఊరిస్తోంది. టీ20, వన్డే సిరీ్‌సలు గెలిచిన టీమిండియా.. చివరి టెస్ట్‌లో గెలిస్తే వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ అవకాశాలు కూడా సజీవంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పు గంభీర్‌కు కత్తిమీద సాములా మారింది. తొలి మ్యాచ్‌లో పక్కనబెట్టిన సిరాజ్‌ను కూడా జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్‌ కూడా గట్టిగానే వినవస్తోంది. కానీ, వికెట్‌ను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటామని టీమిండియా మేనేజ్‌మెంట్‌ చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 26 , 2026 | 03:34 AM