కీలక అథ్లెట్ల గాయాలపై ప్రశ్నలు
ABN , Publish Date - Oct 16 , 2026 | 06:04 AM
జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ ఆశించిన రీతిలో పతకాలను కొల్లగొట్టలేక పోయింది. భారీగా అంచనాలున్న అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్‌లో ప్రదర్శన నిరాశపర్చిం ది. ఈ క్రమంలో ఆసియాడ్‌లో భారత...
భవిష్యత్ కార్యాచరణలపై సూచనలు
ఆసియాడ్ ప్రదర్శనపై సమీక్షా సమావేశం
జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ ఆశించిన రీతిలో పతకాలను కొల్లగొట్టలేక పోయింది. భారీగా అంచనాలున్న అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్‌లో ప్రదర్శన నిరాశపర్చిం ది. ఈ క్రమంలో ఆసియాడ్‌లో భారత ప్రదర్శనపై గురువారం న్యూఢిల్లీలో కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ సమీక్షా సమావేశం నిర్వహించింది. గాయాల బారినపడిన అథ్లె ట్లు జ్యోతి యర్రాజి, ప్రవీణ్ చిత్రవేల్‌కు ఆసియాడ్‌కు వెళ్లేందుకు ఎలా అనుమతి లభించిందనే ప్రశ్న కూడా ఈ సందర్భంగా లేవనెత్తారు. కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సహాయ మంత్రి రక్షా ఖడ్సే, భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష తదితరులు పాల్గొన్నారు. అయిచి-నగోయ క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు సహా మొత్తం 85 పతకాలు సాధించింది. గత హాంగ్జౌ క్రీడల్లో గెలిచిన 106 పతకాల కంటే ఇవి చాలా తక్కువ. ‘మౌలిక వసతుల కొరత లేదు. ఆర్థిక సహకారం లేదని క్రీడా సమాఖ్యలు ఇక మీదట ఫిర్యాదులు చేయలేవు. ప్రదర్శనలకే పరిమితం కాకుండా ఫలితాలను అందించాలి. అయితే, చెప్పుకోదగ్గ స్థాయిలో అవి లేవ’ని ఓ ప్రధాన అధికారి అన్నారు. పోటీల సమయంలో జ్యోతి, ప్రవీణ్ ఆశ్చర్యకర రీతిలో గాయాలపాలు కావడంపై ఉష ప్రశ్నించినట్టు సమాచారం. ట్రాక్ అండ్ ఫీల్డ్స్‌లో హాంగ్జౌలో భారత్ ఆరు బంగారు పతకాలు సాధిస్తే.. ఈసారి ఒక్క స్వర్ణానికే పరిమితమైంది. సమాఖ్యలు తమదైన విశ్లేషణలు ఇవ్వగా.. భవిష్యత్ టోర్నీలకు సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ సూచించినట్టు చెప్పారు. కాగా ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి వారికి తగిన రీతిలో శిక్షణ ఇచ్చి అత్యున్నత స్థాయికి చేరుకునేలా కృషిచేయాలని క్రీడామంత్రి మాండవీయ కోరారు. ఈ మేరకు క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఒక్క మీరాబాయి.. మన కోసం ఎన్నిసార్లు పతకాలు గెలుస్తుంది? మరో 10 మంది మీరాబాయిలను తయారు చేయాలి. ఈ దిశగా ప్రతి సమాఖ్య బాధ్యత తీసుకోవాల’ని సూచించారు.
Also Read:
గంగూలీకి అసిస్టెంట్‌గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!
జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు
పతకాలు కేవలం అంకెలు కావు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ