న్యూజిలాండ్-ఏపై భారత్-ఏ భారీ స్కోర్..
ABN , Publish Date - Nov 08 , 2026 | 01:38 PM
న్యూజిలాండ్ ఏ జట్టుతో జరుగుతున్న మూడో అనధికారిక టెస్టులో భారత ఏ జట్టు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 428 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ ఏ జట్టుతో జరుగుతున్న మూడో అనధికారిక టెస్టులో భారత ఏ జట్టు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 428 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాటర్లు ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ అర్ధసెంచరీలతో రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అనంతరం ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ఏ జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు (India A vs New Zealand A 2026).
లింకన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు భారత్ ఏ జట్టు 227/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించింది. ధ్రువ్ జురెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 95 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు సాధించాడు. అనంతరం తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ కూడా హాఫ్ సెంచరీలు చేసి భారీ స్కోరుకు బాటలు వేశారు. తిలక్ వర్మ 131 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరికి 81 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ 107 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 114 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు (India A 428 Run Lead).
రవీంద్ర జడేజా 25 పరుగులు చేశాడు. చివరకు భారత్ ఏ జట్టు 146 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 464 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్-ఏ ఓపెనర్లు రైస్ మారియూ, కర్టిస్ హీఫీలను పెవిలియన్‌కు పంపించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్-ఏ జట్టు 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ 10, జాక్ గిబ్సన్ ఒక పరుగు చేసి క్రీజులో ఉన్నారు. భారత-ఏ జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరుతో పోలిస్తే న్యూజిలాండ్ ఇంకా 428 పరుగులు వెనుకబడి ఉంది.
ఇవి కూడా చదవండి..
మైదానంలోకి ప్లాస్టిక్ బ్యాట్ విసిరిన అభిమాని.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి..
స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..