Share News

రొనాల్డో గుడ్‌బై

ABN , Publish Date - Nov 06 , 2026 | 07:08 AM

క్రిస్టియానో రొనాల్డో.. మైదానంలో అతడి వేగం ప్రత్యర్థులకు వణుకే. బంతి అతడి కాళ్లకు చిక్కితే గోల్‌ పోస్టుపై దండయాత్రే. అమాంతం గాల్లోకి ఎగిరి అతడు సంధించే...

రొనాల్డో గుడ్‌బై

అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు

ఏడో నెంబర్‌ జెర్సీని తిరిగిచ్చేస్తున్నా..

అల్‌ నాసర్‌ క్లబ్‌ తరఫున

కొనసాగుతానని ప్రకటన

క్రిస్టియానో రొనాల్డో.. మైదానంలో అతడి వేగం ప్రత్యర్థులకు వణుకే. బంతి అతడి కాళ్లకు చిక్కితే గోల్‌ పోస్టుపై దండయాత్రే. అమాంతం గాల్లోకి ఎగిరి అతడు సంధించే హెడర్లు అభిమానులకు కనువిందే. రికార్డులు అతడి వెంట పరుగులు తీశాయి. విజయాలు తన చిరునామాగా మారాయి. కానీ పోర్చుగల్‌ నుంచి అత్యున్నత శిఖరాల దాకా సాగించిన ప్రయాణాన్ని రొనాల్డో ముగించాడు. ఇక అంతర్జాతీయ పోటీలో నెంబర్‌ 7 జెర్సీని చూడలేం. జాతీయ జట్టు నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్టు 41 ఏళ్ల రొనాల్డో ప్రకటించాడు. అయితే క్లబ్‌ మ్యాచ్‌లలో కొనసాగుతానని తెలిపాడు.

లిస్బన్‌: ఆధునిక ఫుట్‌బాల్‌ చరిత్రలో మరో శకం ముగిసింది. సరిగ్గా నెల క్రితం అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లియోనెల్‌ మెస్సీ చివరి ఆట ఆడేయగా.. తాజాగా పోర్చుగల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కూడా అదే బాటన నడిచాడు. రెండు దశాబ్దాల తన అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్టు గురువారం సోషల్‌ మీడియాలో ప్రకటించాడు. అయితే సౌదీ అరేబియాకు చెందిన అల్‌ నాసర్‌ క్లబ్‌ తరఫున మాత్రం కొనసాగుతానని వెల్లడించాడు. ఫుట్‌బాల్‌ చరిత్రలో పలు రికార్డులను తన పేరిట లఖించుకున్న 41 ఏళ్ల రొనాల్డో.. దేశం తరఫున 234 మ్యాచ్‌లు ఆడాడు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో 146 గోల్స్‌ కొట్టాడు. ‘పోర్చుగీస్‌ ప్రజలారా.. మన జట్టుకు చెందిన నెంబర్‌. 7 జెర్సీని తిరిగి ఇచ్చే సమయం వచ్చేసింది. ఈ జెర్సీ నా ఒక్కడిదే అని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ 23 ఏళ్లుగా అది నా ఒంటిపైనే ఉండడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టేడియాలకు నాతోపాటు తీసుకెళ్లే అదృష్టం దక్కింది. ఇక భవిష్యత్‌ తరాలకు దీన్ని అందించే సమయం ఆసన్నమైంది. 2003, ఆగస్టులో ఆరంభమై నా జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసిన ప్రయాణం ఇక ముగిసింది. గోల్స్‌ వస్తుంటాయి, పోతుంటాయి. ట్రోఫీలు మ్యూజియాలకు చేరుతుంటాయి. రికార్డులు బద్దలవుతుంటాయి. కానీ ప్రజల హృదయాల్లో స్థానాన్ని మాత్రం ఎవరూ చెరిపి వేయలేరని తెలుసుకున్నా’ అని వీడియో సందేశంలో రొనాల్డో భావోదేగ్వంతో స్పందించాడు.


ప్రధాన కోచ్‌తో పొసగక..: అక్టోబరులో నేషన్స్‌ లీగ్‌ మ్యాచ్‌ కోసం రొనాల్డోను పోర్చుగల్‌ కోచ్‌ జార్జి జీసస్‌ తుది జట్టులోకి తీసుకోలేదు. అతడు జట్టు సబ్‌స్టిట్యూట్‌గా ఉండడం 18ఏళ్లలో ఇదే తొలిసారి. దీన్ని అవమానంగా భావించిన రొనాల్డో వెంటనే జట్టు శిబిరం నుంచి వాకౌట్‌ చేశాడు. అనంతరం జట్టు ఆటగాళ్లకు తన ప్రవర్తనపై క్షమాపణలు చెప్పినా, కోచ్‌ను మాత్రం పట్టించుకోలేదు. డెన్మార్క్‌, వేల్స్‌ జట్లతో జరిగే నేషన్స్‌ లీగ్‌ మ్యాచ్‌ల కోసం జాతీయ జట్టును ప్రకటించడానికి ఒకరోజు ముందే రొనాల్డో రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రొనాల్డో తన చివరి మ్యాచ్‌ను సెప్టెంబరు 24న వేల్స్‌పై ఆడాడు.

ఫిఫా కప్‌ అందుకోకుండానే..

23 ఏళ్ల కెరీర్‌లో రొనాల్డో ఎన్నో ఘనతలు సాధించాడు. కెప్టెన్‌గా పోర్చుగల్‌కు 2016లో తొలి యూరో చాంపియన్‌షి్‌పను, 2019, 2025ల్లో నేషన్స్‌ లీగ్‌ కప్‌లను అందించాడు. అయితే ఆటపరంగా ఎంత పేరు తెచ్చుకున్నా, అతనికి ఫిఫా వరల్డ్‌కప్‌ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. దేశం తరఫున అత్యధికంగా ఆరు సార్లు ఈ మెగా టోర్నీలో పాల్గొన్నా ఫలితం లేకపోయింది. రొనాల్డో తొలిసారి పాల్గొన్న (2006) టోర్నీలో మాత్రం జట్టు అత్యుత్తమంగా సెమీస్‌ దాకా చేరింది. ఇక ఈ ఏడాది వరల్డ్‌క్‌పలో క్వార్టర్స్‌తోనే జట్టు ప్రయాణం ముగిసింది.

అంతర్జాతీయ ఘనతలు

అత్యధిక మ్యాచ్‌లు 234

అత్యధిక గోల్స్‌ 146

అత్యధిక హ్యాట్రిక్స్‌ 10

పోర్చుగల్‌ తరఫున

ఎక్కువ వరల్డ్‌కప్‌ గోల్స్‌ 11

బాలన్‌ డి ఓర్‌ అవార్డులు 5

ఫిఫా ఉత్తమ ఆటగాడి అవార్డులు 5

ఆడిన 6 వరల్డ్‌క్‌పలలో గోల్స్‌ చేసిన రికార్డు

ఈ వార్తలు కూడా చదవండి

లాస్ ఏంజెలెస్ సిటీ అటార్నీగా భారత సంతతి మహిళ..

పొత్తు లేకపోతే అన్ని స్థానాల్లో పోటీ చేస్తాము: చిరాగ్ పాశ్వాన్‌

Updated Date - Nov 06 , 2026 | 07:08 AM