ఆ ఇద్దరి స్ఫూర్తితో..
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:06 AM
చిగురుపాటి వెంకట నాగ విజయ సుభాష్.. యూఏఈ వేదికగా శనివారం ఉత్కంఠభరితంగా జరిగిన అండర్-19 ఆసియా వన్డే కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్...
ఆంధ్రజ్యోతితో ఆసియా కప్ స్టార్ వెంకట విజయ సుభాష్
చిగురుపాటి వెంకట నాగ విజయ సుభాష్.. యూఏఈ వేదికగా శనివారం ఉత్కంఠభరితంగా జరిగిన అండర్-19 ఆసియా వన్డే కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయంలో తనవంతు పాత్ర పోషించిన తెలుగు తేజం. దేశవాళీ క్రికెట్ పోటీల్లో గోవా తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నా.. జన్మనిచ్చిన తెలుగునేల అంటే తనకు పంచ ప్రాణాలన్నాడు సుభాష్. ఇక, క్రికెట్ కెరీర్‌లో తాను ఎదిగేందుకు రాహుల్ ద్రవిడ్, ఆశిష్ నెహ్రా స్ఫూర్తి అంటున్న 18 ఏళ్ల సుభాష్.. ఆంధ్రజ్యోతితో పంచుకున్న విశేషాలు అతడి మాటల్లోనే తెలుసుకుందాం.
గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మా స్వస్థలం. అమ్మ పార్వతి గృహిణి. నాన్న పూర్ణచందర్‌రావు ఉద్యోగరీత్యా 2006లో గోవా వెళ్లారు. మధ్యలో కొంతకాలం మా కుటుంబం మస్కట్ వెళ్లినా తిరిగొచ్చి గోవాలోనే స్థిరపడ్డాం. నేను క్రికెట్ ఓనమాలు నేర్చుకొంది గోవాలోనే. మస్కట్‌లో కొంతకాలం ఒమన్ క్రికెట్ అకాడమీలోనూ సాధన చేశా. గోవా తిరిగొచ్చాక అండర్-16 స్థాయి నుంచి ఇక్కడ నిర్వహించిన శిక్షణ శిబిరాల్లో రాటుదేలా.
సంక్రాంతికి ఊరు వెళ్లాల్సిందే..: సంక్రాంతి వచ్చిందంటే మా సొంతూరు వెళ్లాల్సిందే. తాతయ్య నాగేశ్వరరావు, నానమ్మ విజయకుమారితో కలిసి పండుగ జరుపుకొంటా. వీలు కుదిరినప్పుడల్లా ఊళ్లో జరిగే పండుగలు, శుభకార్యాలకు హాజరవుతుంటా. అమ్మ వాళ్లది నాగాయలంక. అక్కడికి కూడా తరచూ వెళుతుంటా.
వాళ్ల ఆట చాలా ఇష్టం: రాహుల్ ద్రవిడ్ స్ఫూర్తితో వికెట్‌కీపర్, బ్యాటర్‌గా కెరీర్‌ను ప్రారంభించా. ఆ తర్వాత బౌలింగ్‌పై దృష్టి పెట్టా. ఇప్పటికీ కీపింగ్, బ్యాటింగ్ ఇష్టమే కానీ బౌలింగ్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నా. ఆశిష్ నెహ్రా బౌలింగ్ చాలా ఇష్టం. అతనిలా జట్టుకోసం కష్టపడాలనుకుంటున్నా. ఇక, ఆసియాకప్ ఫైనల్లో పాక్‌పై చేసిన ప్రదర్శన నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భవిష్యత్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాలనేది నా లక్ష్యం.
(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్)
ఇవి కూడా చదవండి:
బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లు పోరాడి జట్టును గెలిపించారు: శ్రేయస్ అయ్యర్
డబ్ల్యూపీఎల్ 2027: ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే.. వేదిక మార్చిన బీసీసీఐ