Share News

ఆర్జనలోనూ ‘వైభవ’మే

ABN , Publish Date - Jun 02 , 2026 | 03:10 AM

గతేడాది ఐపీఎల్‌లో చమక్కున మెరిసిన చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఏడాది తిరిగేసరికి క్రికెట్‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పేసుకున్నాడు. ఆదివారం ముగిసిన 19వ సీజన్‌లో రికార్డులను కొల్లగొడుతూ...

ఆర్జనలోనూ ‘వైభవ’మే

ఈ ఏడాది లీగ్‌ సంపాదన రూ.3 కోట్లు

న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్‌లో చమక్కున మెరిసిన చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఏడాది తిరిగేసరికి క్రికెట్‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పేసుకున్నాడు. ఆదివారం ముగిసిన 19వ సీజన్‌లో రికార్డులను కొల్లగొడుతూ అంతా వైభవోపేతం చేసేశాడు. అగ్రశ్రేణి బ్యాటర్లను తోసిరాజంటూ ఈ 15 ఏళ్ల చిన్నోడు ఏకంగా 776 పరుగులు బాదేసి ఆరెంజ్‌ క్యాప్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఇంతలా క్రేజ్‌ తెచ్చుకున్న వైభవ్‌ ఆదాయం కూడా కళ్లు బైర్లు కమ్మే రీతిలో పెరుగుతోంది. వైభవ్‌కు రాజస్థాన్‌ ఫ్రాంచైజీ నుంచి రూ.1.10 కోట్ల వేతనం లభిస్తుంది. దీంతో పాటు ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్‌కు ఆటగాళ్లకు రూ.7.50 లక్షలు దక్కుతాయి. ఈ లెక్కన తను ఆడిన 16 మ్యాచ్‌లకు రూ.కోటీ 20 లక్షలు అందగా, అత్యంత విలువైన ఆటగాడిగా రూ.15 లక్షలు, ఆరెంజ్‌ క్యాప్‌ ఆటగాడిగా రూ.10 లక్షలు, సూపర్‌ స్ట్రయికర్‌ ఆఫ్‌ ద సీజన్‌గా రూ.10 లక్షలతో పాటు సియోరా కారు, సూపర్‌ సిక్సెస్‌ ఆఫ్‌ ద సీజన్‌గా నిలిచినందుకు రూ.10 లక్షలు, ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా రూ.10 లక్షలతో పాటు ఆయా మ్యాచ్‌ల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, సూపర్‌ స్ట్రయికర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, మోస్ట్‌ సిక్సెస్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కింద మరికొంత అందాయి. ఇవన్నీ లెక్కగడితే ఈ ఏడాది రూ.2 కోట్ల 90 లక్షలు టీనేజర్‌ వైభవ్‌ ఇంటికి తీసుకెళ్లినట్టయ్యింది.

ఇవి కూడా చదవండి...

ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం

Updated Date - Jun 02 , 2026 | 03:10 AM