Share News

నాయకుడు నిలిచాడు

ABN , Publish Date - Feb 08 , 2026 | 06:13 AM

కెప్టెన్‌గా తొలి టీ20 వరల్డ్‌క్‌పలో సూర్యకుమార్‌ యాదవ్‌ (49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 నాటౌట్‌) చెలరేగాడు. యూఎ్‌సఏ బౌలర్ల విశేష రాణింపుతో భారత బ్యాటర్లు తడబడిన వేళ.. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో...

నాయకుడు నిలిచాడు

నేటి మ్యాచ్‌లు

న్యూజిలాండ్‌ X అఫ్ఘానిస్థాన్‌

(ఉ. 11 గం. నుంచి)

ఇంగ్లండ్‌ X నేపాల్‌ (మ.3 గం.)

శ్రీలంక X ఐర్లాండ్‌ (రా.7 గం.)

టీ20 ప్రపంచకప్‌

భారత్‌దే విజయం

  • ఆదుకున్న సూర్య

  • పోరాడి ఓడిన అమెరికా

  • సిరాజ్‌కు 3 వికెట్లు

ముంబై: కెప్టెన్‌గా తొలి టీ20 వరల్డ్‌క్‌పలో సూర్యకుమార్‌ యాదవ్‌ (49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 నాటౌట్‌) చెలరేగాడు. యూఎ్‌సఏ బౌలర్ల విశేష రాణింపుతో భారత బ్యాటర్లు తడబడిన వేళ.. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలిచాడు. అటు పేసర్‌ సిరాజ్‌ (3/29) కమ్‌బ్యాక్‌ బౌలింగ్‌తో ఆకట్టుకోగా.. గ్రూప్‌ ‘ఎ’లో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియా 29 పరుగులతో బోణీ చేసింది. ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (25), ఇషాన్‌ (20) మోస్తరుగా ఆడారు. పేసర్‌ వాన్‌ షాక్విక్‌కు 4, హర్మీత్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసి ఓడింది. శుభమ్‌ (37), సంజయ్‌ (37), మిలింద్‌ (34) మాత్రమే రాణించారు. సిరాజ్‌కు 3, అర్ష్‌దీ్‌పనకు 2 వికెట్లు లభించాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సూర్యకుమార్‌ నిలిచాడు.

పోరాటం సరిపోలేదు..: యూఎస్‌ మొదట్లోనే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. వరుస ఓవర్లలో పేసర్‌ సిరాజ్‌ రెండు వికెట్లు తీయగా, 13 పరుగులకే టాప్‌-3 బ్యాటర్లు పెవిలియన్‌కు చేరడం దెబ్బతీసింది. అయితే మిడిలార్డర్‌లో మిలింద్‌, సంజయ్‌ కాసేపు ఆశలు కల్పించారు. ఈ జోడీ సంయమన ఆటతీరుతో నాలుగో వికెట్‌కు 58 పరుగులు జత చేరాయి. చక్కగా కుదురుకున్న వీరిని వరుణ్‌ విడదీశాడు. తను మిలింద్‌ను అవుట్‌ చేయగా, కాసేపటికే సంజయ్‌ను అక్షర్‌ దెబ్బతీశాడు. దీంతో యూఎస్‌ సాధించాల్సిన రన్‌రేట్‌ కష్టసాధ్యంగా మారింది. చివర్లో శుభమ్‌ మెరుపులు ఓటమి తేడాను తగ్గించాయి.


తడబ్యాటుతో మొదలై.. సూర్య అండతో నిలిచి: టాస్‌ గెలిచిన యూఎస్‌ కెప్టెన్‌ మోనంక్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతో వాంఖడే స్టేడియం హోరెత్తింది. ఇంకేముంది.. భీకర ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు కనీసం 200 స్కోరైనా బాదేస్తారని అంతా భావించారు. కానీ బరిలోకి దిగాక మనోళ్ల ఆటతీరు అంచనాలకు భిన్నంగా సాగింది. బంతి బ్యాట్‌ మీదికి రాకపోగా అటు ఎక్స్‌ట్రా బౌన్స్‌, చక్కటి టర్న్‌తో యూఎస్‌ బౌలర్లు ఆధిపత్యం చూపారు. అయితే ఓ ఎండ్‌లో వికెట్లు కూలుతున్నా కెప్టెన్‌ సూర్య నిలకడైన ఇన్నింగ్స్‌తో ఆఖరి బంతి వరకు నిలిచి పరువు కాపాడాడు. ఓపెనర్‌ అభిషేక్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం ఇషాన్‌, తిలక్‌ పోటాపోటీ బౌండరీలతో జోష్‌ తెచ్చినా, ఆ సంబరం కాసేపే అయ్యింది. ఆరో ఓవర్‌లో ఇషాన్‌, తిలక్‌, శివమ్‌ దూబే (0)లను పేసర్‌ షాక్విక్‌ పెవిలియన్‌ చేర్చాడు. అప్పటికి స్కోరు 46/4 మాత్రమే. ఈ స్థితిలో సూర్యకుమార్‌, రింకూ (6) డిఫెన్స్‌కు పరిమితమయ్యారు. రింకూ షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడి 12వ ఓవర్‌లో వెనుదిరిగాడు. ఇక హార్దిక్‌ (5) భారీ షాట్‌కు వెళ్లి స్పిన్నర్‌ హర్మీత్‌కు చిక్కాడు. అయితే నిస్సారంగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు 16వ ఓవర్‌లో అక్షర్‌, సూర్య ఊపుతెచ్చారు. అక్షర్‌ 4,4.. సూర్య 4,6తో 21 పరుగులు సమకూరాయి. కానీ తర్వాతి ఓవర్‌లోనే అక్షర్‌ను హర్మీత్‌ అవుట్‌ చేయడంతో ఏడో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు పట్టువదలని సూర్య మాత్రం ఆఫ్‌సైడ్‌ బంతిని స్కూప్‌ షాట్‌తో ఫోర్‌గా మలిచి 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. టెయిలెండర్‌ అర్ష్‌దీప్‌ (4)ను అండగా చేసుకుని ఎడాపెడా షాట్లతో చెలరేగిన సూర్య ఎనిమిదో వికెట్‌కు 22 రన్స్‌ అందించాడు. ఇక ఆఖరి ఓవర్‌లో వరుసగా 4,6,6,4తో 21 రన్స్‌ చేయడంతో స్కోరు 160 దాటింది.


00Sports.jpgమ్యాచ్‌కు ముందు ఆరంభ వేడుకల్లో బాలీవుడ్‌ నటి నోరా ఫతే నృత్యం

స్కోరుబోర్డు

భారత్‌: ఇషాన్‌ (సి) మిలింద్‌ (బి) షాక్విక్‌ 20, అభిషేక్‌ (సి) సంజయ్‌ (బి) అలీఖాన్‌ 0, తిలక్‌ (సి) మోనంక్‌ (బి) షాక్విక్‌ 25, సూర్యకుమార్‌ (నాటౌట్‌) 84, దూబే (సి) నేత్రావల్కర్‌ (బి) షాక్విక్‌ 0, రింకూ (సి) మిలింద్‌ (బి) మొహిసిన్‌ 6, హార్దిక్‌ (సి) సాయితేజ (బి) హర్మీత్‌ 5, అక్షర్‌ (సి) మొహిసిన్‌ (బి) హర్మీత్‌ 14, అర్ష్‌దీప్‌ (సి) మిలింద్‌ (బి) షాక్విక్‌ 4, వరుణ్‌ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: 20 ఓవర్లలో 161/9. వికెట్ల పతనం: 1-8, 2-45, 3-46, 4-46, 5-72, 6-77, 7-118, 8-140, 9-161; బౌలింగ్‌: నేత్రావల్కర్‌ 4-0-65-0, అలీ ఖాన్‌ 2-0-13-1, వాన్‌ షాక్విక్‌ 4-0-25-4, మొహిసిన్‌ 4-0-16-1, శుభమ్‌ 2-0-16-0, హర్మీత్‌ 4-0-26-2.

యూఎస్ఏ: గౌస్‌ (సి) తిలక్‌ (బి) సిరాజ్‌ 6, సాయితేజ (సి) వరుణ్‌ (బి) సిరాజ్‌ 2, మోనాంక్‌ (సి) దూబే (బి) అర్ష్‌దీప్‌ 0, మిలింద్‌ (స్టంప్‌) ఇషాన్‌ (బి) వరుణ్‌ 34, సంజయ్‌ (సి) రింకూ (బి) అక్షర్‌ 37, శుభమ్‌ (ఎల్బీ) సిరాజ్‌ 37, హర్మీత్‌ (సి) సిరాజ్‌ (బి) అక్షర్‌ 0; మొహిసిన్‌ (సి) తిలక్‌ (బి) అర్ష్‌దీప్‌ 8, షాక్విక్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 132/8. వికెట్ల పతనం: 1-8, 2-11, 3-13, 4-71, 5-98, 6-98, 7-110, 8-132. బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-18-2, సిరాజ్‌ 4-0-29-3, వరుణ్‌ 4-0-24-1, అక్షర్‌ 4-0-24-2, హార్దిక్‌ 4-0-34-0.

1

టీ20ల్లో ఎక్కువ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ (17)లు అందుకున్న భారత

బ్యాటర్‌గా సూర్య.

1

టీ20 వరల్డ్‌క్‌పలో అత్యధిక వరుస విజయాలు (9) అందుకున్న జట్టుగా భారత్‌.

1

ఈ మెగా టోర్నీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులిచ్చుకున్న బౌలర్‌గా నేత్రావల్కర్‌ (0/65). 2007లో జయసూర్య (0/64) రికార్డును అధిగమించాడు.

ఇవి కూడా చదవండి:

అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్

టీ20 ప్రపంచ కప్ 2026: తొలి మ్యాచుకు బుమ్రా దూరం!

Updated Date - Feb 08 , 2026 | 06:13 AM