రైజర్స్ ఘనంగా..
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:19 AM
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జూలు విదిల్చింది. లీగ్‌ను ఓటమితో ఆరంభించిన ఈ జట్టు గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం తమ పవరేంటో...
నేటి మ్యాచ్
చెన్నై X పంజాబ్
వేదిక చెన్నై రా.7.30 నుంచి
65 రన్స్ తేడాతో కోల్‌కతాపై విజయం
నితీశ్ ఆల్‌రౌండ్‌షో
చెలరేగిన క్లాసెన్, అభిషేక్, హెడ్
ఉనాద్కట్‌కు మూడు వికెట్లు
కోల్‌కతా: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జూలు విదిల్చింది. లీగ్‌ను ఓటమితో ఆరంభించిన ఈ జట్టు గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం తమ పవరేంటో చాటుకుంది. బ్యాటింగ్‌లో బెంబేలెత్తించడంతో పాటు బౌలింగ్‌లోనూ ప్రత్యర్థిని వణికించింది. దీంతో ఇషాన్ కిషన్ సేన 65 పరుగుల భారీ తేడాతో కేకేఆర్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 226 పరుగులు చేసింది. క్లాసెన్ (35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 52), అభిషేక్ (21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48), హెడ్ (21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 46), నితీశ్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 39) రాణించారు. ముజరబానికి నాలుగు, వైభవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో కోల్‌కతా 16 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలింది. రఘువంశీ (29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52), రింకూ (25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 35), ఆలెన్ (7 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 28) ఫర్వాలేదనిపించారు. ఉనాద్కట్‌కు మూడు.. మలింగ, నితీశ్ కుమార్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నితీశ్ నిలిచాడు.
పేసర్ల కట్టడి: భారీ ఛేదనలో కోల్‌కతా ఇన్నింగ్స్ ఎంత వేగంగా ఆరంభమైందో అదే రీతిన పతనమైంది. రైజర్స్ పేసర్ల ధాటికి టపటపా వికెట్లు కోల్పోయి కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయింది. రఘువంశీ, రింకూ మాత్రమే ఫర్వాలేదనిపించారు. పేసర్ డేవిడ్ పైన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఆలెన్ 4,4,6,6,4తో 25 పరుగులతో అదుర్స్ అనిపించాడు. కానీ అతడి ఊపును తర్వాతి ఓవర్‌లోనే స్పిన్నర్ హర్ష్ రిటర్న్ క్యాచ్‌తో అడ్డుకున్నాడు. అనంతరం వన్‌డౌన్ బ్యాటర్ రఘువంశీ రెండు సిక్సర్లు బాదడంతో కేకేఆర్ 20 బంతుల్లోనే 50 స్కోరుకు చేరుకుంది. అటు కెప్టెన్ రహానె (8)ను పేసర్ ఉనాద్కట్ దెబ్బతీయగా, గ్రీన్ (2) సమన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. అయినా పవర్‌ప్లేలో 74/3 స్కోరుతో నిలిచింది. ఈ దశలో రఘువంశీ-రింకూ అడపాదడపా బౌండరీలతో 9 ఓవర్లలో స్కోరును వందకు చేర్చారు. 27 బంతుల్లోనే రఘువంశీ రెండో వరుస హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ జోడీ క్రీజులో ఉన్నంతసేపు జట్టు విజయం దిశగా సాగింది. కానీ 11వ ఓవర్‌లో రఘువంశీ కూడా రనౌట్ కావడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ లయ తప్పింది. నాలుగో వికెట్‌కు ఈ జోడీ 46 పరుగులు సాధించింది. ఇక నితీశ్ వరుస ఓవర్లలో అనుకుల్ (0), రింకూలను పెవిలియన్‌కు చేర్చగా.. పేసర్ ఎషాన్ 15వ ఓవర్‌లో నరైన్ (12), రమణ్‌దీప్ (10)ల పనిబట్టాడు. తర్వాతి ఓవర్‌లోనే చివరి రెండు వికెట్లను పేసర్ ఉనాద్కట్ తీయడంతో కేకేఆర్ కథ ముగిసింది.
మెరుపు ఆరంభంతో..: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఆరంభం రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఓపెనర్లు హెడ్, అభిషేక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో కేకేఆర్ బౌలర్లను వణికించారు. బంతి పడిం దే ఆలస్యం అన్నట్టుగా ఈ జోడీ బౌండరీల వరద పారించింది. దీంతో తొలి 8 ఓవర్లపాటు ఈడెన్‌లో పరుగుల వర్షం కురిసింది. ఆ తర్వాత పట్టు సాధించిన కేకేఆర్ ప్రత్యర్థిని కాస్త కట్టడి చేయగలిగింది. అయితే క్లాసెన్, నితీశ్ నిలకడైన భాగస్వామ్యంతో జట్టు స్కోరు 220 దాటగలిగింది. మొదట హెడ్ బ్యాట్‌కు పనిచెబుతూ మూడో ఓవర్‌లో 4,6,6,4తో 21 రన్స్ రాబట్టాడు. దీంతో నాలుగో ఓవర్‌ను స్పిన్నర్ నరైన్‌తో వేయించగా తను 3 పరుగులే ఇచ్చి ఆకట్టుకున్నాడు. తర్వాత ఓవర్‌లో బంతిని స్పిన్నర్ వరుణ్‌కు ఇవ్వగా.. అభిషేక్ వీరంగం సృష్టించాడు. 6,6,4,4,4తో 25 రన్స్ సాధించాడు. కానీ ఆరో ఓవర్‌లో హెడ్ వికెట్ పేసర్ కార్తీక్ తీయగా.. తొలి వికెట్‌కు 34 బంతుల్లోనే 82 పరుగుల తుఫాన్ భాగస్వామ్యం ముగిసింది.
అటు పవర్‌ప్లేలో రైజర్స్ 84/1 స్కోరుతో అత్యంత పటిష్ఠంగా నిలిచింది. తర్వాత 8 ఓవర్లలోనే 110కి చేరింది. ఈ దశలో 250 రన్స్ కూడా సాధ్యమే అనిపించింది. కానీ తర్వాతి ఓవర్‌లో ఇషాన్, అభిషేక్‌ల వికెట్లు తీసిన పేసర్ ముజరబాని డబుల్ ఝలక్ ఇచ్చాడు. ఆ వెంటనే అనికేత్ (1) వెనుదిరగడంతో రైజర్స్ డిఫెన్స్‌లో పడింది. దీంతో క్లాసెన్, నితీశ్ జోడీ జట్టును ఆదుకునే ప్రయత్నంలో భారీ షాట్లకు వెళ్లలేదు. సింగిల్స్‌కే ప్రాధాన్యమివ్వడంతో 25 బంతులపాటు బౌండరీ నమోదు కాలేదు. 18వ ఓవర్‌లో క్లాసెన్ 6, నితీశ్ 4,4లతో 16 రన్స్ రాగా స్కోరు కూడా 200కి చేరింది. పేసర్ వైభవ్ 19వ ఓవర్‌లో నితీశ్, సలీల్ (0)లను వరుస బంతుల్లో అవుట్ చేయగా.. ఐదో వికెట్‌కు 82 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. ఆఖరి ఓవర్‌లో 15 రన్స్ సాధించినా.. క్లాసెన్, శివాంగ్ (4)లను ముజరబాని అవుట్ చేశాడు.
స్కోరుబోర్డు
సన్‌రైజర్స్: హెడ్ (సి) గ్రీన్ (బి) త్యాగి 46, అభిషేక్ (సి) వరుణ్ (బి) ముజరబాని 48, ఇషాన్ (సి) రింకూ (బి) ముజరబాని 14, క్లాసెన్ (సి) రమణ్‌దీప్ (బి) ముజరబాని 52, అనికేత్ (సి) రింకూ (బి) అనుకుల్ 1, నితీశ్ (సి) వరుణ్ (బి) వైభవ్ 39, సలీల్ (బి) వైభవ్ 0, హర్ష్ (నాటౌట్) 9, శివాంగ్ (సి) రహానె (బి) ముజరబాని 4; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 226/8. వికెట్ల పతనం: 1-82, 2-111, 3-112, 4-118, 5-200, 6-200, 7-222, 8-226. బౌలింగ్: వైభవ్ 4-0-47-2, ముజరబాని 4-0-41-4, నరైన్ 4-0-39-0, వరుణ్ 2-0-31-0, కార్తీక్ 4-0-48-1, అనుకుల్ 2-0-16-1.
కోల్‌కతా: రహానె (సి) ఎషాన్ (బి) ఉనాద్కట్ 8, ఆలెన్ (సి అండ్ బి) హర్ష్ 28, రఘువంశీ (రనౌట్) 52, గ్రీన్ (రనౌట్) 2, రింకూ (సి) ఉనాద్కట్ (బి) నితీశ్ 35, అనుకుల్ (సి) ఇషాన్ (బి) నితీశ్ 0, రమణ్‌దీప్ (సి) ఉనాద్కట్ (బి) ఎషాన్ 10, నరైన్ (సి) అనికేత్ (బి) ఎషాన్ 12, కార్తీక్ (సి) ఇషాన్ (బి) ఉనాద్కట్ 5, వైభవ్ (నాటౌట్) 1, వరుణ్ (బి) ఉనాద్కట్ 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 16 ఓవర్లలో 161 ఆలౌట్. వికెట్ల పతనం: 1-30, 2-67, 3-74, 4-120, 5-120, 6-139, 7-154, 8-159, 9-161, 10-161. బౌలింగ్: పైన్ 2-0-35-0, హర్ష్ 2-0-17-1, అభిషేక్ 1-0-15-0, ఉనాద్కట్ 3-0-21-3, ఎషాన్ 2-0-14-2, శివాంగ్ 4-0-41-0, నితీశ్ 2-0-17-2.
1
కేకేఆర్ తరఫున ఎక్కువ క్యాచ్‌లు (41) అందుకున్న ఫీల్డర్‌గా రింకూ సింగ్
2
రైజర్స్ తరఫున ఎక్కువ సిక్సర్లు (101) బాదిన రెండో బ్యాటర్‌గా అభిషేక్. డేవిడ్ వార్నర్ (143) టాప్‌లో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: అరుదైన మైలురాయిని తాకిన అజింక్య రహానే
ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు