ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 02 , 2026 | 06:12 PM
అత్యంత ఆదరణ పొందిన ఐపీఎల్‌లో మ్యాచులు, జట్ల సంఖ్యను పెంచి మరింత విస్తృతం చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత 18 ఏళ్లుగా బీసీసీఐ ఆధ్వర్యంలో ఈ లీగ్ ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది. ఇటీవలే 19వ సీజన్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2008 నుంచి 2021 వరకు ఎనిమిది జట్లతో కొనసాగింది. 2022లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా చేరడంతో జట్ల సంఖ్య పదికి చేరింది. ఇలా అత్యంత ఆదరణ పొందిన ఐపీఎల్‌ను మరింత విస్తృతం చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పట్లో ఐపీఎల్ జట్లు, మ్యాచ్‌ల సంఖ్య పెంచే అవకాశం లేదని సంకేతాలు ఇచ్చాడు. 'మ్యాచ్‌ల సంఖ్యను 74 నుంచి 94కు పెంచడం కష్టం. అంతర్జాతీయ షెడ్యూల్‌తో సర్దుబాటు చేయలేకపోవడమే ప్రధాన కారణం. మార్చి నుంచి మే వరకు దీనిని పరిమిత విండోలో మాత్రమే నిర్వహించగలం. ఒకవేళ జూన్ వరకు కొనసాగిస్తే.. దక్షిణ భారతంలో చాలా ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఉంటుంది. కాబట్టి అప్పుడు మ్యాచ్‌ల నిర్వహణ కష్టం' అని అన్నాడు.
'ఒకవేళ ఒకేసారి డబుల్ హెడర్ మ్యాచ్‌లు నిర్వహించాలన్నా... ఒకేరోజు ఒకే వేదికపై రెండు మ్యాచ్‌లు నిర్వహించాలనుకున్నా బ్రాడ్‌కాస్టర్లకు ఇది అంతగా నచ్చదు. వారి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టేకునే 74 మ్యాచ్‌లకు విండోను పరిమితం చేశాము’ అని అరుణ్ ధుమాల్ చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పటికే టీమిండియా ఇంటర్నేషనల్ మ్యాచుల విరామం లేని బిజీ షెడ్యూల్‌తో కిక్కిరిసిపోయింది. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ విస్తృతిని పెంచడం సాధ్యం కాదని అతడు పరోక్షంగా స్పష్టం చేశాడు.
ఐపీఎల్ మ్యాచుల విషయానికి వస్తే.. 2023, 2024లో 74 మ్యాచ్‌లు నిర్వహించారు. 2025, 2026 సీజన్లలో 84 మ్యాచ్‌లు.. 2027 నాటికి వీటి సంఖ్య 94కు పెంచుతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ సీజన్ కూడా 74 మ్యాచ్‌లతోనే టోర్నీ కొనసాగుతోంది. తాజాగా ఐపీఎల్ ఛైర్మన్ చేసిన కామెంట్స్‌తో ఇప్పట్లో మ్యాచులు, జట్ల సంఖ్య పెరిగే అవకాశం లేదని స్పష్టమైంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: క్రికెట్ బోర్డుపై కేసు వేసిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్
ఐపీఎల్ 2026: సన్ రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైన కేకేఆర్!