Share News

వైభవ్‌ను 'టార్గెట్' చేస్తారా? శ్రీలంక కెప్టెన్ సమాధానం ఇదే..

ABN , Publish Date - Jun 20 , 2026 | 02:50 PM

శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ తుది అంకానికి చేరింది. భారత్, శ్రీలంక 'ఎ' జట్లు టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దంబుల్లా వేదికగా రేపు ఇరుజట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

 వైభవ్‌ను 'టార్గెట్' చేస్తారా? శ్రీలంక కెప్టెన్  సమాధానం ఇదే..
Sahan Arachchige

స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ తుది అంకానికి చేరింది. భారత్, శ్రీలంక 'ఎ' జట్లు టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దంబుల్లా వేదికగా రేపు(ఆదివారం) ఇరుజట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక- ‘ఎ’ జట్టు కెప్టెన్‌ సహాన్‌ అరాచిగే టీమిండియా యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.


ఓ స్పోర్ట్స్ ఛానల్‌లో శ్రీలంక కెప్టెన్ సహాన్ మాట్లాడుతూ.. భారత్‌తో జరిగే తుది పోరు గురించి పలు విషయాలను వెల్లడించాడు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన వాగ్వాదం తర్వాత మీరు వైభవ్‌ను టార్గెట్ చేస్తారా? అని మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. అందుకు సహాన్ అరాచిగే సమాధానం ఇస్తూ... తాము ఫైనల్లో వైభవ్‌ని టార్గెట్‌ చేయబోమని తెలిపాడు. తమ వాళ్లు ఎవరినీ, ఏ విషయాన్ని కూడా ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోరని, ఆటను తాము ఆస్వాదిస్తున్నామని పేర్కొన్నాడు. సూపర్‌ ఓవర్‌ లాంటి సందర్భాల్లో ఆటగాళ్లు భావోద్వేగాలకు లోనుకావడం సహజమని, ఆటలో ఇలాంటివి సాధారణమని అరాచిగే స్పష్టం చేశాడు.


భారత్‌తో ఫైనల్‌కు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామన్నాడు. బ్యాటింగ్‌ విషయంలోతమకు ఎలాంటి సమస్యా లేదని, తమ బౌలింగ్‌ విభాగంలో ఫాస్ట్‌ బౌలర్లు, స్పిన్నర్లు మెరుగ్గా రాణిస్తున్నారని పేర్కొన్నాడు. భారత్‌తో పోటీ కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అరాచిగే తెలిపాడు. కాగా లీగ్‌ దశలో తొలుత శ్రీలంకపై భారత్‌ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కగా.. రెండో మ్యాచ్‌లో లంక సూపర్‌ ఓవర్లో విజయం సాధించింది. ఇక ఇరుజట్లు అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టాయి.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం!

ఫిఫా ప్రపంచ కప్2026: మెస్సిపై ఫిఫాకు అల్జీరియా ఫిర్యాదు

Updated Date - Jun 20 , 2026 | 02:51 PM