Share News

సూపరో.. సూపరు!

ABN , Publish Date - Feb 12 , 2026 | 04:44 AM

మ్యాచ్‌లో ఇరుజట్ల స్కోర్లు ఒక్కటై.. సూపర్‌ ఓవర్‌ దాకా సాగి.. ఆ సూపర్‌ ఓవర్‌లోనూ స్కోర్లు సమమై.. ఫలితం రెండో సూపర్‌ ఓవర్‌లో తేలితే.. ఆ ఆటలో మజాయే వేరు. బుధవారం అహ్మదాబాద్‌లో ఇలాంటి అద్భుతమే...

సూపరో.. సూపరు!

రెండు సూపర్‌ ఓవర్లు మజా పంచిన దక్షిణాఫ్రికా -

అఫ్ఘానిస్థాన్‌ పోరు చివరకు సఫారీలదే గెలుపు

మ్యాచ్‌లో ఇరుజట్ల స్కోర్లు ఒక్కటై.. సూపర్‌ ఓవర్‌ దాకా సాగి.. ఆ సూపర్‌ ఓవర్‌లోనూ స్కోర్లు సమమై.. ఫలితం రెండో సూపర్‌ ఓవర్‌లో తేలితే.. ఆ ఆటలో మజాయే వేరు. బుధవారం అహ్మదాబాద్‌లో ఇలాంటి అద్భుతమే జరిగింది. ఇరుజట్లు సహా విశ్వవ్యాప్త క్రికెట్‌ అభిమానులను మునివేళ్ల మీద నిలబెడుతూ.. టై మీద టైకి దారితీసిన దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ఈ టీ20 ప్రపంచకప్‌ చరిత్రలోనే హైలైట్‌గా నిలిచింది. ఆద్యంతం ఉత్కంఠ రేపుతూ, సూపర్‌ థ్రిల్లర్‌ను తలపించిన ఈ ఫైట్‌లో చివరకు సఫారీలను విజయం వరించింది.

అహ్మదాబాద్‌: టీ20 ప్రపంచ కప్‌ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయే మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ స్టేడియం వేదికైంది. ఏకంగా రెండు సూపర్‌ ఓవర్లతో మ్యాచ్‌ ఫ్యాన్స్‌ను మునివేళ్లపై నిలబెట్టింది. చివరకు సఫారీలు విజయంతో ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం జరిగిన గ్రూప్‌ ‘డి’ పోరులో తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 187/6 స్కోరు చేసింది. రికెల్టన్‌ (28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. డికాక్‌ (41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59) హాఫ్‌ సెంచరీ సాధించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 61 బంతుల్లోనే 114 రన్స్‌ జోడించారు. ఛేదనలో అఫ్ఘాన్‌ 19.4 ఓవర్లలో సరిగ్గా 187 రన్స్‌కు ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్‌ (42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 84) ఒంటిచేత్తో అఫ్ఘాన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. లోయరార్డర్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (17 బంతుల్లో 22), కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (12 బంతుల్లో 20) ధాటిగా ఆడడంతో అఫ్ఘాన్‌ గెలుపునకు ఒక్క పరుగు దూరంలో నిలిచింది. మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌కు మళ్లించింది.


తొలి సూపర్‌ ఓవర్‌: ఎన్‌గిడి వేసిన ఈ ఓవర్‌లో అజ్మతుల్లా (16 నాటౌట్‌) రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌ దంచడంతో అఫ్ఘానిస్థాన్‌ వికెట్‌ నష్టపోకుండా 17 రన్స్‌ చేసింది. 18 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన దక్షిణాఫ్రికా బ్రేవిస్‌ (6) వికెట్‌ను కోల్పోయింది. ఫరూఖీ వేసిన ఈ ఓవర్లో స్టబ్స్‌ (10 నాటౌ ట్‌) ఓ బౌండరీ, చివరి బంతికి సిక్సర్‌ కొట్టడంతో సఫారీలు కూడా 17/1 స్కోరే చేశారు. ఫలితంగా మ్యాచ్‌ మరో సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది.

రెండో సూపర్‌ ఓవర్‌: రెండో సూపర్‌ ఓవర్‌లో మిల్లర్‌ (16 నాటౌట్‌), స్టబ్స్‌ (7 నాటౌట్‌) కలిపి మూడు సిక్సర్లు సాధించడంతో దక్షిణాఫ్రికా 23/0 స్కోరు చేసింది. ఛేదనలో మహ్మద్‌ నబీ (0)ని కేశవ్‌ మహరాజ్‌ అవుట్‌ చేశాడు. అయితే రహ్మనుల్లా గుర్బాజ్‌ (18) మూడు వరుస సిక్సర్లతో విరుచుకుపడడంతో అఫ్ఘానిస్థాన్‌ గెలుస్తుందేమోననిపించింది. కానీ మరో భారీ షాట్‌ కొట్టబోయి రహ్మనుల్లా నిష్క్రమించడంతో దక్షిణాఫ్రికాకు విజయం దక్కింది. ఎన్‌గిడి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

సంక్షిప్తస్కోర్లు

దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 187/6 (రికెల్టన్‌ 61, డికాక్‌ 59, బ్రేవిస్‌ 23, అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 3/41, రషీద్‌ ఖాన్‌ 2/28)

అఫ్ఘానిస్థాన్‌: 19.4 ఓవర్లలో 187 ఆలౌట్‌ (రహ్మనుల్లా గుర్బాజ్‌ 84, అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 22, రషీద్‌ ఖాన్‌ 20, ఎన్‌గిడి 3/26).

సూపర్‌ ఓవర్‌ 1 సాగిందిలా..

అఫ్ఘానిస్థాన్‌ (17/0) దక్షిణాఫ్రికా (17/1)

అజ్మతుల్లా (4) మిల్లర్‌ (1)

అజ్మతుల్లా (6) బ్రేవిస్‌ (6)

అజ్మతుల్లా (1) బ్రేవిస్‌ (అవుట్‌)

గుర్బాజ్‌ (1) స్టబ్స్‌ (4)

అజ్మతుల్లా (4) స్టబ్స్‌ (0)

అజ్మతుల్లా (1) స్టబ్స్‌ (6)

బౌలర్‌: ఎంగిడి బౌలర్‌: ఫరూఖీ

సూపర్‌ ఓవర్‌ 2 సాగిందిలా..

దక్షిణాఫ్రికా (23/0) అఫ్ఘానిస్థాన్‌ (19/2)

స్టబ్స్‌ (6) నబీ (0)

స్టబ్స్‌ (1) నబీ (అవుట్‌)

మిల్లర్‌ (2) గుర్బాజ్‌ (6)

మిల్లర్‌ (6) గుర్బాజ్‌ (6)

మిల్లర్‌ (6) గుర్బాజ్‌ (6)

మిల్లర్‌ (2) గుర్బాజ్‌ (వైడ్‌-1)

గుర్బాజ్‌ (అవుట్‌)

బౌలర్‌: అజ్మతుల్లా బౌలర్‌: కేశవ్‌ మహరాజ్‌

ఇవి కూడా చదవండి:

పాకిస్థాన్ అభిమానులకు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్.!

టీ20 ప్రపంచ కప్2026: ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

Updated Date - Feb 12 , 2026 | 04:45 AM