పాంచ్ పటాకా
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:07 AM
సొంత గడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు రికార్డులను తిరగరాస్తూ మూడోసారి విజేతగా నిలిచింది. కానీ ఆరంభం నుంచి ఫైనల్ వరకు మనోళ్ల ప్రదర్శన ఆహా.. అనే రీతిలో...
సొంత గడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు రికార్డులను తిరగరాస్తూ మూడోసారి విజేతగా నిలిచింది. కానీ ఆరంభం నుంచి ఫైనల్ వరకు మనోళ్ల ప్రదర్శన ఆహా.. అనే రీతిలో లేకపోయినా తుది పోరుకు చేరడం, ఆపై విజేతగా నిలిచే ప్రయాణంలో కొందరు కీలక పాత్ర పోషించారు. జట్టు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు తమ అనుభవాన్ని జోడించి విజయాలబాట పట్టించిన ఆ ఐదుగురు క్రికెటర్ల ఆటతీరును ఓసారి పరిశీలిద్దాం..
సంజూ శాంసన్
టీ20 వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు సంజూ శాంసన్ పేలవ ఫామ్‌తో ఉన్నాడు. తుది జట్టులో అతడికి అవకాశం దక్కుతుందని ఎవరూ భావించలేదు. కానీ భారత్ తరఫున అత్యధికంగా 321 పరుగులు సాధించడమే కాదు.. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గానూ నిలిచాడు. జట్టు కచ్చితంగా గెలవాల్సిన నాకౌట్ మ్యాచ్‌ల్లో 97 (నాటౌట్), 89, 89 స్కోర్లతో అదరగొట్టి విజేతగా నిలిపాడు. వీటన్నింటినీ శతకాలుగా మలిచే చాన్సున్నా, సొంత మైలురాళ్ల కోసం అతను ఎదురుచూడలేదు. తొలి ఐదు మ్యాచ్‌ల్లో భారత్ ఓపెనింగ్ సగటు 6.80 మాత్రమే. కానీ శాంసన్ వచ్చాక మిగిలిన నాలుగింట్లో ఆ సగటు 48.75కు వెళ్లడం విశేషం.
బుమ్రా
టోర్నీలో స్టార్ పేసర్ బుమ్రా మాత్రం జట్టుకు కొండంత అండగా నిలిచాడు. మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులిస్తున్నా తను మాత్రం యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్ల జోరుకు బ్రేకులు వేశాడు. సెమీస్‌లో ఇంగ్లండ్ హవాను అడ్డుకుంది బుమ్రానే. ఫైనల్లోనూ కెరీర్ బెస్ట్ (4/15)షో తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. మొత్తంగా 168 బంతుల్లో కేవలం 174 పరుగులివ్వడమే కాకుండా 14 వికెట్లు తీసి తానెంత ప్రమాదకరమో చాటిచెప్పాడు.
అక్షర్ పటేల్
సూపర్-8 ముగిసే వరకు భారత ఫీల్డింగ్ నాసిరకంగా ఉంది. ఏకంగా 13 క్యాచ్‌లను వదిలేసి మిగతా జట్లతో పోలిస్తే అట్టడుగున నిలిచింది. కానీ సెమీ్‌సలో ఇంగ్లండ్‌పై స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ పట్టిన కళ్లుచెదిరే క్యాచ్‌లు మాత్రం జట్టుకు జీవం పోశాయి. కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్యాచ్‌ను అందుకునే క్రమంలో 20 మీటర్లు వెనక్కి వెళ్లి నభూతో.. అనే తరహాలో డైవింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఇక బెథెల్‌తో పరుగుల మోత మోగిస్తున్న జాక్స్ క్యాచ్‌ను అయితే నమ్మశక్యం కాని రీతిలో ఆపాడు. తాను బౌండరీ లైన్‌పై పడిపోతున్న క్రమంలో బంతిని పక్కనే ఉన్న దూబే వైపు విసరడంతో మ్యాచ్ మనవైపు తిరిగింది.
శివమ్ దూబే
వాస్తవానికి రావాల్సినంత గుర్తింపు రాకపోయినా.. జట్టు భారీ స్కోర్లు సాధించడంలో శివమ్ దూబే ఫినిషింగ్ కీలక పాత్ర పోషించాడు. సెమీ్‌సలో 25 బంతుల్లో 43, ఫైనల్లో 8 బంతుల్లో 26 పరుగులతో అదరగొట్టాడు. బౌలింగ్ పరంగా ఇబ్బందిపడినా.. 235 పరుగులతో తన బ్యాటింగ్ స్ట్రయిక్ రేట్ 211.42గా ఉండడం విశేషం.
సూర్యకుమార్
బ్యాటింగ్‌లో ప్రముఖ పాత్ర పోషించకపోయినా జట్టును విజయపథంలో నడిపించాడు. విఫలమవుతున్న అభిషేక్, వరుణ్ చక్రవర్తిలకు అండగా నిలిచాడు. దీంతో ఫైనల్లో అభిషేక్ చెలరేగగా..వరుణ్ అత్యధిక వికెట్లు (14) తీసి బుమ్రాతో కలిసి టాప్‌లో నిలిచాడు. ఓపెనర్‌గా శాంసన్‌ను ఆడించి సక్సెస్ అయ్యాడు.

దూబే బ్యాట్‌తో ఆడా: అభిషేక్
న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో అర్ధసెంచరీ చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాట్‌ను వాడలేదట. ‘ఫైనల్ మ్యాచ్‌లో ఏదైనా ప్రత్యేకంగా చేయాలని ఉదయమే అనుకున్నా. అందుకే దూబే దగ్గరికి వెళ్లి అతడి బ్యాట్ తీసుకుని ఆడా’ అని మ్యాచ్ ముగిశాక అభిషేక్ తెలిపాడు.
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
వీళ్లు.. ఫ్లాప్
వరల్డ్‌క్‌పలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కొందరు ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. వెస్టిండీస్ ఓపెనర్ కింగ్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 15.33 సగటుతో 92 పరుగులే చేశాడు. ఇక జోస్ బట్లర్ 8 మ్యాచ్‌ల్లో చేసింది 87 పరుగులే. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా 7 మ్యాచ్‌ల్లో 60 పరుగులే సాధించాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ నాలుగు మ్యాచ్‌ల్లో 24 పరుగులు, స్టొయినిస్ 55 పరుగులు, నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డారెల్ మిచెల్ కూడా తనస్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఫినిషర్‌గా జట్టులోకి వచ్చిన రింకూ సింగ్ ఐదు ఇన్నింగ్స్‌లో చేసింది 24 పరుగులే. వరల్డ్‌క్లాస్ బౌలర్లయిన శాంట్నర్, రబాడ, కేశవ్ మహరాజ్ కూడా ఆశించిన రీతిలో ఆడలేదు.
క్రికెట్‌ను భారత్ నాశనం చేసింది: అక్తర్
కరాచీ: భారత జట్టు క్రికెట్‌ను నాశనం చేస్తోందంటూ పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆరోపించాడు. ‘తమ జట్టు సౌలభ్యం కోసం గ్రూపులు, మ్యాచ్‌లను కేటాయించుకోవడంలో బీసీసీఐ పలుకుబడి వినియోగిస్తోంది. వాళ్లు క్రికెట్‌ను పూర్తిగా నాశనం చేశారు’ అని అక్తర్ అక్కసు వెళ్లగక్కాడు. మరోవైపు మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రీది మాత్రం ఈ విజయానికి భారత జట్టుకు అర్హత ఉందని కితాబిచ్చాడు. దేశవాళీ క్రికెట్ పటిష్టంగా ఉండడంతోనే భారత్‌కు అద్భుత ఫలితాలు వస్తున్నాయని మాజీ కెప్టెన్ మియాందాద్ తెలిపాడు.
తప్పులో కాలేసిన రవిశాస్త్రి
అహ్మదాబాద్: అద్భుత కామెంటేటర్‌గా పేరుతెచ్చుకున్న మాజీ ఆల్‌రౌండర్ రవిశాస్త్రి ఆదివారం ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం ఫ్యాన్స్‌ను నిరాశపర్చాడు. కివీస్ చివరి వికెట్ పడిన సందర్భంలో భారత్ విజేతగా నిలిచిన భావోద్వేగాన్ని తన మాటలతో వ్యక్తపర్చలేకపోయాడు. ఎందుకంటే కివీస్ ఆలౌటైన వేళ తను మాత్రం తొమ్మిదో వికెట్ పడిందంటూ కామెంట్ చేశాడు. తర్వాత పొరపాటును సరిదిద్దుకున్నా.. అభిమానులు మాత్రం అతడిని ట్రోలింగ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ
పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్