ఇద్దరూ ఇద్దరే
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:35 AM
అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లో ఇప్పటివరకు 15 వేల పరుగులను దాటింది కేవలం ఇద్దరు క్రికెటర్లే. ఆ ఇద్దరూ భారత్‌కు చెందిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కావడం విశేషం. అయితే సచిన్‌కన్నా 74 ఇన్నింగ్స్‌కంటే ముందే...
సచిన్, విరాట్‌లది ప్రత్యేక ముద్ర
అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లో ఇప్పటివరకు 15 వేల పరుగులను దాటింది కేవలం ఇద్దరు క్రికెటర్లే. ఆ ఇద్దరూ భారత్‌కు చెందిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కావడం విశేషం. అయితే సచిన్‌కన్నా 74 ఇన్నింగ్స్‌కంటే ముందే కోహ్లీ ఈ ఫీట్‌ను అధిగమించాడు. దీంతో ఈ ఫార్మాట్‌లో సచిన్‌కన్నా విరాట్ గొప్ప అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఆ విషయం అంగీకరించడం అంత సులువు కాదు. సచిన్ దాదాపు 20 ఏళ్లపాటు వన్డేల్లో ఆడిన పరిస్థితులు ఇప్పటికన్నా చాలా విభిన్నం. ఇద్దరూ క్రికెట్ మేధావులే.. ఇద్దరూ తమ కాలంలో ఆటను శాసించినవారే. అందుకే కేవలం గణాంకాల ఆధారంగా వారిని పోల్చలేం. అయితే ఇద్దరి ఖాతాల్లోనూ కొన్ని విశేషమైన మైలురాళ్లున్నాయి. ఉదాహరణకు.. కోహ్లీ సాధించిన సెంచరీలు (55), సచిన్ సాధించిన పరుగులు (18,426). సమీప భవిష్యత్‌లో వీటిని మరెవరూ అధిగమించే అవకాశం లేదు. విరాట్ వన్డేల్లో 15,080 పరుగులతో కొనసాగుతున్నాడు. అతను మరో ఏడాది క్రికెట్ ఆడే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం వన్డేల సంఖ్య తగ్గుతూ ఉండడంతో సచిన్ రికార్డును దాటడం దాదాపు అసాధ్యమే.
గణాంకాల పరంగా చూస్తే..: విరాట్ 303 వన్డే ఇన్నింగ్స్‌లో 15 వేల రన్స్ పూర్తి చేస్తే.. సచిన్ 377 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. అలాగే ఈ క్రమంలో విరాట్ 1578 బంతులను అతడికన్నా తక్కువగా ఆడాడు. అంతేకాకుండా ఇన్నింగ్స్ సగటు స్కోరు 49.5 ఉండగా, సచిన్‌ది 39.9గా ఉంది. స్ట్రయిక్ రేట్ విషయంలోనూ విరాట్ (94+) సచిన్ (86)కన్నా ముందే ఉన్నాడు. కోహ్లీ దాదాపు ఆరు ఇన్నింగ్స్‌లకో శతకం బాదేస్తే సచిన్ ఇందుకు 9.2 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. ఇక వీటన్నింటిని గమనిస్తే విరాటే గ్రేటెస్ట్ బ్యాటర్ అనిపించే అవకాశం లేకపోలేదు. కానీ ఇక్కడ పరిశీలించాల్సిన విషయమేమిటంటే.. స్వింగ్ బౌలర్లకు అత్యంత అనుకూలంగా ఉండి బ్యాటర్లకు చుక్కలు చూపించే రెడ్ బాల్‌తో సచిన్ 40-50 వన్డేలు ఆడాడు. సచిన్ అరంగేట్రం సమయం నుంచి ఇప్పటివరకు కాలక్రమంలో వన్డేల్లో అనేక నిబంధనలు మారాయి. సచిన్ ఆడిన 463 వన్డేల్లో మొత్తం 50 ఓవర్లలో ఒకే బంతిని వాడేవారు. అదీగాకుండా ఫీల్డింగ్ నిబంధనలు తొలి 15 ఓవర్ల వరకే ఉండేవి. ప్రస్తుతం మూడు పవర్‌ప్లేలు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటున్నాయి. ఇంకా ఇలాంటి అంశాలు చాలానే ఉండడంతో ప్రపంచ క్రికెట్‌లో సచిన్-విరాట్ తమ తమ కాలాల్లో ఆటకు వన్నె తెచ్చిన ప్లేయర్లుగానే చెప్పుకోవాలి.
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)
ఈ వార్తలు కూడా చదవండి
ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్..