Share News

ఆర్‌సీబీ అద్వితీయం

ABN , Publish Date - Feb 06 , 2026 | 04:27 AM

డాషింగ్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన (41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87), జార్జియా వోల్‌ (79) ధనాధన్‌ అర్ధ శతకాలతో.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) రెండోసారి మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టైటిల్‌ను...

ఆర్‌సీబీ అద్వితీయం

రెండోసారి డబ్ల్యూపీఎల్‌ విజేతగా బెంగళూరు

  • లీగ్‌లో రికార్డు ఛేదన

  • ఫైనల్లో పోరాడి ఓడిన ఢిల్లీ

వడోదర: డాషింగ్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన (41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87), జార్జియా వోల్‌ (79) ధనాధన్‌ అర్ధ శతకాలతో.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) రెండోసారి మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టైటిల్‌ను సొంతం చేసుకొంది. గురువారం జరిగిన ఫైనల్లో రికార్డు లక్ష్య ఛేదనలో బెంగళూరు 6 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. దీంతో వరుసగా నాలుగోసారి కూడా ఢిల్లీకి తుది మెట్టుపై నిరాశే ఎదురైంది. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 203/4 స్కోరు చేసింది. సారథి జెమీమా రోడ్రిగ్స్‌ (37 బంతుల్లో 8 ఫోర్లతో 57), లారా వోల్వార్ట్‌ (44), లిజెల్లీ లీ (37), చినెల్లీ హెన్రీ (35 నాటౌట్‌) పోరాటాలు వృథా అయ్యాయి. ఛేదనలో బెంగళూరు 19.4 ఓవర్లలో 204/4 స్కోరు చేసి గెలిచింది. హెన్రీ 2 వికెట్లు పడగొట్టింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా స్మృతి మంధాన నిలిచింది.

దూకుడుగా ఆడుతూ: ఛేదనలో ఓపెనర్‌ గ్రేస్‌ హ్యారిస్‌ (9) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. స్మృతి, వన్‌డౌన్‌ బ్యాటర్‌ వోల్‌ జట్టును ఆదుకొన్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 92 బంతుల్లో 165 రన్స్‌ జోడించారు. బెంగళూరు పవర్‌ప్లేలో 59, పదో ఓవర్‌కు 100 రన్స్‌ను చేరింది. ఇక వోల్‌, మంధాన వరుస ఓవర్లలో అర్ధ శతకాలు పూర్తి చేసుకోవడంతో.. ఆర్‌సీబీ గెలుపు దిశగా సాగింది. చివరి 30 బంతుల్లో 42 రన్స్‌ అవసరమవగా.. 17వ ఓవర్‌లో వోల్‌ను మణి క్యాచవుట్‌ చేసింది. తర్వాత వచ్చిన రిచా (6)ను నందని వెనక్కిపంపింది. విజయానికి మరో 13 పరుగుల దూరంలో మంధానను హెన్రీ బౌల్డ్‌ చేయడంతో కొంత ఉత్కంఠ రేగింది. కానీ, డి క్లెర్క్‌ (7 నాటౌట్‌), రాధా యాదవ్‌ (12 నాటౌట్‌) రెండు బంతులు ఉండగానే జట్టును గెలిపించారు.


రాణించిన బ్యాటర్లు: జెమీమాతోపాటు టాపార్డర్‌ బ్యాటర్లు రాణించడంతో.. ఢిల్లీ పోరాడగలిగే స్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్‌కు ఓపెనర్లు లి, షఫాలీ తొలి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యంతో నిలకడైన ఆరంభాన్నిచ్చారు. అయితే, అరుంధతి బౌలింగ్‌లో రెండు బౌండ్రీలు బాదిన వర్మ.. మరో భారీషాట్‌ ఆడే ప్రయత్నంలో క్యాచవుట్‌ అయింది. దీంతో పవర్‌ప్లేను ఢిల్లీ 53/1తో ముగించింది. తర్వాతి ఓవర్‌లో లీ 19 రన్స్‌ రాబట్టింది. అయితే, లిజెల్లీని డి క్లెర్క్‌ అవుట్‌ చేసింది. ఈ దశలో లారాతో కలసి జెమీమా స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది. రోడ్రిగ్స్‌.. 15వ ఓవర్‌లో సింగిల్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో ఢిల్లీ 140/2తో నిలిచింది. కానీ, ఆ వెంటనే జెమీమాను సయాలీ క్యాచవుట్‌ చేయడంతో.. మూడో వికెట్‌కు 76 రన్స్‌ భాగస్వామ్యం ముగిసింది. డెత్‌ ఓవర్లలో లారా, హెన్రీ నాలుగో వికెట్‌కు 24 బంతుల్లోనే 55 రన్స్‌ జోడించడంతో.. టీమ్‌ స్కోరు 200 మార్క్‌ దాటింది. 19వ ఓవర్‌లో డి క్లెర్క్‌ బౌలింగ్‌లో హెన్రీ 4 ఫోర్లు, సిక్స్‌తో 24 రన్స్‌ రాబట్టింది.

స్కోరుబోర్డు

ఢిల్లీ: లిజెల్లీ లీ (సి) హ్యారిస్‌ (బి) డి క్లెర్క్‌ 37, షఫాలీ (సి) రిచా (బి) అరుంధతి 20, లారా (రనౌట్‌) 44, జెమీమా (సి) డి క్లెర్క్‌ (బి) సయాలి 57, హెన్రీ (నాటౌట్‌) 35; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 203/4; వికెట్ల పతనం: 1-49, 2-72, 3-148, 4-203; బౌలింగ్‌: బెల్‌ 4-0-19-0, సయాలి 4-0-46-1, అరుంధతి 4-0-40-1, శ్రేయాంక 2-0-32-0, డి క్లెర్క్‌ 4-0-48-1, రాధా యాదవ్‌ 2-0-18-0.

బెంగళూరు: గ్రేస్‌ హ్యారిస్‌ (బి) హెన్రీ 9, మంధాన (బి) హెన్రీ 87, జార్జియా వోల్‌ (సి) షఫాలీ (బి) మణి 79, రిచా (సి) మణి (బి) నందని 6, డి క్లెర్క్‌ (నాటౌట్‌) 7, రాధ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 19.4 ఓవర్లలో 204/4; వికెట్ల పతనం: 1-9, 2-174, 3-181, 4-191; బౌలింగ్‌: కాప్‌ 4-0-38-0, హెన్రీ 4-0-34-2, నందని 4-0-41-1, చరణి 3.4-0-46-0, షఫాలీ 1-0-9-0, మిన్నూ మణి 2-0-19-1, స్నేహ్‌ రాణా 1-0-15-0.

1

డబ్ల్యూపీఎల్‌ చరిత్రలోనే ఇది అత్యధిక ఛేదన. గతేడాది గుజరాత్‌ నిర్దేశిచిన 202 పరుగుల లక్ష్యాన్ని కూడా బెంగళూరు అధిగమించింది.

4

ఫైనల్లో వరుసగా నాలుగోసారి ఓడిన ఢిల్లీ.

మంధాన మెరిసింది.. బెంగళూరు మరోసారి మురిసింది. భారీ స్కోరు.. చివరి ఓవర్‌ వరకూ హోరాహోరీగా సాగిన టైటిల్‌ ఫైట్‌లో.. ఉత్కంఠ విజయాన్ని అందుకొన్న ఆర్‌సీబీ.. రెండోసారి డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌తో అదరహో అనిపించింది. వరుసగా నాలుగోసారి ఫైనల్‌చేరుకొన్న ఢిల్లీ క్యాపిటల్స్‌.. మరోసారి రన్నర్‌పగానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ వార్తలు కూడా చదవండి

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

Updated Date - Feb 06 , 2026 | 04:27 AM