Share News

కివీస్‌ ముందుకు అఫ్ఘాన్‌ అవుట్‌

ABN , Publish Date - Feb 18 , 2026 | 03:03 AM

స్థాయికి తగ్గ ఆటతీరుతో చెలరేగిన న్యూజిలాండ్‌ టీ20 వరల్డ్‌క్‌పలో సూపర్‌-8 దశకు చేరింది. మంగళవారం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ ...

కివీస్‌ ముందుకు అఫ్ఘాన్‌ అవుట్‌

యువరాజ్‌ సమ్రా (110)

కెనడాపై ఘనవిజయం

సూపర్‌-8లో చోటు

యువరాజ్‌ శతకం వృథా

చెన్నై: స్థాయికి తగ్గ ఆటతీరుతో చెలరేగిన న్యూజిలాండ్‌ టీ20 వరల్డ్‌క్‌పలో సూపర్‌-8 దశకు చేరింది. మంగళవారం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (36 బంతుల్లో 76 నాటౌట్‌), రచిన్‌ రవీంద్ర (39 బంతుల్లో 59 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టారు. ఇక ఈ ఫలితంతో గ్రూప్‌ ‘డి’ నుంచి అఫ్ఘాన్‌ జట్టు ఇంటిముఖం పట్టింది. ఇదివరకే దక్షిణాఫ్రికా సూపర్‌-8లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కెనడా 20 ఓవర్లలో 173/4 స్కోరుతో ఆకట్టుకుంది. 19 ఏళ్ల యువ ఓపెనర్‌ యువరాజ్‌ సమ్రా (65 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 110) సెంచరీ సాధించడం విశేషం. దీంతో టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో ఈ ఫీట్‌ సాధించిన అతిపిన్న వయస్కుడిగా నిలిచి, అహ్మద్‌ షెహజాద్‌ (21 ఏళ్లు) రికార్డును అధిగమించాడు. అలాగే ఈ టోర్నీల్లో శతకం బాదిన తొలి అసోసియేట్‌ దేశ ఆటగాడు కూడా. ఆ తర్వాత ఛేదనలో కివీస్‌ 15.1 ఓవర్లలోనే 176/2 స్కోరుతో నెగ్గింది. 30/2 స్కోరుతో కష్టాల్లో పడిన జట్టును ఫిలి్‌ప్స-రచిన్‌ జోడీ సునామీ ఇన్నింగ్స్‌తో ఆదుకుంది. ఫిలిప్స్‌ 22 బంతుల్లోనే కివీస్‌ తరఫున ఈ టోర్నీల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీని పూర్తి చేశాడు. అలాగే మూడో వికెట్‌కు ఈ ఇద్దరు 72 బంతుల్లో అజేయంగా 146 పరుగులు జత చేయడం విశేషం.

సంక్షిప్త స్కోర్లు

కెనడా: 20 ఓవర్లలో 173/4 (యువరాజ్‌ 110, దిల్‌ప్రీత్‌ 36; డఫీ 1/25);

న్యూజిలాండ్‌: 15.1 ఓవర్లలో 176/2 (ఫిలిప్స్‌ 76 నాటౌట్‌, రచిన్‌ 59 నాటౌట్‌; సాద్‌ బిన్‌ 1/29).

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?

ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ

Updated Date - Feb 18 , 2026 | 03:03 AM