Share News

అప్పులు చేసి.. జైలుకెళ్లి..ముకుల్‌

ABN , Publish Date - Apr 11 , 2026 | 05:13 AM

ఒక్క ఇన్నింగ్స్‌ చాలు..ఐపీఎల్‌లో హీరోగా మారేందుకు. అలాంటి ఒకే ఒక్క ఇన్నింగ్స్‌.. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బ్యాటర్‌ ముకుల్‌...

అప్పులు చేసి.. జైలుకెళ్లి..ముకుల్‌

కెరీర్‌ కోసం తండ్రి కష్టాలు

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఒక్క ఇన్నింగ్స్‌ చాలు..ఐపీఎల్‌లో హీరోగా మారేందుకు. అలాంటి ఒకే ఒక్క ఇన్నింగ్స్‌.. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బ్యాటర్‌ ముకుల్‌ చౌదురి పేరు దేశ క్రికెట్‌లో మార్మోగుతోంది. గత వేలంలో రూ. 30 లక్షల ప్రాథమిక ధర ఉన్న ముకుల్‌పై రూ. 2.6 కోట్లు వెచ్చించినప్పుడు అంతా లఖ్‌నవూను ఎగాదిగా చూశారు. అనామక క్రికెటర్‌పై అంత మొత్తమా అని పెదవి విరిచారు. కానీ తనపై పెట్టుకున్న నమ్మకానికి మించిన ఇన్నింగ్స్‌ ముకుల్‌ ఆడాడు.

బాధలు ఎన్నో..: ఎందరో వర్ధమాన క్రికెటర్ల మాదిరే 21 ఏళ్ల ముకుల్‌ కుటుంబం కూడా అనేక కష్టనష్టాలు ఎదుర్కొంది. అందుకే కాబోలు ‘ఏ గెలుపూ వెనువెంటనే రాదు. ఈ సంఘర్షణలో ఓ జీవిత కాలం గడిచిపోతుంది. లెక్కకుమిక్కిలి మేఘాలు జతకూడితేనే అది నదిగా మారుతుంద’న్న ఓ కవి వాక్యాలు ముకుల్‌ తండ్రి దలీప్‌ చౌదురి వాట్సాప్‌ స్టేట్‌సలో ఉంటుంది. కొడుకు పుడితే వాణ్ణి క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని పెళ్లికి ముందే దలీప్‌ నిర్ణయించుకున్నారట. ఈ ప్రయత్నంలో ఆయన పడిన బాధలు అన్నీఇన్నీ కావు. రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాలోని ఖేదారోకి ధని దలీప్‌ స్వగ్రామం. ప్రభుత్వోద్యోగం కోసం దలీప్‌ ఆరేళ్లపాటు పరీక్షలు రాసినా ఫలితం దక్కలేదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి అడుగుపెడితే అదీ కలిసి రాలేదు. మరోవైపు ముకుల్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో అతడిని స్వస్థలానికి 70 కి.మీ. దూరంలోని సికార్‌ పట్టణంలోని ఎస్‌బీఎస్‌ క్రిక్‌హబ్‌లో చేర్చారు. ఇందుకోసం దలీప్‌ తన ఇంటిని అమ్మేశారు. తర్వాత హోటల్‌ వ్యాపారం మొదలు పెట్టినా అదీ సరిగా నడవలేదు. దీంతో బ్యాంకు కిస్తీలు చెల్లించలేక ఓ దశలో దలీప్‌ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. వాయిదాలు చెల్లించలేకపోవడమే తప్ప..తాను మోసం చేయలేదని దలీప్‌ చెప్పారు. బంధువులంతా తనను పిచ్చివాడిలా చూశారనీ, తనతోపాటు కొడుకు జీవితాన్నీ నాశనం చేస్తున్నావని కోప్పడినా తాను పట్టించుకోలేదన్నారు. తండ్రి పట్టుదల, బాధలను ఎరిగిన ముకుల్‌ కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో శ్రమించారు. అనతికాలంలోనే సత్తా కలిగిన ఆటగాడిగా నిరూపించుకోవడంతో లఖ్‌నవూ దృష్టిలో పడ్డాడు. కుమారుడికి లభించే మొత్తంతో బ్యాంకు అప్పు తీర్చేస్తానని దలీప్‌ చెప్పారు.


ధోనీ.. ఆరాధ్య క్రికెటర్‌

ముకుల్‌ బ్యాటరేకాదు వికెట్‌ కీపర్‌ కూడా. కోల్‌కతా మ్యాచ్‌లో హెలిక్టాపర్‌ షాట్‌ సిక్సర్లతో అలరించిన ముకుల్‌..ధోనీని గుర్తు చేశాడు. తాను కూడా ఫినిషర్‌నని అందుకే..మహీని తన ఆరాధ్య క్రికెటర్‌గా భావిస్తానని ముకుల్‌ తెలిపాడు.

అర్జున్‌.. ముందే చెప్పాడు

ముకుల్‌ సామర్థ్యాన్ని అదే జట్టు ఆల్‌రౌండర్‌ అర్జున్‌ టెండూల్కర్‌ ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ‘ముకుల్‌ అద్భుతంగా సిక్సర్లు కొడతాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అతడి ఆటను చూసి అబ్బురపడ్డా. స్క్వేర్‌ లెగ్‌, పాయింట్‌, అప్పర్‌ కట్‌, బౌలర్‌ వెనకాల.. ఇలా అన్నివైపులా బంతిని బాదగలడు’ అని పేర్కొన్నాడు. అతడు చెప్పినట్టే.. ఈడెన్‌లో 7 సిక్సర్లతో జట్టును ఓటమి నుంచి కాపాడాడు.

ఈ వార్తలు కూడా చదవండి

మహిళల జోలికొస్తే అదే చివరి రోజు: మంత్రి సవిత..

బొత్స భావోద్వేగం.. వైఎస్ షర్మిల రియాక్షన్

Updated Date - Apr 11 , 2026 | 05:14 AM