Share News

మానవ్‌ మ్యాజిక్‌

ABN , Publish Date - Jun 08 , 2026 | 05:20 AM

అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్‌ పట్టు బిగించింది. అరంగేట్రంలోనే స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మానవ్‌ సుథార్‌ (3/21) సుడులు తిరిగే బంతులతో మ్యాజిక్‌ చేశాడు. అతడి...

మానవ్‌ మ్యాజిక్‌

అరంగేట్రంలోనే మూడు వికెట్లు

అఫ్ఘాన్‌ తొలి ఇన్నింగ్స్‌ 113/5

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 564/8 డిక్లేర్డ్‌

పేసర్‌ సలీమ్‌కు ఆరు వికెట్లు

సుందర్‌ అజేయ అర్ధసెంచరీ

ముల్లన్‌పూర్‌: అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్‌ పట్టు బిగించింది. అరంగేట్రంలోనే స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మానవ్‌ సుథార్‌ (3/21) సుడులు తిరిగే బంతులతో మ్యాజిక్‌ చేశాడు. అతడి బౌలింగ్‌ను అర్థం చేసుకోలేక అఫ్ఘాన్‌ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో ఆ జట్టు ఆటకు రెండో రోజైన ఆదివారం తమ తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. రహ్మత్‌ షా (43 బ్యాటింగ్‌) ఒక్కడే రాణించాడు. పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణకు రెండు వికెట్లు దక్కాయి. భారత్‌ స్కోరుకు అఫ్ఘానిస్థాన్‌ ఇంకా 451 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 564/8 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. గిల్‌ (126), రిషభ్‌ పంత్‌ (81), వాషింగ్టన్‌ సుందర్‌ (52 నాటౌట్‌) అదరగొట్టారు. అఫ్ఘాన్‌ యువ పేసర్‌ మొహమ్మద్‌ సలీమ్‌ సఫీ ఆరు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

పంత్‌ శతకం మిస్‌: ఓవర్‌నైట్‌ స్కోరు 368/3తో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్‌ తొలి సెషన్‌లో పంత్‌ స్ట్రోక్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. అటు పేసర్‌ సలీమ్‌ సఫీ సైతం భారత బ్యాటర్లను ఇబ్బందిపెడుతూ మూడు వికెట్లు తీశాడు. తొలి గంట ఆటలోనే గిల్‌ను సలీమ్‌ అవుట్‌ చేయడంతో నాలుగో వికెట్‌కు 169 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పంత్‌ సెంచరీ వైపు సాగినా స్పిన్నర్‌ ఖరోటే ఓవర్‌లో వెనుదిరిగాడు. అనంతరం జురెల్‌ (19)ను కూడా సఫీ అవుట్‌ చేయగా.. సుందర్‌, మానవ్‌ (28) జోడీ రెండో సెషన్‌లో ఏడో వికెట్‌కు 54 పరుగులు జోడించింది. చివర్లో సిరాజ్‌ (22) 4 ఫోర్లు, ఓ సిక్స్‌తో వేగం చూపాడు. మానవ్‌, సిరాజ్‌ వికెట్లను కూడా సఫీనే తీయగా.. సుందర్‌ హాఫ్‌ సెంచరీ తర్వాత భారత్‌ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఆఖరి సెషన్‌లో అఫ్ఘాన్‌ బ్యాటర్లను మానవ్‌ కుదురుకోనీయలేదు. దీంతో ఐదు వికెట్లతో ఆ జట్టు రెండో రోజును ముగించింది.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) జజాయ్‌ (బి) సఫీ 24, రాహుల్‌ (సి) గుర్బాజ్‌ (బి) షరీఫీ 100, సుదర్శన్‌ (సి) జజాయ్‌ (బి) సఫీ 81, గిల్‌ (సి) జజాయ్‌ (బి) సఫీ 126, పంత్‌ (సి) ఒమర్జాయ్‌ (బి) షాహిదీ 81, జురెల్‌ (బి) సఫీ 19, సుందర్‌ (నాటౌట్‌) 52, మానవ్‌ (సి) జజాయ్‌ (బి) సఫీ 28, సిరాజ్‌ (బి) సఫీ 22, కుల్దీప్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు: 22; మొత్తం: 127 ఓవర్లలో 564/8 డిక్లేర్‌; వికెట్ల పతనం: 1-41, 2-180, 3-247, 4-416, 5-452, 6-456, 7-510, 8-540. బౌలింగ్‌: రహ్మాన్‌ షరీఫీ 24-2-91-1, ఒమర్జాయ్‌ 22-5-67-0, సలీం సఫీ 27-3-140-6, ఖరోటే 23-0-115-0, మాలిక్‌ 7-0-43-0, హష్మతుల్లా షాహిదీ 24-1-91-1.

అఫ్ఘానిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌: మాలిక్‌ (సి) సిరాజ్‌ (బి) మానవ్‌ 16, అటల్‌ (బి) ప్రసిద్ధ్‌ 17, గుర్బాజ్‌ (సి) సాయి (బి) మానవ్‌ 12, రహ్మత్‌ షా (బ్యాటింగ్‌) 43, షాహిదీ (ఎల్బీ) ప్రసిద్ధ్‌ 20, జజాయ్‌ (సి అండ్‌ బి) మానవ్‌ 3; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 39.5 ఓవర్లలో 113/5. వికెట్ల పతనం: 1-28, 2-40, 3-62, 4-98, 5-113. బౌలింగ్‌: సిరాజ్‌ 6-1-24-0, ప్రసిద్ధ్‌ 7-0-27-2, మానవ్‌ 15.5-7-21-3, కుల్దీప్‌ 7-0-29-0, సుందర్‌ 4-0-12-0.

ఇవి కూడా చదవండి:

టీజీ 20 లీగ్: మెదక్‌కు తిలక్ వర్మ.. ఎంత ధర పలికాడంటే?

టీ20 కెప్టెన్సీపై స్పందించిన శ్రేయస్ అయ్యర్

Updated Date - Jun 08 , 2026 | 05:20 AM