Share News

ఆలెన్‌ అదిరెన్‌

ABN , Publish Date - May 09 , 2026 | 02:42 AM

తొలి ఆరు మ్యాచ్‌ల్లో గెలుపనేదే లేకుండా సాగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆలస్యంగానైనా అద్భుతంగా పుంజుకుంది. ప్రత్యర్థి బ్యాటర్లు పరుగుల కోసం కష్టపడిన చోట ఓపెనర్‌ ఫిన్‌ ఆలెన్‌...

ఆలెన్‌ అదిరెన్‌

నేటి మ్యాచ్‌

రాజాస్థాన్‌ X గుజరాత్‌

వేదిక : జైపూర్‌ రా.7.30

47 బంతుల్లో మెరుపు శతకం

  • కోల్‌కతాకు వరుసగా నాలుగో విజయం

  • 8 వికెట్లతో ఢిల్లీ చిత్తు

న్యూఢిల్లీ: తొలి ఆరు మ్యాచ్‌ల్లో గెలుపనేదే లేకుండా సాగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆలస్యంగానైనా అద్భుతంగా పుంజుకుంది. ప్రత్యర్థి బ్యాటర్లు పరుగుల కోసం కష్టపడిన చోట ఓపెనర్‌ ఫిన్‌ ఆలెన్‌ (47 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో 100 నాటౌట్‌) అజేయ శతకంతో హోరెత్తించాడు. ఫలితంగా శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది. కోల్‌కతాకిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. దీంతో పట్టికలో 9 పాయింట్లతో ఏడో స్థానానికి చేరింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. ఓపెనర్‌ నిస్సాంక (29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50), అశుతోష్‌ శర్మ (28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39), కేఎల్‌ రాహుల్‌ (14 బంతుల్లో 4 ఫోర్లతో 23) మాత్రమే రాణించారు. కార్తీక్‌ త్యాగి, అనుకుల్‌ రాయ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. స్వల్ప ఛేదనలో కోల్‌కతా 14.2 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసి గెలిచింది. కామెరూన్‌ గ్రీన్‌ (27 బంతుల్లో 2 సిక్సర్లతో 33 నాటౌట్‌) ఆకట్టుకున్నాడు. సెంచరీ హీరో ఫిన్‌ ఆలెన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.


శతక భాగస్వామ్యం: స్వల్ప ఛేదనను కోల్‌కతా సునాయాసంగా ముగించింది. ఓపెనర్‌ ఫిన్‌ ఆలెన్‌ ఢిల్లీ బౌలర్లను ఆడేసుకున్నాడు. ఢిల్లీ బ్యాటర్లు కష్టపడిన చోట అతను ఏకంగా 10 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతడికి గ్రీన్‌ సహకరించడంతో కోల్‌కతా 34 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించింది. ఆరంభంలో మరో ఓపెనర్‌ రహానె (13) కూడా వేగంగా ఆడినా, అతను మూడో ఓవర్‌లోనే రనౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్‌లో రఘువంశీ (1)ని అక్షర్‌ పటేల్‌ బౌల్డ్‌ చేశాడు. స్వీప్‌ షాట్‌ ఆడే క్రమంలో బంతి అతడి గ్లౌవ్స్‌ను తాకి పైకి లేచి కింద పడే క్రమంలో బెయిల్స్‌ను తాకింది. ఇక, పవర్‌ప్లే తర్వాత ఆలెన్‌ విధ్వంసం సాగింది. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు రాబట్టాడు. 32 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తయ్యాక అతడు మరింత చెలరేగాడు. విప్రజ్‌ ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లు బాది 21 రన్స్‌ అందించాడు. ఇక విజయానికి రెండు పరుగులు.. శతకానికి ఆరు పరుగులు కావాల్సిన తరుణంలో పేసర్‌ ముకేశ్‌ షార్ట్‌ పిచ్‌ బంతిని ఆలెన్‌ సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఐపీఎల్‌లో తన తొలి శతకం నమోదు చేయడంతో పాటు జట్టును కూడా గెలిపించి సంబరాలు చేసుకున్నాడు. మూడో వికెట్‌కు ఆలెన్‌-గ్రీన్‌ అజేయంగా 116 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

చెమటోడ్చిన ఢిల్లీ: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ పరుగుల కోసం తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో వికెట్లను కూడా చేజార్చుకుంది. ఓపెనర్‌ నిస్సాంకతో పాటు చివర్లో అశుతోష్‌ మినహా ఇతర బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపలేదు. కోల్‌కతా పేసర్లు, స్పిన్నర్లు అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఢిల్లీ 150 పరుగులైనా చేయలేకపోయింది. వాస్తవానికి నిస్సాంక మరో ఓపెనర్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను మెరుగ్గానే ఆరంభించారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ చకచకా పరుగులు రాబట్టారు. పేసర్‌ కార్తీక్‌ ఐదో ఓవర్‌లో రాహుల్‌ను అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అక్కడి నుంచి ఢిల్లీ అనూహ్యంగా తడబడింది. నితీశ్‌ రాణా (8), సమీర్‌ రిజ్వీ (3), స్టబ్స్‌ (2)లను ఏమాత్రం కుదురుకోనీయకుండా ప్రత్యర్థి బౌలర్లు పెవిలియన్‌కు చేర్చడంతో జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. దీనికితోడు 28 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసిన నిస్సాంక స్టంపౌట్‌ కావడం మరింత దెబ్బతీసింది. మధ్య ఓవర్లలో స్పిన్నర్ల ధాటికి కెప్టెన్‌ అక్షర్‌ (11), అశుతోష్‌ ఆచితూచి ఆడాల్సి వచ్చింది. ఓ దశలో వీరి ఆట టెస్టును తలపించింది. అయితే 17వ ఓవర్‌లో అశుతోష్‌ 6,4,4తో 16 రన్స్‌ అందించాడు. 19వ ఓవర్‌లో అక్షర్‌ వెనుదిరగడంతో ఆరో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అశుతోష్‌ మాత్రం అదే ఓవర్‌లో 6,3తో జోరును చూపాడు. కానీ చివరి ఓవర్‌లో పేసర్‌ కార్తీక్‌ మూడు పరుగులే ఇచ్చి అశుతోష్‌ వికెట్‌ తీయగా స్టార్క్‌ (0) రనౌటయ్యాడు.


స్కోరుబోర్డు

ఢిల్లీ: నిస్సాంక (స్టంప్డ్‌) రఘువంశీ (బి) అనుకుల్‌ 50, రాహుల్‌ (సి) గ్రీన్‌ (బి) కార్తీక్‌ త్యాగి 23, నితీశ్‌ రాణా (సి) నరైన్‌ (బి) గ్రీన్‌ 8, రిజ్వీ (సి) పొవెల్‌ (బి) నరైన్‌ 3, స్టబ్స్‌ (బి) అనుకుల్‌ 2, అక్షర్‌ (సి) అనుకుల్‌ (బి) వైభవ్‌ అరోరా 11, అశుతోష్‌ (సి) రహానె (బి) కార్తీక్‌ త్యాగి 39, విప్రజ్‌ నిగమ్‌ (నాటౌట్‌) 3, స్టార్క్‌ (రనౌట్‌) 0, ఎన్‌గిడి (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 142/8; వికెట్ల పతనం: 1-49, 2-74, 3-80, 4-85, 5-89, 6-128, 7-140, 8-140; బౌలింగ్‌: అనుకుల్‌ రాయ్‌ 4-0-31-2, వైభవ్‌ అరోరా 3-0-29-1, నరైన్‌ 4-0-17-1, కార్తీక్‌ త్యాగి 4-0-25-2, వరుణ్‌ 4-0-28-0, గ్రీన్‌ 1-0-12-1.

కోల్‌కతా: రహానె (రనౌట్‌) 13, ఫిన్‌ ఆలెన్‌ (నాటౌట్‌) 100, అంగ్రిష్‌ రఘువంశీ (బి) అక్షర్‌ 1, గ్రీన్‌ (నాటౌట్‌) 33, ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: 14.2 ఓవర్లలో 147/2; వికెట్ల పతనం: 1-29, 2-31; బౌలింగ్‌: స్టార్క్‌ 3-0-31-0, అక్షర్‌ 4-0-27-1, ఎన్‌గిడి 2-0-7-0, విప్రజ్‌ 2-0-34-0, కుల్దీప్‌ 3-0-41-0, ముకేశ్‌ 0.2-0-7-0.

000-Sports.jpg

ఇవి కూడా చదవండి:

సోషల్ మీడియా వ్లాగింగ్ ఆపేయాలి.. అర్ష్‌దీప్ సింగ్‌ను కోరిన బీసీసీఐ!

ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్

Updated Date - May 09 , 2026 | 02:42 AM