రేసులోనే కోల్‌కతా!
ABN , Publish Date - May 21 , 2026 | 01:36 AM
కీలక మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్).. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలబెట్టుకొంది. మనీష్ పాండే (45), రోవ్‌మన్ పావెల్ (40)తోపాటు బౌలర్లు రాణించడంతో...
నేటి మ్యాచ్
గుజరాత్ X చెన్నై
వేదిక : అహ్మదాబాద్, రా.7.30
4 వికెట్లతో ముంబై చిత్తు
కోల్‌కతా: కీలక మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్).. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలబెట్టుకొంది. మనీష్ పాండే (45), రోవ్‌మన్ పావెల్ (40)తోపాటు బౌలర్లు రాణించడంతో.. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై నెగ్గింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 147/8 స్కోరు చేసింది. కొర్బిన్ బాష్ (32 నాటౌట్), హార్దిక్ పాండ్యా (26) టాప్ స్కోరర్లు. గ్రీన్, సౌరభ్ దూబే, కార్తీక్ తలో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. ఛేదనలో కోల్‌కతా 18.5 ఓవర్లలో 148/6 స్కోరు చేసి గెలిచింది. రహానె (21) ఫర్వాలేదనిపించాడు. బాష్ 3 వికెట్లు పడగొట్టాడు. గత కొద్ది మ్యాచ్‌లకు దూరమైన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ మళ్లీ ముంబై జట్టులోకి వచ్చారు. మనీష్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
కష్టపడకుండానే..: మనీష్, పావెల్ రాణించడంతో.. స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్ రహానెతో రెండో వికెట్‌కు 38 పరుగులు జోడించిన పాండే.. పావెల్‌తో కలసి నాలుగో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు బాటలో నిలిపాడు. ఓపెనర్ అలెన్ (8)ను చాహర్ తొలి ఓవర్‌లోనే బౌల్డ్ చేశాడు. కానీ, రహానెతో కలసి మనీష్ ఇన్నింగ్స్‌ను నిర్మించే యత్నం చేశాడు. నాలుగో ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో రహానె రెండు ఫోర్లతో బ్యాట్‌కు పనిచెప్పాడు. అయితే, రహానె, గ్రీన్ (4)ను బాష్ తన వరుస ఓవర్లలో అవుట్ చేయడంతో.. కోల్‌కతా 54/3తో ఇబ్బందుల్లో పడినట్టు కనిపించింది. కానీ, పావెల్ అండతో మనీష్ జట్టును ఆదుకొన్నాడు. వీరిద్దరూ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ స్కోరు బోర్డును నడిపించారు. సిక్స్‌తో ఖాతా తెరిచిన పావెల్.. 10వ ఓవర్‌లో హార్దిక్ బౌలింగ్‌లో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోగా.. అదే ఓవర్‌లో పాండే రెండు బౌండ్రీలు బాదాడు. 13వ ఓవర్‌లో మనీష్ మరో ఫోర్‌తో జట్టు స్కోరును సెంచరీ మార్క్ దాటించాడు. అయితే, అర్ధ శతకానికి చేరువలో పాండేను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు. కోల్‌కతా గెలుపునకు 30 బంతుల్లో 30 పరుగులు కావాల్సి ఉండగా.. సిక్స్ బాదిన పావెల్‌ను ఘజన్‌ఫర్ క్యాచవుట్ చేశాడు. రఘువంశీకి కంకాషన్ సబ్‌గా వచ్చిన తేజస్వి దహియా (11)ను కూడా బాష్ అవుట్ చేసినా.. రింకూ సింగ్ (9 నాటౌట్) మరో 7 బంతులు మిగిలుండగానే జట్టును గెలుపుగీత దాటించాడు.
టాప్ ఢమాల్..: పేసర్లు గ్రీన్, సౌరభ్ చెలరేగడంతో.. పవర్‌ప్లేలోనే నాలుగు టాపార్డర్ వికెట్లు చేజార్చుకొన్న ముంబై స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్ సేన ఘోరంగా తడబడింది. రెండో ఓవర్‌లో ఓపెనర్ రికెల్టన్ (6), నమన్ ధిర్ (0)ను గ్రీన్ అవుట్ చేసి ఆరంభంలోనే దెబ్బతీశాడు. ఇక, నాలుగో ఓవర్‌లో సిక్స్ బాదిన మరో ఓపెనర్ రోహిత్ శర్మ (15)ను సౌరభ్ అదే ఓవర్‌లో క్యాచవుట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ (15) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో ఆరు ఓవర్లు ముగిసే సరికి ముంబై 46/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో తిలక్ వర్మ (20), కెప్టెన్ పాండ్యా నాలుగో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే, 8వ ఓవర్ తర్వాత వర్షం కురవడంతో.. గంటపాటు ఆటకు అంతరాయం కలిగింది. మ్యాచ్ పునః ప్రారంభమైన తర్వాత స్పిన్నర్లు వరుణ్, నరైన్ పరుగులను నియంత్రించడంతో.. ముంబై స్కోరు నెమ్మదిగా సాగింది. వరుణ్ బౌలింగ్‌లో బతికి పోయిన తిలక్.. 12వ ఓవర్‌లో నరైన్ బౌలింగ్‌లో సిక్స్‌తో గేర్ మార్చే ప్రయత్నం చేశాడు. మరోవైపు పాండ్యా కూడా భారీ సిక్స్‌తో టచ్‌లోకి వచ్చాడు. కానీ, 14వ ఓవర్‌లో తిలక్‌ను కార్తీక్ అవుట్ చేశాడు. డెత్ ఓవర్లలో చెలరేగుతాడనుకొన్న పాండ్యాను నరైన్ బౌల్డ్ చేయగా.. జాక్స్ (14) రనౌటయ్యాడు. అయితే, బాష్, దీపక్ (10) ఆఖర్లో దూకుడుగా ఆడుతూ.. 20 బంతుల్లో 42 పరుగులు జోడించడంతో ముంబై స్కోరు 150 మార్క్‌కు చేరువైంది.
స్కోరుబోర్డు
ముంబై: రికెల్టన్ (సి) పాండే (బి) గ్రీన్ 6, రోహిత్ (సి) గ్రీన్ (బి) సౌరభ్ దూబే 15, నమన్ (సి) రఘువంశీ (బి) గ్రీన్ 0, సూర్య (బి) సౌరభ్ దూబే 15, తిలక్ (సి) అనుకుల్ (బి) కార్తీక్ 20, హార్దిక్ (బి) నరైన్ 26, జాక్స్ (రనౌట్) 14, బాష్ (నాటౌట్) 32, దీపక్ చాహర్ (సి) అనుకుల్ (బి) కార్తీక్ 10, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 147/8; వికెట్ల పతనం: 1-17, 2-17, 3-23, 4-41, 5-84, 6-95, 7-105, 8-147; బౌలింగ్: అనుకుల్ రాయ్ 1-0-6-0, సౌరభ్ దూబే 4-0-34-2, గ్రీన్ 3-0-23-2, కార్తీక్ త్యాగి 4-0-37-2, నరైన్ 4-0-13-1, వరుణ్ 4-0-28-0.
కోల్‌కతా: రహానె (సి) రికెల్టన్ (బి) బాష్ 21, అలెన్ (బి) చాహర్ 8, మనీష్ పాండే (బి) బుమ్రా 45, గ్రీన్ (సి) ఘజన్‌ఫర్ (బి) బాష్ 4, పావెల్ (సి) బాష్ (బి) ఘజన్‌ఫర్ 40, రింకూ (నాటౌట్) 9, తేజస్వి (సి) రికెల్టన్ (బి) బాష్ 11, అనుకుల్ రాయ్ (నాటౌట్) 4, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 18.5 ఓవర్లలో 148/6; వికెట్ల పతనం: 1-10, 2-48, 3-54, 4-118, 5-124, 6-140; బౌలింగ్: దీపక్ చాహర్ 3-0-23-1, బుమ్రా 4-0-26-1, బాష్ 3-0-30-3, ఘజన్‌ఫర్ 4-0-25-1, హార్దిక్ 2-0-13-0, రఘు 2-0-23-0, జాక్స్ 0.5-0-7-0.

ఇవి కూడా చదవండి:
భారత టీ20 జట్టుకు శ్రేయస్ కెప్టెన్ అవుతాడు: రికీ పాంటింగ్
లార్డ్స్ మైదానంలో తొలి టీ20 ప్రపంచ కప్ గెలుస్తాం: జెమీమా