Share News

అహ్మదాబాద్‌లో ఐపీఎల్‌ ఫైనల్‌

ABN , Publish Date - May 07 , 2026 | 04:36 AM

అహ్మదాబాద్‌ వరుసగా రెండో సంవత్సరమూ ఐపీఎల్‌ ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈమేరకు తుదిపోరుతోపాటు ప్లేఆఫ్స్‌ వేదికలను బీసీసీఐ బుధవారం ప్రకటించింది....

అహ్మదాబాద్‌లో ఐపీఎల్‌ ఫైనల్‌

బెంగళూరు నుంచి తరలింపు

ధర్మశాల, న్యూ చండీగఢ్‌లో ప్లేఆఫ్స్‌

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌ వరుసగా రెండో సంవత్సరమూ ఐపీఎల్‌ ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈమేరకు తుదిపోరుతోపాటు ప్లేఆఫ్స్‌ వేదికలను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఇక.. క్వాలిఫయర్‌-1 ధర్మశాలలో జరుగుతుంది. రెండు ఫ్లేఆఫ్స్‌ మ్యాచ్‌లను న్యూచండీగఢ్‌లో నిర్వహించనున్నారు. వాస్తవంగా..ఈనెల 31న జరిగే టైటిల్‌ ఫైట్‌ను బెంగళూరులో నిర్వహించాలని బీసీసీఐ తొలుత నిర్ణయించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు అయినందున సంప్రదాయం ప్రకారం ఈసారి ఐపీఎల్‌ ఫైనల్‌ బెంగళూరులో జరగాలి. ‘నిజానికి ఫైనల్‌ను బెంగళూరులో నిర్వహించాలని తొలుత నిర్ణయించాం. అయితే బీసీసీఐ నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనల పరిధికి మించిన డిమాండ్లను స్థానిక క్రికెట్‌ సంఘం, అధికారుల నుంచి రావడంతో ఆ నగరం నుంచి వేదికను తరలించాం’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఆ డిమాండ్లు ఏమిటనేవి మాత్రం బోర్డు స్పష్టంగా వెల్లడించలేదు. ప్లేఆఫ్స్‌ వేదికలుగా మూడింటిని ఎంపిక చేయడం ఈసారి ప్రత్యేకతగా బీసీసీఐ పేర్కొంది. ధర్మశాల మొదటిసారి ఫ్లేఆఫ్స్‌కు ఆతిథ్యమిస్తోంది.


కారణం అదేనా ?

కాగా..ఐపీఎల్‌ మ్యాచ్‌ టిక్కెట్ల కోసం కర్ణాటక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల నుంచి వచ్చిన భారీ డిమాండే ఫైనల్‌ మ్యాచ్‌ను బెంగళూరు నుంచి తరలించడానికి ప్రధాన కారణమని సమాచారం. దాంతో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ జ్యోకం చేసుకొని ఐపీఎల్‌ నిర్వాహకులతో మాట్లాడారు. దరిమిలా చిన్నస్వామి స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్‌కూ ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు మూడేసి కాంప్లిమెంటరీ పాసులు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. మరోవైపు మ్యాచ్‌ టిక్కెట్ల రేట్లు భారీగా ఉన్నాయని, అందువల్ల ఉచితంగా టిక్కెట్లు ఇవ్వాలని క్రికెట్‌ ఫ్యాన్స్‌ గళమెత్తారు. ఇంకా..బెంగళూరు-లఖ్‌నవూ జట్ల మ్యాచ్‌కు సంబంధించి 100 టిక్కెట్లను చిన్నస్వామి స్టేడియం క్యాంటిన్‌ ఉద్యోగి ఒకరు రూ. 15 నుంచి 19 వేలకు బ్లాక్‌లో అమ్ముతుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ టిక్కెట్లను కర్ణాటక క్రికెట్‌ సంఘం సభ్యుడొకరు తనకు ఇచ్చినట్టు నిందితుడు వెల్లడించడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో బెంగళూరు నుంచి ఫైనల్‌ మ్యాచ్‌ను తరలిస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

ప్లేఆఫ్స్‌ షెడ్యూల్‌

మే 26 : క్వాలిఫయర్‌-1, ధర్మశాల

మే 27 : ఎలిమినేటర్‌, న్యూ చండీగఢ్‌

మే 29 : క్వాలిఫయర్‌-2, న్యూ చండీగఢ్‌

మే 31 : ఫైనల్‌, అహ్మదాబాద్‌

ఇవి కూడా చదవండి:

సంజు శాంసన్ మా జట్టుకు వెన్నుముక: రుతురాజ్

భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం!

Updated Date - May 07 , 2026 | 04:36 AM