కాంప్లిమెంటరీ పాసులు ఎందుకు
ABN , Publish Date - Apr 29 , 2026 | 01:53 AM
ఐపీఎల్ వచ్చిందంటే కాంప్లిమెంటరీ పాసుల పేరిట హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో జరిగే హంగామా...
రాజకీయ ప్రముఖులు టిక్కెట్లు కొనలేరా?
అపెక్స్ సభ్యులకు 300, క్లబ్‌లకు 2600 పాసులా?
పాసులను టిక్కెట్లుగా మార్చాలంటున్న ఫ్యాన్స్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఐపీఎల్ వచ్చిందంటే కాంప్లిమెంటరీ పాసుల పేరిట హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. హెచ్‌సీఏ, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఫ్రాంచైజీ మధ్య ఒప్పందం ప్రకారం స్టేడియం మొత్తం సీటింగ్ సామర్థ్యంలోని పది శాతం అంటే సుమారు 3 వేల 500 టిక్కెట్లు ప్రతి మ్యాచ్‌కు అసోసియేషన్‌కు అందుతాయి. ఇందులో హెచ్‌సీఏ పాలకమండలి (అపెక్స్ కౌన్సిల్) సభ్యులు ఆరుగురు 50 నుంచి 70 పాసుల చొప్పున సుమారు 300-350 తీసుకుంటారు. 210కి పైగా ఉన్న హెచ్‌సీఏ అనుబంధ క్లబ్‌లకు ఒక్కో క్లబ్‌కి 12 చొప్పున దాదాపు 2,520 పాసులు, మంత్రులు, రాజకీయ ప్రముఖులు మొదలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇతరత్రా ప్రభుత్వ యంత్రాంగానికి మరో 500 పాసులను పందేరం చేయడం హెచ్‌సీఏలో ఆనవాయితీగా మారిపోయింది. కాంప్లిమెంటరీ పాసుల వ్యవస్థ వేర్లు పాతుకొని ఉండడంతో ఐపీఎల్ వచ్చిదంటే రాజకీయ ప్రముఖుల నుంచి అధికార యంత్రాంగం వరకు ఈ పాసుల కోసం హెచ్‌సీఏపై ఒత్తిడి తెస్తుంటారు. అయితే, ఈ పాసులను రద్దు చేసి, వీటిని కూడా టిక్కెట్ల రూపంలో విక్రయించి వచ్చిన ఆదాయాన్ని గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి ఖర్చు చేయాలని పలువురు క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. క్రికెట్‌కు ఉన్న ఆదరణ దృష్టిలో పెట్టుకుని ఇవి కూడా అమ్మకానికి ఉంచితే అభిమానులకు మరిన్ని టిక్కెట్లు అందుబాటులోకి వస్తాయని వారంటున్నారు.
పాసులను టిక్కెట్లుగా మార్చండి..: ప్రతి ఐపీఎల్ మ్యాచ్‌కు క్లబ్‌కు ఇచ్చే 12 టిక్కెట్ల (రంగన్న లాంజ్-3, మాన్‌సింగ్ లాంజ్-3, వెస్ట్, ఈస్ట్ ఫస్ట్ ఫ్లోర్-4, టెర్రాస్-2) వెల ప్రస్తుతం స్టేడియంలో విక్రయిస్తున్న టిక్కెట్ల ధరతో పోలిస్తే సుమారు రూ.70 వేలుగా ఉంది. అలానే హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఇచ్చే 300-350 పాసుల వెల దాదాపు రూ.50 లక్షలుగా ఉంటుంది. ఇక 210 క్లబ్‌లకు ఇచ్చే పాసులను సాధారణ టిక్కెట్ల ధరలో చూస్తే ప్రతి మ్యాచ్‌కు రూ.కోటి 50 లక్షలు, అపెక్స్ సభ్యుల పాసుల విలువ రూ.50 లక్షలు కలిపితే రూ.2 కోట్లు. రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ యంత్రాగానికి ఇస్తున్న పాసుల ధరల్ని జత చేస్తే ప్రతి మ్యాచ్‌కు సుమారు రూ.3 కోట్ల విలువైన టిక్కెట్లను పాసుల రూపం లో పంచుతున్నారు. పాసుల మూలంగా ప్రభుత్వానికి పన్నులు, జీఎస్టీ రూపం లో ఒక్క రూపాయి ఆదాయం రాదు. అదే సమయంలో హెచ్‌సీఏకి కూడా నయా పైసా రాదు. ఇప్పటికైనా హెచ్‌సీఏ విప్లవాత్మక నిర్ణయం తీసుకొని ఈ పాసుల సంఖ్యను కనీసం సగానికి సగం తగ్గించి, వాటిని టిక్కెట్ల రూపంలో ఎస్‌ఆర్‌హెచ్ ద్వారా విక్రయించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
జనన రికార్డుల్లో వ్యత్యాసాలు.. అండర్ 17 మహిళా రెజ్లర్‌పై వేటు
మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి: విరాట్ కోహ్లీ