లింగ వివక్షను దాటి..
ABN , Publish Date - May 05 , 2026 | 05:24 AM
రితిక శ్రీ అసలు పేరు ముత్తురాజ. జన్మతహః పురుషుడు. మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చదివిన అతడు.. మొహాలీలోని ఓ కాల్ సెంటర్‌లో...
ట్రాన్స్‌జెండర్ అంపైర్‌గా రితిక శ్రీ
సంకల్పం.. పట్టుదల ఉంటే సాధించలేనిదేమీ ఉండదనేదానికి ఉదాహరణ రితిక శ్రీ. సామాజిక వివక్ష, విమర్శలను దాటుకొని దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ అంపైర్‌గా ఎదిగిన ఆమె.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తమిళనాడులోని సేలానికి చెందిన రితిక.. 2021 నుంచి సేలం, కోయంబత్తూర్ సర్క్యూట్‌లో అంపైరింగ్ చేస్తోంది. ప్రస్తుతం కోయంబత్తూర్ జిల్లా క్రికెట్ సంఘం లీగ్‌లో మ్యాచ్ అధికారిగా వ్యవహరిస్తోంది.
ముత్తురాజ నుంచి..
రితిక శ్రీ అసలు పేరు ముత్తురాజ. జన్మతహః పురుషుడు. మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చదివిన అతడు.. మొహాలీలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేసేవాడు. అప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తూ క్రికెట్ పట్ల ఆకర్షితుడయ్యాడు. కొవిడ్ సమయంలో ఇబ్బందులు ఎదురుకావడంతో.. స్వస్థలానికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అంపైరింగ్ చేయాలనే ఆలోచన రావడంతో.. ఆ దిశగా ప్రయత్నించి సమాచారం తెలుసుకొన్నాడు. ‘సేలం జిల్లా అంపైర్ల కమిటీ చైర్మన్ జయరామన్‌ను కలవడంతో.. కెరీర్‌కు ఓ దిశ లభించింది. డిస్ట్రిక్ ప్యానెల్‌లోని ఇతరులు కూడా అంపైరింగ్ పాఠాలు చెప్పడం కెరీర్‌కు లాభించింద’ని చెప్పాడు.
అర్థం చేసుకొని.. అండగా నిలిచారు..
అయితే, బయటకు పురుషుడిలా ఉన్నా.. తనలోని స్త్రీ గురించి మాత్రం చెప్పడానికి ఎంతో ఇబ్బందిపడినట్టు రితిక శ్రీ తెలిపింది. తాను పూర్తి ఆడదానిగా మారాలనుకొంటున్న విషయం జయరామన్ దంపతులకు చెబితే.. వారు తనను అర్థం చేసుకొని మద్దతుగా నిలిచారని చెప్పింది. అంపైరింగ్‌లో నిలదొక్కుకొన్నాక.. లింగ మార్పిడి చికిత్స చేయించుకోవాలని సలహా ఇవ్వడంతో అలాగే చేశానని పేర్కొంది. 2024లో శస్త్రచికిత్స చేయించుకొన్న తర్వాతి ఏడాది నుంచి మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టినట్టు చెప్పింది. తమిళనాడు క్రికెట్ సంఘం స్టేట్ అంపైర్ ప్యానెల్‌కు ఆహ్వానించే దరఖాస్తుల్లో ‘థర్డ్ జెండర్’ను చేర్చడం తన పట్టుదలకు గుర్తింపు అని రితిక శ్రీ సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
బెంగాల్‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ