Share News

అమ్మాయిల స్వర్ణ భేరి

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:43 AM

ప్రతిష్టాత్మక ఆసియాగేమ్స్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో శ్రీలంకపై 147 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన హర్మన్‌ప్రీత్‌ సేన....

అమ్మాయిల స్వర్ణ భేరి

  • ఆసియాగేమ్స్‌ మహిళల క్రికెట్‌లో రెండో టైటిల్‌

  • అదరగొట్టిన షఫాలీ, మంధాన, రిచా

  • ఫైనల్లో శ్రీలంక చిత్తు

  • ఈ క్రీడల్లో భారత్‌కిదే తొలి పసిడి పతకం

నిస్సిన్‌: ప్రతిష్టాత్మక ఆసియాగేమ్స్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో శ్రీలంకపై 147 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన హర్మన్‌ప్రీత్‌ సేన.. తాజా గేమ్స్‌లో దేశానికి తొలి స్వర్ణ పతకం అందించింది. అలాగే భారత జట్టుకిది వరుసగా రెండో గోల్డ్‌ మెడల్‌ కావడం విశేషం. 2023లోనూ పోడియం సాధించింది. అటు రన్నరప్‌ శ్రీలంక రజతంతో సరిపెట్టుకుంది. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన పాకిస్థాన్‌కు కాంస్యం లభించింది. ఇక శ్రీలంకపై ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 216 పరుగులు సాధించింది. పవర్‌ప్లేలో భారత్‌ 67 పరుగులతో పటిష్టంగా నిలిచింది. ఓపెనర్లు స్మృతి మంధాన (45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 79) హాఫ్‌ సెంచరీ చేయగా, షఫాలీ వర్మ (29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 48)తో పాటు చివర్లో రిచా ఘోష్‌ (22 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 నాటౌట్‌) చెలరేగారు. ఆఖరి ఓవర్లో ఏకంగా 25 పరుగులు రావడంతో భారత్‌ స్కోరు 200 మార్క్‌ దాటగలిగింది. ఆ తర్వాత ఛేదనలో శ్రీలంక 15.4 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ చమరి ఆటపట్టు (29), కౌషని (14) మాత్రమే రాణించారు. స్పిన్నర్లు దీప్తి శర్మ మూడు.. షఫాలీ, శ్రేయాంక, శ్రీచరణిలకు రెండేసి వికెట్లు దక్కాయి.

సంక్షిప్త స్కోర్లు

భారత్‌: 20 ఓవర్లలో 216/3 (మంధాన 79, రిచా 49 నాటౌట్‌, షఫాలీ 48;

శ్రీలంక: 15.4 ఓవర్లలో 69 ఆలౌట్‌ (చమరి 29, కౌషని 14; దీప్తి 3/6, షఫాలీ 2/3, శ్రేయాంక 2/9, శ్రీచరణి 2/13).


షఫాలీ @: 4

భారత మహిళల జట్టు ఓపెనర్‌ షఫాలీ వర్మ తన ర్యాంకింగ్‌ను కూడా మెరుగుపర్చుకుంది. టీ20 మహిళల బ్యాటర్లలో ఆమె 756 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో 2 స్థానాలను మెరుగుపర్చుకుంది. ఇటీవలి ఆసియాకప్‌లో 64, 68 రన్స్‌ చేసిన షఫాలీ.. తాజా ఆసియాగేమ్స్‌లో బంగ్లాదేశ్‌పై శతకం అందుకుంది. అలాగే ఫైనల్లో లంకపై 48 రన్స్‌ చేసింది. మంధాన ఆరో స్థానంలో ఉండగా.. బౌలింగ్‌లో శ్రీచరణి, దీప్తిటాప్‌-2లో కొనసాగుతున్నారు.

దేశం గర్విస్తోంది..

‘అద్భుత విజయం సాధించిన భారత మహిళల క్రికెట్‌ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆత్మవిశ్వాసం, అద్భుత నైపుణ్యంతో సమష్ఠిగా సాధించిన విజయమిది. ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం అందించి దేశం గర్వించేలా చేశారు. అలాగే మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో భారత్‌కు తొలిసారి పతకం అందించిన సుచికకు కూడా అభినందనలు’

ప్రధాని మోదీ

1

అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో తొలిసారిగా 11 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా స్మృతి మంధాన.

ఆసియా గేమ్స్‌ మహిళల టీ20ల్లో అత్యధిక స్కోరు (216/3) సాధించిన జట్టుగా భారత్‌.

మహిళల టీ20 క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా ఎక్కువ పరుగుల (4000) భాగస్వామ్యం అందించిన జోడీగా మంధాన-షఫాలీ

ఒకే క్యాలెండర్‌ ఏడాది (2026)లో ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్‌గా షఫాలీ (863). లారా వోల్వార్ట్‌ (824)ను అధిగమించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ

ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

Updated Date - Sep 23 , 2026 | 05:45 AM