విజయానికి 4 వికెట్లు
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:18 AM
ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. 457 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆదివారం ఆట...
భారీ గెలుపు దిశగా భారత్
ఇంగ్లండ్ లక్ష్యం 457.. ప్రస్తుతం 130/6
హర్మన్‌సేన రెండో ఇన్నింగ్స్ 341/7 డిక్లేర్ జూయాస్తిక శతకం
లండన్: ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. 457 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆదివారం ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 130/6 స్కోరుతో నిలిచింది. అమీ జోన్స్ (52 బ్యాటింగ్), ఎకెల్‌స్టోన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆతిథ్య జట్టు గెలుపునకు ఇంకా 327 పరుగుల దూరంలో ఉండగా.. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆటకు సోమవారం చివరిరోజు కావడంతో ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్ తొలి విజయం ఖాయంగా కనిపిస్తోంది. అంతకుముందు యాస్తిక భాటియా (113) చిరస్మరణీయ శతకం సహాయంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 341/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (70), రిచా ఘోష్ (50 నాటౌట్) అర్ధసెంచరీలు సాధించారు. రెండో వికెట్‌కు మంధాన-యాస్తిక జోడీ 73 పరుగులు జోడించారు. అలాగే ఐదో వికెట్‌కు దీప్తి (10)తో కలిసి యాస్తిక 52 పరుగులు అందించింది. ఎకెల్‌స్టోన్‌కు ఐదు, లారెన్ బెల్‌కు రెండు వికెట్లు దక్కాయి.
హీథర్ నైట్ వీడ్కోలు: ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ హీథర్ నైట్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు తన కెరీర్‌లో చివరిదని ప్రకటించింది. 2010లో అరంగేట్రం చేసిన నైట్ 15 టెస్టులు, 160 వన్డేలు, 145 టీ20ల్లో కలిపి 7998 పరుగులు చేసింది. 2017లో తన కెప్టెన్సీలోనే ఇంగ్లండ్ వన్డే వరల్డ్‌కప్ అందుకుంది. అలాగే మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన తొలి ఇంగ్లండ్ ప్లేయర్ (పురుషులు, మహిళల్లో)గా నిలిచింది. మరోవైపు ఇంగ్లండ్ మహిళల జట్టు నుంచి అత్యధిక మ్యాచ్‌లు (320) ఆడిన రికార్డు కూడా తనదే కావడం విశేషం.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 285; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 170;
భారత్ రెండో ఇన్నింగ్స్: 341/7 (యాస్తిక 113, మంధాన 70, రిచా 50 నాటౌట్; ఎకెల్‌స్టోన్ 5/118, బెల్ 2/27); ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 130/6 (అమీ జోన్స్ 52 బ్యాటింగ్, విల్లీర్స్ 26; సయాలి 2/19, స్నేహ్ 2/33, క్రాంతి 2/40).
1
లార్డ్స్ మైదానంలో సెంచరీ బాదిన తొలి మహిళా బ్యాటర్‌గా యాస్తిక భాటియా
ఇవి కూడా చదవండి:
నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!
భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!