మనమ్మాయిలు ఆసియా రాణులు
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:26 AM
ఆల్‌రౌండ్ షోతో ఆదరగొట్టిన భారత్.. మహిళల టీ20 ఆసియాకప్ విజేతగా నిలిచింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68), స్మృతీ మంధాన (39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59) దూకుడైన...
ఎనిమిదోసారి ఆసియాకప్ భారత్ సొంతం
ఫైనల్లో శ్రీలంక చిత్తు
షఫాలీ, మంధాన అర్ధ శతకాలు
శ్రీచరణికి 4 వికెట్లు
భారత మహిళలు రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి ఆసియాక్‌పను సొంతం చేసుకొన్నారు. ఓపెనర్లు స్మృతీ మంధాన, షఫాలీ వర్మ మెరుపు బ్యాటింగ్‌కు తోడు తెలుగమ్మాయి శ్రీచరణి, దీప్తి శర్మ బంతితో అదరగొట్టడంతో ఫైనల్లో లంకను చిత్తు చేసి ఆసియా రాణులుగా అవతరించారు.
దుబాయ్: ఆల్‌రౌండ్ షోతో ఆదరగొట్టిన భారత్.. మహిళల టీ20 ఆసియాకప్ విజేతగా నిలిచింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68), స్మృతీ మంధాన (39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59) దూకుడైన అర్ధ శతకాలు నమోదు చేయగా.. శ్రీచరణి (4/20), దీప్తి శర్మ (3/19) స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి పనిబట్టారు. దీంతో ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్ 72 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంప్ శ్రీలంకను చిత్తు చేసింది. టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచిన హర్మన్ సేన.. రికార్డుస్థాయిలో 8వసారి ఆసియా టైటిల్‌ను సొంతం చేసుకొంది. వన్డే ఫార్మాట్‌లో నాలుగుసార్లు విజేతగా నిలిచిన భారత్.. పొట్టి ఫార్మాట్‌లో కూడా నాలుగోసారి టైటిల్‌ను చేజిక్కించుకొంది. తొలుత భారత్ 20 ఓవర్లలో 183/5 స్కోరు చేసింది. ఛేదనలో లంక ఓవర్లన్నీ ఆడి 111 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ చమరి ఆటపట్టు (36), నీలాక్షిక సిల్వ (22), విష్మి గుణరత్నే (20) టాప్ స్కోరర్లు. ప్రతికా రావత్ స్థానంలో బదులు కమలిని భారత జట్టులోకి వచ్చింది.
ఆరంభంలోనే షాక్..: భారీ ఛేదనలో ఓపెనర్ ఇమేష (4)ను క్రాంతి తొలి ఓవర్‌లోనే బౌల్డ్ చేసి లంకకు షాకిచ్చింది. అయితే, మరో ఓపెనర్ చమరి ఆటపట్టు, విష్మి రెండో వికెట్‌కు 58 పరుగులతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఐదో ఓవర్‌లో చమరి 4,6 బాదడంతో.. ఆరు ఓవర్లు ముగిసే సరికి లంక 38/1తో నిలిచింది. మధ్య ఓవర్లలో వీరిద్దరూ ఆచితూచి ఆడడంతో లంక సాధించాల్సిన రన్‌రేట్ పెరిగింది. దీంతో చమరి 4,6,4తో దూకుడు పెంచాలని చూసింది. కానీ, 10వ ఓవర్‌లో ఆటపట్టు, విష్మిని దీప్తి అవుట్ చేయడంతో లంక 63/3తో కష్టాల్లో పడింది. ఆశలు పెట్టుకొన్న హర్షిత (9), కవిష (7)తోపాటు నీలాక్షిని శ్రీచరణి వెనక్కిపంపడంతో లంక ఓటమి లాంఛనమే అయింది. హాసిని (1), సుగంధిక (1), మిథాలి (0), కౌషిని (9) పెవిలియన్‌కు క్యూ కట్టారు.
మెరిసిన ఓపెనర్లు..: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్‌కు ఓపెనర్లు స్మృతీ మంధాన, షఫాలీ వర్మ అదిరే ఆరంభాన్నిచ్చారు. వీరు తొలి వికెట్‌కు 77 బంతుల్లో 129 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో భారత్ సవాల్ విసరగలిగే స్కోరు చేసింది. 5వ ఓవర్‌లో చమరి బౌలింగ్‌లో వర్మ 4,6,6తో 20 పరుగులు రాబట్టడంతో.. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 57/0తో నిలిచింది. మధ్య ఓవర్లలో కూడా వీరిద్దరూ వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు కొడుతూ స్కోరు బోర్డును నడిపించారు. ఈ క్రమంలో 8వ ఓవర్‌లో బౌండ్రీతో షఫాలీ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. మంధాన కూడా 4,6తో గేర్ మార్చింది. 11వ ఓవర్‌లో నీలాక్షిక బౌలింగ్‌లో 6,4తో స్మృతి అర్ధ శతకం పూర్తి చేసింది. అయితే, 3 పరుగుల తేడాతో షషాలీ, మంధాన పెవిలియన్ చేరడంతో డెత్ ఓవర్లలో భారత్ ఆశించిన రీతిలో జోరుచూపలేక పోయింది. 13వ ఓవర్‌లో షఫాలీని ప్రబోధ వెనక్కిపంపగా.. ఆ తర్వాతి ఓవర్‌లో స్మృతి రనౌటైంది. ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (14), రిచా ఘోష్ (17) మూడో వికెట్‌కు 28 పరుగుల భాగస్వామ్యంతో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ, ఘోష్‌తోపాటు హర్మన్, దీప్తి (5) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అయితే, ఆఖరి ఓవర్‌లో కమలిని (15 నాటౌట్) 4,6తో స్కోరును 180 మార్క్ దాటించింది.
స్కోరుబోర్డు
భారత్: స్మృతీ మంధాన (రనౌట్) 59, షఫాలీ (సి) ఆటపట్టు (బి) ప్రబోద 68, హర్మన్‌ప్రీత్ (సి/సబ్) కవింది (బి) అయోధ్య 14, రిచా ఘోష్ (సి) దిల్హరి (బి) ఆటపట్టు 17, దీప్తి శర్మ (రనౌట్) 5, బార్తీ పుల్మాలి (నాటౌట్) 2, కమలిని (నాటౌట్) 15, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 183/5; వికెట్ల పతనం: 1-129, 2-132, 3-160, 4-166, 5-167; బౌలింగ్: మిథాలి అయోధ్య 4-0-33-1, కవిష దిల్హరి 3-0-29-0, సుగంధిక కుమారి 4-0-31-0, చమరి ఆటపట్టు 4-0-34-1, చాముది ప్రబోద 4-0-40-1, నీలాక్షిక సిల్వా 1-0-15-0.
శ్రీలంక: ఇమేష (బి) క్రాంతి 4, చమరి ఆటపట్టు (స్టంప్డ్) రిచా (బి) దీప్తి 36, విష్మి గుణరత్నే (బి) దీప్తి 20, హర్షిత (సి అండ్ బి) శ్రీచరణి 9, నీలాక్షిక సిల్వా (సి) కమలిని (బి) శ్రీచరణి 22, కవిష దిల్హరి (సి) నందని (బి) శ్రీచరణి 7, హాసిని పెరెర (సి) శ్రీచరణి (బి) షఫాలీ 1, కౌషిని (బి) దీప్తి 9, సుగంధిక (సి) నందని (బి) శ్రీచరణి 1, మిథాలి అయోధ్య (స్టంప్డ్) రిచా (బి) ప్రేమ 0, చాముది ప్రబోద (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 111 ఆలౌట్; వికెట్ల పతనం: 1-4, 2-62, 3-63, 4-86, 5-100, 6-101, 7-103, 8-104, 9-107, 10-111; బౌలింగ్: క్రాంతి గౌడ్ 2-0-8-1, నందని శర్మ 3-0-17-0, షఫాలీ 4-0-23-1, శ్రీచరణి 4-1-20-4, దీప్తి శర్మ 4-019-3, ప్రేమా రావత్ 3-0-22-1.
ట్రోఫీ అందుకోకుండానే..
ఆసియాక్‌పలో విజేతగా నిలిచిన భారత జట్టు ట్రోఫీ మాత్రం అందుకోలేదు. ఎందుకంటే.. పాకిస్థాన్ మంత్రి, ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్‌ను తీసుకోవడానికి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ బృందం ఇష్టపడకపోవడమే. మరోవైపు ఈ ట్రోఫీని ప్రదానం చేసేందుకు నఖ్వీ మైదానంలోనే ఉన్నా.. మ్యాచ్ ముగియగానే ప్లేయర్లందరూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. గతేడాది ఇదే వేదికపై జరిగిన పురుషుల ఆసియాక్‌పలోనూ నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా నిరాకరించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్: వరుసగా నాలుగోసారి.. విజేతగా భారత్
ఆసియా కప్ జూనియర్ హాకీ: భారత మహిళల హ్యాట్రిక్ విజయం