Share News

‘డబుల్‌’ తుఫాన్‌

ABN , Publish Date - Oct 01 , 2026 | 06:10 AM

పరుగుల వరద పారిన మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (133 బంతుల్లో 26 ఫోర్లు, 8 సిక్స్‌లతో 223 నాటౌట్‌) వేగవంతమైన అజేయ డబుల్‌తో కదం తొక్కడంతో..భారత వన్డేల చరిత్రలోనే...

‘డబుల్‌’ తుఫాన్‌

గిల్‌ ద్విశతక జోరు

శతక్కొట్టిన రోహిత్‌

  • భారత్‌ చారిత్రక ఛేదన

  • రెండో వన్డేలో 8 వికెట్లతో విండీస్‌ ఓటమి

  • క్యాంప్‌బెల్‌, హోప్‌, జాంగూ సెంచరీలు వృధా

406 పరుగుల లక్ష్యం..

ఇంత భారీ ఛేజింగ్‌.. ఎంత మేటి జట్టుకైనా దాదాపు అసాధ్యమే..! కానీ, టీమిండియా బ్యాటర్లు కొండను పిండి చేశారు.. వన్డేల చరిత్రలోనే రెండో అత్యధిక ఛేదనను నమోదు చేశారు. గిల్‌ చిరస్మరణీయ డబుల్‌ సెంచరీతో వీరవిహారం చేయగా.. రోహిత్‌ శతకంతో చెలరేగాడు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 250 రన్స్‌కుపైగా భాగస్వామ్యం నమోదు చేయడంతో.. భారత్‌ మరో 39 బంతులు మిగిలుండగానే విజయభేరి మోగించింది. టాపార్డర్‌ బ్యాటర్లు క్యాంప్‌బెల్‌, హోప్‌, జాంగూ శతకాలతో తమ వన్డే చరిత్రలోనే వెస్టిండీస్‌ అత్యధిక స్కోరు చేసింది. కానీ, ఆ ఆనందాన్ని కొద్ది గంటల్లోపే భారత్‌ ఆవిరిచేసింది.

గువాహటి: పరుగుల వరద పారిన మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (133 బంతుల్లో 26 ఫోర్లు, 8 సిక్స్‌లతో 223 నాటౌట్‌) వేగవంతమైన అజేయ డబుల్‌తో కదం తొక్కడంతో..భారత వన్డేల చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో వెస్టిండీ్‌సను ఓడించింది. మూడు వన్డేల సిరీ్‌సను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకొంది. తొలుత వెస్టిండీస్‌ 50 ఓవర్లలో 405/7 స్కోరు చేసింది. అమీర్‌ జాంగూ (77 బంతుల్లో 114), షాయ్‌ హోప్‌ (94 బంతుల్లో 104), జాన్‌ క్యాంప్‌బెల్‌ (68 బంతుల్లో 101) శతకాలు వృథా అయ్యాయి. కుల్దీప్‌, జడేజా, గుర్నూర్‌ బ్రార్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత్‌ 43.3 ఓవర్లలో 406/2 స్కోరు చేసి గెలిచింది. రోహిత్‌ శర్మ (75 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101) సెంచరీ సాధించాడు. జేడెన్‌ సీల్స్‌, షామర్‌ జోసెఫ్‌ చెరో వికెట్‌ దక్కించుకొన్నారు. గిల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 811 పరుగులు నమోదు కావడం విశేషం.

ఎక్కడా తగ్గకుండా..: కొండంత లక్ష్యమే అయినా.. ఓపెనర్లు రోహిత్‌, కెప్టెన్‌ గిల్‌ ఊచకోతతో టీమిండియా సులువుగానే గెలిచింది. ముఖ్యంగా గిల్‌ అజేయ డబుల్‌ సెంచరీతో తుదికంటా క్రీజులో నిలిచాడు. విండీస్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తొలి వికెట్‌కు రోహిత్‌తో కలసి 255 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేసిన గిల్‌.. కోహ్లీ (29)తో కలసి రెండో వికెట్‌కు 65 పరుగులు, రుతురాజ్‌ గైక్వాడ్‌ (31 నాటౌట్‌)తో మూడో వికెట్‌కు 86 పరుగులతో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. ఈ క్రమంలో రోహిత్‌ కంటే ముందుగా 21వ ఓవర్‌లో అల్జారీ బౌలింగ్‌లో బౌండ్రీతో గిల్‌ సెంచరీ మార్క్‌ అందుకొన్నాడు. అనంతరం వరుస బౌండ్రీలతో వంద పూర్తి చేసుకొన్న రోహిత్‌ను 27వ ఓవర్‌లో జేడెన్‌ సీల్స్‌ ఎల్బీగా వెనక్కిపంపాడు. అప్పటికి భారత్‌ స్కోరు 255 పరుగులు కాగా.. విజయానికి ఇంకా 151 రన్స్‌ కావాలి. ఈ దశలో వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ, గిల్‌ రెండో వికెట్‌కు చకచకా పరుగులు జోడించడంతో.. లక్ష్యం వేగంగా కరిగింది. అయితే, షామర్‌ బౌలింగ్‌లో రూథర్‌ఫోర్డ్‌ చక్కని క్యాచ్‌ అందుకోవడంతో.. విరాట్‌ వెనుదిరిగాడు. అనంతరం గిల్‌ 117 బంతుల్లోనే 200 పరుగులను పూర్తి చేసుకొన్నాడు. సాధించాల్సిన రన్‌రేట్‌ భారీగా తగ్గడంతో.. చివరి ఓవర్లలో భారత బ్యాటర్లు నింపాదిగా ఆడుతూ.. మరో 39 బంతులు మిగిలుండగానే జట్టును గెలుపు గీత దాటించారు.


బాదుడే.. బాదుడు: ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌, హోప్‌తోపాటు జాంగూ శతకాల మోత మోగించడంతో వన్డేల్లో విండీస్‌ తొలిసారి 400 పరుగుల మార్క్‌ దాటింది. ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌తో కలసి రెండో వికెట్‌కు 110 రన్స్‌ జోడించిన హోప్‌.. జాంగూతో కలసి మూడో వికెట్‌కు 182 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరుకు బాటలు వేశాడు. టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన విండీ్‌సకు ఆరంభంలోనే దెబ్బతగిలింది. ఓపెనర్‌ కేసీ కార్టీ (9)ని కృష్ణ స్వల్ప స్కోరుకే వెనక్కిపంపాడు. కానీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ హోప్‌ సహకారంతో మరో ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 18వ ఓవర్‌లో క్యాంప్‌బెల్‌ సెంచరీ పూర్తి చేసుకొన్న జాన్‌ను అవుట్‌ చేసి గుర్నూర్‌ బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత హోప్‌.. జాంగూతో కలసి కదం తొక్కాడు. అయితే, సెంచరీలు పూర్తి చేసుకొన్న హోప్‌, జాంగూ కొద్ది తేడాతో అవుట్‌ కావడంతో ఆఖరి ఓవర్లలో విండీస్‌ జోరు కొంత తగ్గింది. 40వ ఓవర్‌లో హోప్‌ను కుల్దీప్‌ పెవిలియన్‌ చేర్చగా.. రూథర్‌ఫోర్డ్‌ (0)ను బ్రార్‌ వెనక్కిపంపాడు. ఆ తర్వాత 43వ ఓవర్‌లో జాంగూను జడేజా క్యాచవుట్‌ చేశాడు.

  • 20 శతకాలు బాదిన హోప్‌.. లారా (19)ను వెనక్కునెట్టి రెండో స్థానంలో నిలిచాడు. విండీస్‌ తరఫున అత్యధిక సెంచరీల జాబితాలో క్రిస్‌ గేల్‌ (25) టాప్‌లో ఉన్నాడు.

  • ఒకే మ్యాచ్‌లో 5 శతకాలు నమోదు కావడం వన్డేల చరిత్రలో ఇదే తొలిసారి. వెస్టిండీస్‌ తరఫున క్యాంప్‌బెల్‌, షాయ్‌ హోప్‌, అమీర్‌ జాంగూ సెంచరీలు సాధిస్తే.. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌, గిల్‌ శతకాలతో మెరిశారు.

స్కోరుబోర్డు

వెస్టిండీస్‌: క్యాంప్‌బెల్‌ (సి) నమన్‌ (బి) బ్రార్‌ 101, కార్టీ (సి) నమన్‌ (బి) ప్రసిద్ధ్‌ 9, హోప్‌ (సి) నబీ (బి) కుల్దీప్‌ 104, జాంగూ (సి) రుతురాజ్‌ (బి) జడేజా 114, రూథర్‌ఫోర్డ్‌ (సి/సబ్‌) జైస్వాల్‌ (బి) బ్రార్‌ 0, చేజ్‌ (నాటౌ ట్‌) 29, పాల్‌ (సి) కోహ్లీ (బి) కుల్దీప్‌ 3, అల్జారీ జోసెఫ్‌ (సి) రోహిత్‌ (బి) జడేజా 8, షామర్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు: 23; మొత్తం: 50 ఓవర్లలో 405/7; వికెట్ల పతనం: 1-37, 2-147, 3-329, 4-330, 5-348,6-369, 7-385; బౌలింగ్‌: ప్రసిద్ధ్‌ 5-0-45-1, నబీ 8.5-0-84-0, బ్రార్‌ 10-0- 96-2, నమన్‌ 6.1-0-38-0, జడేజా 10-0-75-2, కుల్దీప్‌ 10-0- 65-2.

భారత్‌: రోహిత్‌ (ఎల్బీ) సీల్స్‌ 101, గిల్‌ (నాటౌట్‌) 223, కోహ్లీ (సి) రూథర్‌ఫోర్డ్‌ (బి) షామర్‌ 29, గైక్వాడ్‌ (నాటౌట్‌) 31; ఎక్స్‌ట్రాలు: 22; మొత్తం: 43.3 ఓవర్లలో 406/2; వికెట్ల పతనం: 1-255, 2-320; బౌలింగ్‌: సీల్స్‌ 8-0-78-1, అల్జరీ జోసెఫ్‌ 8-0-89-0, షామర్‌ 6-0-52-1, కీమో పాల్‌ 3-0-49-0, చేజ్‌ 8.3-0-63-0, విటెల్‌ లాస్‌ 10-0-73-0.


వన్డేల్లో వేగవంతమైన ద్విశతకాలు

గిల్‌ 117 బంతుల్లో వెస్టిండీ్‌సపై

ఇషాన్‌ 126 బంతుల్లో బంగ్లాదేశ్‌పై

మ్యాక్స్‌వెల్‌ 128 బంతుల్లో అఫ్ఘానిస్థాన్‌పై

నిస్సంక 136 బంతుల్లో అఫ్ఘానిస్థాన్‌పై

క్రిస్‌ గేల్‌ 136 బంతుల్లో జింబాబ్వేపై

వన్డేల్లో వేగంగా 12000 రన్స్‌

కోహ్లీ- 242 ఇన్నింగ్స్‌

రోహిత్‌- 282 ఇన్నింగ్స్‌

సచిన్‌ - 300 ఇన్నింగ్స్‌

పాంటింగ్‌- 314 ఇన్నింగ్స్‌

సంగక్కర- 336 ఇన్నింగ్స్‌

వన్డేల్లో అత్యధిక ఛేదనలు

లక్ష్యం దేశం ప్రత్యర్థి ఎప్పుడు

435 దక్షిణాఫ్రికా ఆస్ర్టేలియా 2006

406 భారత్‌ వెస్టిండీస్‌ 2026

372 దక్షిణాఫ్రికా ఆస్ర్టేలియా 2016

370 నెదర్లాండ్స్‌ స్కాట్లాండ్‌ 2025

361 ఇంగ్లండ్‌ వెస్టిండీస్‌ 2019

ఇవీ చదవండి:

ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ రికార్డ్.. వరుసగా రెండు పతకాలతో..

ఆసియా క్రీడలు: ఒకే రోజు నాలుగు స్వర్ణాలు.. ఆర్చరీలో హ్యాట్రిక్

Updated Date - Oct 01 , 2026 | 06:12 AM