Share News

విజయానికి 6 వికెట్లే..

ABN , Publish Date - Aug 19 , 2026 | 06:00 AM

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. 372 పరుగుల భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఆతిథ్య లంక భారత బౌలర్ల ధాటికి తడబడింది. దీంతో మంగళవారం...

విజయానికి 6 వికెట్లే..

  • శ్రీలంక లక్ష్యం 372

  • ప్రస్తుతం 84/4

  • భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 193

గాలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. 372 పరుగుల భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఆతిథ్య లంక భారత బౌలర్ల ధాటికి తడబడింది. దీంతో మంగళవారం వెలుతురులేమితో ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 84/4 స్కోరుతో ఓటమికి చేరువైంది. క్రీజులో ఉన్న కెప్టెన్‌ ధనంజయ డి సిల్వ (31 బ్యాటింగ్‌), సోనాల్‌ దినుష (25 బ్యాటింగ్‌)కు తోడు డిక్‌వెల్లాపై లంక ఆశలు పెట్టుకుంది. అయితే ఈ మ్యాచ్‌ గెలవాలంటే వారు ఆఖరి రోజు బుధవారం మరో 288 పరుగులు చేయాల్సి ఉంటుంది. అటు భారత్‌ వీలైనంత త్వరగా ఆరు వికెట్లు తీస్తే గాలె టెస్టు సొంతమైనట్టే. స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు గిల్‌ సేన రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌ (66) హాఫ్‌ సెంచరీ సాధించగా, దేవ్‌దత్‌ (44), రాహుల్‌ (35) ఫర్వాలేదనిపించడంతో జట్టుకు 371 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే బౌలర్ల ధాటికి ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. పేసర్‌ అసిత ఫెర్నాండోకు నాలుగు, ప్రభాత్‌కు మూడు, లాహిరు కుమారకు రెండు వికెట్లు దక్కాయి. గాలె స్టేడియంలో అత్యధిక ఛేదన (2022లో 344) రికార్డు పాక్‌ జట్టు పేరిట ఉంది.

దేవ్‌దత్‌-రాహుల్‌ నిలకడ: తొలి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలనుకుంది. కానీ ఓపెనర్‌ జైస్వాల్‌ తొలి ఓవర్‌లోనే డకౌట్‌ కాగా.. రాహుల్‌-దేవ్‌దత్‌ జోడీ మాత్రం నిలకడగా ఆడింది. ముఖ్యంగా రాహుల్‌ వేగం కనబరుస్తూ ప్రభాత్‌ ఓవర్‌లో రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. రెండో వికెట్‌కు ఈ ఇద్దరు 65 పరుగులు జోడించారు. గిల్‌ (8) నిరాశపర్చగా.. దేవ్‌దత్‌ మాత్రం స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. తొలి సెషన్‌ చివర్లో తను అవుట్‌ కావడంతో భారత్‌ 111/4 స్కోరుతో నిలిచింది.


పంత్‌ జోరు: రెండో సెషన్‌లో పంత్‌ హవా సాగింది. అటు పేసర్లు అసిత, లాహిరు కుమార ప్రభావం చూపారు. దీంతో చివరి ఆరుగురు బ్యాటర్లు కేవలం 34 పరుగులే చేయగలిగారు. ఆరంభంలోనే జురెల్‌ (7) వికెట్‌ కోల్పోగా పంత్‌ మాత్రం చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. కేశర ఓవర్‌లో మూడు ఫోర్లు సాధించిన తను, లాహిరు కుమార ఓవర్‌లో భారీ సిక్సర్‌తో 53 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేశాడు. 41వ ఓవర్‌లో తను వెనుదిరగ్గా.. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే పేసర్‌ అసిత, స్పిన్నర్‌ ప్రభాత్‌ల ధాటికి మిగిలిన నాలుగు వికెట్లు నేలకూలాయి. అయితే అప్పటికే జట్టుకు భారీ ఆధిక్యం లభించింది.

వికెట్లు టపటపా: భారత్‌ ఇన్నింగ్స్‌ ముగియగానే ఇరు జట్లు టీ బ్రేక్‌కు వెళ్లాయి. అయితే ఇదే సమయంలో వర్షం కురవడంతో గంట ఆలస్యంగా లంక రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఏడో ఓవర్‌లోనే పేసర్‌ సిరాజ్‌ ఓపెనర్‌ నిషాన్‌ (6) వికెట్‌ తీశాడు. తర్వాతి ఓవర్‌లోనే పసిందు (0)ను స్పిన్నర్‌ మానవ్‌ అవుట్‌ చేశాడు. 47/4 స్కోరుతో ఇబ్బందుల్లో పడిన లంకను కెప్టెన్‌ ధనంజయ, సోనాల్‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. వెలుతురులేమితో ఆట ముగిసే సమయానికి ఇద్దరూ ఓపిగ్గా క్రీజులో నిలిచారు.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 462

శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌: 284

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) డిక్‌వెల్లా (బి) అసిత 0, రాహుల్‌ (సి-సబ్‌) రత్నాయకె (బి) ప్రభాత్‌ 35, దేవ్‌దత్‌ (ఎల్బీ) కేశర 44, గిల్‌ (ఎల్బీ) ప్రభాత్‌ 8, పంత్‌ (సి) డిక్‌వెల్లా (బి) లాహిరు కుమార 66, జురెల్‌ (సి) డిక్‌వెల్లా (బి) అసిత 7, జడేజా (సి) పసిందు (బి) లాహిరు కుమార 9, మానవ్‌ (సి) డిక్‌వెల్లా (బి) అసిత 9, కుల్దీప్‌ (సి) ధనంజయ (బి) ప్రభాత్‌ 5, సిరాజ్‌ (నాటౌట్‌) 2, ప్రసిద్ధ్‌ (సి) లాహిరు కుమార (బి) అసిత 2; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 48.5 ఓవర్లలో 193 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-0, 2-65, 3-81, 4-111, 5-120, 6-174, 7-179, 8-188, 9-190, 10-193. బౌలింగ్‌: అసిత 8.5-0-31-4, కేశర 23-3-86-1, ప్రభాత్‌ 11-0-43-3, ధనంజయ 1-0-4-0, లాహిరు కుమార 5-0-28-2.

శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌: నిషాన్‌ (సి) ప్రసిద్ధ్‌ (బి) సిరాజ్‌ 6, లాహిరు ఉదార (సి) జురెల్‌ (బి) మానవ్‌ 16, పసిందు (ఎల్బీ) మానవ్‌ 0, కమిందు (సి) రాహుల్‌ (బి) ప్రసిద్ధ్‌ 2, ధనంజయ (బ్యాటింగ్‌) 31, సోనాల్‌ (బ్యాటింగ్‌) 25; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 34 ఓవర్లలో 84/4; వికెట్ల పతనం: 1-13, 2-14, 3-21, 4-47; బౌలింగ్‌: సిరాజ్‌ 5-1-11-1, మానవ్‌ 11-0-30-2, ప్రసిద్ధ్‌ 8-2-13-1, జడేజా 6-0-16-0, కుల్దీప్‌ 3-0-8-0, దేవ్‌దత్‌ 1-0-5-0.


జురెల్‌ క్యాచ్‌ వివాదాస్పదం

లంక రెండో ఇన్నింగ్స్‌ 22వ ఓవర్‌లో లాహిరు ఉడార (16) క్యాచ్‌ను జురెల్‌ అందుకున్న తీరు వివాదాస్పదమైంది. బంతి ముందు నేలకు తాకాక అతడి చేతుల్లోకి వెళ్లినట్టు రీప్లేలో కనిపించింది. అయితే థర్డ్‌ అంపైర్‌ మాత్రం అవుట్‌గా ప్రకటించడంతో ఉడార షాక్‌ తిన్నాడు. కాసేపు క్రీజులోనే ఉన్న తను నిరాశగా పెవిలియన్‌కు చేరాడు.

గాయంతో చాందిమల్‌ అవుట్‌

నాలుగో రోజు ఆటలో శ్రీలంక ఫీల్డర్‌ దినేశ్‌ చాందిమల్‌ గాయపడడంతో మిగిలిన ఆటకు దూరమయ్యాడు. తొలి సెషన్‌లో బౌండరీ లైన్‌ దగ్గర బంతిని ఆపే క్రమంలో తను డైవ్‌ చేశాడు. ఈక్రమంలో అతడి భుజం, తల నేలకు గట్టిగా తాకింది. వెంటనే మైదానం వీడిన చాందిమల్‌కు స్కానింగ్‌ తీయగా అంతర్గత గాయం లేనట్టు తేలింది. అయితే కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన పసిందు సూరియబందర బ్యాటింగ్‌లో డకౌట్‌ అయ్యాడు.

1

భారత్‌ తరఫున టెస్టుల్లో వంద సిక్సర్లు బాదిన ఏకైక బ్యాటర్‌గా రిషభ్‌ పంత్‌. ఓవరాల్‌గా స్టోక్స్‌ (138), మెకల్లమ్‌ (107) తర్వాత నిలిచాడు. అయితే తక్కువ ఇన్నింగ్స్‌ (51)లోనే పంత్‌ ఈ ఫీట్‌ సాధించడం విశేషం.

ఈ వార్తలనూ చదవండి:

ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు

మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

Updated Date - Aug 19 , 2026 | 06:01 AM