గెలిస్తే చరిత్రే!
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:57 AM
సంచలన ఫలితాలతో కోట్లాదిమంది అభిమానులను ఆకట్టుకున్న టీ20 వరల్డ్‌కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ జరుగబోతోంది. డిఫెండింగ్ చాంపియన్....
మూడో టైటిల్ కోసం భారత్
ఇరు జట్ల మధ్య నేడే ఫైనల్
టీ20 వరల్డ్‌కప్
2023, నవంబరు 19.. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్. వేదిక నరేంద్ర మోదీ స్టేడియం. ఒక్క ఓటమి లేకుండా దూసుకువచ్చిన టీమిండియాను.. లక్షకు పైగా ప్రేక్షకుల సమక్షంలో చిత్తు చేసిన ఆసీస్ గుండెకోతను మిగిల్చింది.
2026, మార్చి 8.. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్. అదే వేదిక. ఇప్పుడూ ఫైనల్ ఆడేది టీమిండియానే. కాకుంటే ప్రత్యర్థి న్యూజిలాండ్. ఈ తరుణంలో కోట్లాదిమంది భారత క్రీడాభిమానుల కోరిక ఒక్కటే.. ఈసారి మాత్రం స్వదేశంలో కప్‌ను చేజారనీయొద్దు. అంచనాలకు తగ్గ ఆటతీరును ప్రదర్శించకపోయినా ఇక్కడిదాకా వచ్చిన సూర్య సేనకు కావాల్సింది ఒక్క గెలుపు మాత్రమే. లోపాలను అధిగమిస్తూ ఒకటే లక్ష్యంతో.. అకుంఠిత దీక్షతో ముందుకు సాగి మూడో టైటిల్‌తో మురిపిస్తే అంతకు మించి కావాల్సిందేముంది?
అటు సెమీస్‌లో భీకర ఫామ్‌ను కనబర్చి తుదిపోరుకు చేరిన కివీస్ తొలిసారి విజేత కావాలనుకుంటోంది. ఆ జట్టుపై ఎలాంటి ఒత్తిడీ లేకపోవడం కలిసివచ్చే విషయం. ఇక అభిమానులూ.. మరికొన్ని గంటల్లో ఆరంభమయ్యే ఈ బ్లాక్‌బస్టర్ సమరం కోసం సిద్ధంగా ఉండండి.
అహ్మదాబాద్: సంచలన ఫలితాలతో కోట్లాదిమంది అభిమానులను ఆకట్టుకున్న టీ20 వరల్డ్‌కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ జరుగబోతోంది. డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా విజేతగా నిలిస్తే చరిత్ర సృష్టిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ టోర్నీ చరిత్రలో మూడు టైటిళ్లు సాధించిన జట్టు లేదు. అలాగే వరుసగా ఏ జట్టూ రెండోసారి గెలవలేదు. 2007, 2024లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. కివీస్ మాత్రం 2021లో ఒక్కసారి ఫైనల్‌కు రాగలిగింది. ఈ రెండో ప్రయత్నంలోనైనా విజేతగా నిలిచే ప్రయత్నంలో ఉంది. మరోవైపు గతేడాది మార్చి 9న దుబాయ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు కివీ్‌సను ఓడించి విజేతగా నిలిచింది. ఆ స్ఫూర్తితో నేటి కీలక సమరంలో పైచేయి సాధించి అభిమానులను ఖుషీ చేయాలనుకుంటోంది. అయితే ఈ టోర్నీ చరిత్రలో కివీ్‌సపై భారత్ ఎన్నడూ గెలవకపోవడం కాస్తంత ఆందోళన కలిగించే విషయం.
సవాళ్లు ఎన్ని ఉన్నా..
ఇంగ్లండ్‌తో సెమీస్ ముగిసిన తీరును చూస్తే ఫైనల్లో భారత్ ప్రదర్శన ఎలా ఉంటుందోననే సందేహం అభిమానుల్లో ఉంది. వాస్తవానికి శాంసన్ సులువైన క్యాచ్‌ను కెప్టెన్ హ్యారీ బ్రూక్ పట్టి ఉంటే మ్యాచ్ ఇంగ్లండ్‌దే అయ్యేదేమో? ఆదివారం మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావీయకుండా మైదానంలో చెలరేగాల్సి ఉంటుంది. ఇప్పటికీ బ్యాటింగ్, బౌలింగ్‌లో లోపాలుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ ఫామ్‌లేమి జట్టును కలవరపెడుతోంది. టోర్నీకి ముందు అతడినే కీలక ఆటగాడిగా పరిగణించి, పరుగులు వెల్లువెత్తిస్తాడనుకుంటే పవర్‌ప్లేలోనే వెనుదిరుగుతున్నాడు. ప్రత్యర్థి జట్లు కూడా అతన్ని కట్టడి చేసేందుకు వ్యూహాలతో వచ్చాయి. ఆరంభంలోనే మూడుసార్లు ఆఫ్ స్పిన్నర్లకు దొరికిపోయాడు. అందుకే ఓ విఫల బ్యాటర్‌కు మెగా టోర్నీలో ఇన్ని అవకాశాలు ఇవ్వడమెందుకు? అనే ప్రశ్న ఇంటా, బయటా వినిపిస్తోంది. దీంతో ఫైనల్లో అభిషేక్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పక్కనబెడితే మిడిలార్డర్‌లో రింకూకు అవకాశం దక్కుతుంది. ఓపెనర్ శాంసన్ మాత్రం చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో జట్టును సెమీ్‌సతో పాటు ఫైనల్‌కు చేర్చగలిగాడు. మిడిలార్డర్‌లో అంతా బాగానే ఉన్నా కెప్టెన్ సూర్య మాత్రం కుదురుకోవాల్సి ఉంది. బౌలింగ్‌లో బుమ్రా మినహా నమ్మదగ్గ బౌలర్ లేకపోవడం కివీ్‌సకు వరంలా మారే ప్రమాదం ఉంది. సెమీ్‌సలో ఇంగ్లండ్‌ను అడ్డుకుంది అతడి నాలుగు ఓవర్లే. ఫైనల్లోనూ అతడి చేత పవర్‌ప్లేలో బౌలింగ్ చేయిస్తే కివీస్ ఒత్తిడిలో పడవచ్చు. ఇక స్పిన్నర్ వరుణ్ తేలిపోతుండడంతో అతడి స్థానంలో కుల్దీప్‌ను ఆడిస్తారేమో చూడాలి.

పిచ్, వాతావరణం
నేటి ఫైనల్ మ్యాచ్‌ని ఎరుపు-నలుపు మట్టి కలిసిన పిచ్‌పై ఆడించనున్నారు. గతేడాది ఐపీఎల్ ఫైనల్ ఇదే వికెట్‌పై జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆర్‌సీబీ తమ 190 రన్స్‌ను కాపాడుకుంది. తాజా వరల్డ్‌క్‌పలో ఈ మైదానంలో ఆరు మ్యాచ్‌లు జరిగాయి. ఈ ఆరింటిలో నాలుగు సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు విజయాలు సాధించాయి. గ్రూప్‌దశలో దక్షిణాఫ్రికాతో ఇదే వేదికపై జరిగిన మ్యాచ్‌లో భారత్ ఛేదనలో విఫలమై ఘోరపరాజయం పాలైంది. ఈ వరల్డ్‌కప్‌లో ఇక్కడ అత్యధిక స్కోరు 213 కాగా..మిగతా ఐదు మ్యాచ్‌ల్లో 175+ స్కోర్లు నమోదయ్యాయి. కొత్త బంతితో ఆరంభంలో పేసర్లకు బౌన్స్ లభిస్తుంది. మంచు ప్రభావం ఉండనుంది. ఇక ఫైనల్ పోరుకు వర్షం నుంచి ముప్పు లేదు.
తుది జట్లు
(అంచనా)
భారత్: అభిషేక్, సంజూ శాంసన్, ఇషాన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ (కెప్టెన్), హార్దిక్, దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్/కుల్దీప్.
న్యూజిలాండ్: సైఫర్ట్, అలెన్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, శాంట్నర్ (కెప్టెన్), మెకాంచీ, నీషమ్/డఫీ, హెన్రీ, ఫెర్గూసన్.
ఒత్తిడంతా భారత్‌పైనే..
‘డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతూ.. టైటిల్ గెలవాలనే ఒత్తిడంతా భారత్‌పైనే ఉంటుంది. ఇక స్టేడియంలో లక్షకు పైగా ప్రేక్షకులు భారత్‌కు మద్దతుగా ఉంటారని తెలుసు. మా లక్ష్యమంతా వారిని నిశ్శబ్దంగా ఉంచడమే. భారత జట్టులో ఎంతోమంది మంచి ఆటగాళ్లున్నారు. మా దృష్టి కేవలం బుమ్రా ఒక్కడిపైనే కాదు’
శాంట్నర్ (కివీస్ కెప్టెన్)
జోష్‌లో
కివీస్
టోర్నీలో అజేయ ఆటతీరుతో సాగుతున్న దక్షిణాఫ్రికాను సెమీ్‌సలో కివీస్ నేలకు దించింది. ఆ మ్యాచ్‌లో సఫారీలపై విరుచుకుపడిన తీరుకు ఒక్కసారిగా జట్టుపై అంచనాలు పెరిగాయి. ఓపెనర్లు అలెన్, సైఫర్ట్ బంతిని బాదడమే లక్ష్యంగా ఆడుతున్నారు. ముఖ్యంగా అలెన్ సెమీ్‌సలో 33 బంతుల్లోనే శతకం బాది టోర్నీలో చరిత్ర సృష్టించాడు. ఈ జోడీని భారత బౌలర్లు కట్టడి చేయకపోతే భారీ స్కోరుతో బెంబేలెత్తిస్తారు. రచిన్ రవీంద్ర ఆల్‌రౌండ్‌షోతో అండగా నిలుస్తున్నాడు. ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్ మిడిలార్డర్‌లో కీలక బ్యాటర్లు. పేసర్లు మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్ కొత్త బంతితో పవర్‌ప్లేలో వికెట్లు తీయగలుగుతున్నారు. ఇక మధ్య ఓవర్లలో స్పిన్నర్లు శాంట్నర్, రచిన్, మెకాంచీ భారత్‌ను ఇబ్బందిపెట్టవచ్చు. ఏదిఏమైనా కివీస్ పకడ్బందీ వ్యూహం తో బరిలోకి దిగే అవకాశం ఉంది.
ముఖాముఖి
మొత్తం మ్యాచ్‌లు: 30
భారత్: 16
కివీస్: 11, టై: 3
టీ20 ప్రపంచక్‌పలో..
మ్యాచ్‌లు: 3
భారత్: 0, కివీస్: 3
ఇవి కూడా చదవండి:
టీమిండియాలో ప్రతి ప్లేయర్ డేంజరే.. మేం చాలా జాగ్రత్తగా ఆడాలి: కివీస్ కెప్టెన్ శాంట్నర్
ఈసారైనా గెలవండి.. లేదంటే ఆ చోకర్స్ ట్యాగ్ మీకిచ్చేస్తా: కివీస్‌కు డేల్ స్టెయిన్ వార్నింగ్