Share News

గెలుపు ‘గాలి’ ఎటువైపో?

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:08 AM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీ్‌సలో భారత జట్టు కీలక పోరుకు సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచ్‌లకు క్రైస్ట్‌చర్చ్‌ వేదిక కాగా...

గెలుపు ‘గాలి’  ఎటువైపో?

నేడు మూడో టీ20

మధ్యాహ్నం 12.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..

ప్రాక్టీస్‌ సెషన్‌లో కోచ్‌ గంభీర్‌తో సంజూ, వైభవ్‌

  • సిరీస్‌పై గురి పెట్టిన భారత్‌

  • న్యూజిలాండ్‌కు చావోరేవో

  • వైభవ్‌కు మరో చాన్స్‌

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీ్‌సలో భారత జట్టు కీలక పోరుకు సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచ్‌లకు క్రైస్ట్‌చర్చ్‌ వేదిక కాగా.. తాజాగా మంగళవారం జరిగే మూడో మ్యాచ్‌కు వెల్లింగ్టన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. వరుస విజయాలతో 2-0 ఆధిక్యంలో ఉన్న శ్రేయాస్‌ సేన ఈ మ్యాచ్‌ గెలిస్తే సిరీస్‌ వశమవుతుంది. అయితే ఇప్పటిదాకా జోరు చూపిన భారత బ్యాటర్లకు వెల్లింగ్టన్‌ కఠిన పరీక్ష పెట్టనుంది. ఇక్కడ వీచే గాలులు కూడా మ్యాచ్‌ ఫలితాన్ని ప్రభావితం చేయగలవు. ఎందుకంటే స్థానిక బేసిన్‌ రిజర్వ్‌ స్టేడియం మూడు వైపులా ఓపెన్‌గా ఉంటుంది. దీంతో గాలుల ప్రభావం అధికంగా ఉండడంతో బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతుంది. ఐర్లాండ్‌లోనూ ఇలాంటి పరిస్థితులే బ్యాటర్లను కట్టడి చేశాయి. ఈనేపథ్యంలో మన పేసర్లు కూడా పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాలకు పదును పెడితేనే ఫలితం దక్కుతుంది. ఇదిలావుండగా, మూడో టీ20కి కివీస్‌ పేసర్‌ ఫెర్గూసన్‌ దూరం కాగా, హెన్రీకి సిరీస్‌ నుంచే విశ్రాంతినిచ్చారు. బ్యాటింగ్‌లో ఫిలిప్స్‌, జాకబ్స్‌, ఆలెన్‌ కీలకం కానున్నారు. కెప్టెన్‌ శాంట్నర్‌, బ్రేస్‌వెల్‌ తమ స్పిన్‌తో భారత మిడిలార్డర్‌ను ఇబ్బందిపెడుతున్నారు.

భువనేశ్వర్‌ సత్తా చాటేనా?: సుదీర్ఘ సమయం

తర్వాత జట్టులోకి వచ్చిన పేసర్‌ భువనేశ్వర్‌ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. రెండు మ్యాచుల్లో కలిపి 99 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ మాత్రమే తీశాడు. నేటి మ్యాచ్‌ అతడికి కీలకం కానుంది. అలాగే ఇక్కడి గాలి ప్రభావాన్ని అనుకూలంగా మలుచుకుని తన స్వింగ్‌తో కివీస్‌ బ్యాటర్లను ఇబ్బందిపెట్టే అవకాశముంది. ఇక ఇషాన్‌ కిషన్‌ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. దీంతో వైభవ్‌కు మరో అవకాశం దక్కనుంది. అయితే తను వన్‌డౌన్‌లో ఇబ్బందిపడుతున్నాడు కాబట్టి అతడి బ్యాటింగ్‌ ఆర్డర్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. ఏదిఏమైనా రిజర్వ్‌ బేసిన్‌లో వీచే చలి గాలులకు తోడు కివీస్‌ పేసర్లను భారత బ్యాటర్లు దీటుగా ఎదుర్కోవడంపైనే విజయం ఆధారపడి ఉంటుంది.


తుది జట్లు (అంచనా)

భారత్‌: అభిషేక్‌, శాంసన్‌, వైభవ్‌, శ్రేయాస్‌ (కెప్టెన్‌), తిలక్‌, నమన్‌, నితీశ్‌, అక్షర్‌, భువనేశ్వర్‌, ప్రిన్స్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

న్యూజిలాండ్‌: ఆలెన్‌, సైఫర్ట్‌, జాకబ్స్‌, ఫిలిప్స్‌, మిచెల్‌, బ్రేస్‌వెల్‌, శాంట్నర్‌ (కెప్టెన్‌), స్మిత్‌, జేమిసన్‌, మిల్నే, డఫీ.

పిచ్‌, వాతావరణం

గంటకు 55 కి.మీ వేగంతో ఇక్కడ గాలులు వీస్తుంటాయి. ఈ మైదానంలో జరిగిన చివరి టీ20లో దక్షిణాఫ్రికా 164 పరుగులను కాపాడుకుంది. అయితే ఇది స్లో పిచ్‌ మాత్రం కాదు. ఉదయం వర్షం కురిసే అవకాశం ఉన్నప్పటికీ మ్యాచ్‌ సమయానికి ఇబ్బంది ఉండకపోవచ్చని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!

యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..

Updated Date - Oct 27 , 2026 | 06:08 AM