డబ్ల్యూటీసీ సన్నాహకంగా..
ABN , Publish Date - Jun 06 , 2026 | 03:56 AM
ధనాధన్ ఐపీఎల్ ముగిసి వారం రోజులైనా కాకముందే భారత క్రికెటర్లు మరో ఫార్మాట్‌లో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. శనివారం నుంచి అఫ్ఘానిస్థాన్‌తో ఏకైక టెస్టులో...
అఫ్ఘానిస్థాన్‌తో భారత్ ఏకైక టెస్టు నేటి నుంచి
ఉ.9.30 నుంచి..
ముల్లన్‌పూర్: ధనాధన్ ఐపీఎల్ ముగిసి వారం రోజులైనా కాకముందే భారత క్రికెటర్లు మరో ఫార్మాట్‌లో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. శనివారం నుంచి అఫ్ఘానిస్థాన్‌తో ఏకైక టెస్టులో గిల్ సేన తలపడనుంది. ఇప్పటిదాకా కిక్కిరిసిన స్టేడియాలు, నిరంతర ప్రయాణాలు, టీ20 బాదుడుతో మూడు నెలల పాటు బిజీబిజీగా గడిపిన క్రికెటర్లు ఒక్కసారిగా నెమ్మదైన ఆటకు, కఠినంగా సాగే సుదీర్ఘ ఫార్మాట్‌కు అలవాటు పడాల్సి ఉంటుంది. రాబోయే వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌ప మ్యాచ్‌ల కోసం అఫ్ఘాన్‌తో పోరును భారత జట్టు చక్కటి సన్నాహకంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. అఫ్ఘాన్ జట్టు డబ్ల్యూటీసీలో తలపడే 9 ప్రధాన జట్లలో లేదుకాబట్టి ఈ ఫలితంతో ఎవరికీ పాయింట్లు లభించవు. మున్ముందు శ్రీలంక, న్యూజిలాండ్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీల్లో భారత్ తలపడాల్సి ఉంది.
చక్కటి కూర్పు కోసం..
మూడో నెంబర్ బ్యాటర్‌తో పాటు జడేజా స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనేది టీమ్ మేనేజ్‌మెంట్ ముందున్న ప్రధాన సమస్య. సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కళ్ వన్‌డౌన్ బెర్త్ కోసం పోటీలో ఉన్నారు. అయితే సాయికి గతంలో ఎక్కువ అవకాశాలు లభించలేదన్నది కోచ్ గంభీర్ ఆలోచనగా ఉంది. అందుకే ఈ టెస్టులో అతడికే చోటు దక్కవచ్చు. జడేజాకు ప్రస్తుతం విశ్రాంతినిచ్చినా.. తను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అందుకే భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునైనా యువ స్పిన్నర్లను పరీక్షించాల్సి ఉంది. కుల్దీప్, సుందర్‌లతో పాటు మూడో స్పిన్నర్‌గా మానవ్ సుతార్, హర్ష్ దూబేలలో ఒకరికి చోటు దక్కవచ్చు.
అనుభవం కోసం..
తమకన్నా ఎన్నో రెట్లు బలమైన భారత జట్టుతో ఆడనుండడం అఫ్ఘానిస్థాన్‌కు కలిసివచ్చేదే. ఏ విభాగంలోనూ రెండు జట్లకు పోలికే లేదు. అందుకే ఈ ఫలితంతో అఫ్ఘాన్ జట్టు కోల్పోయేదేమీ లేదు. 2018లో తమ అరంగేట్ర టెస్టులో ఈ జట్టు భారత్ చేతిలో రెండు రోజుల్లోనే చిత్తయింది. అప్పటి భారత జట్టులో రాహుల్ మాత్రమే ప్రస్తుతం ఆడుతుండగా.. అఫ్ఘాన్ టీమ్‌లో కెప్టెన్ హస్మతుల్లా షాహిది, రహ్మత్ షా ఉన్నారు. అఫ్ఘాన్ బ్యాటర్లంతా కలిపి తొమ్మిది టెస్టు శతకాలే చేయగా, భారత్ నుంచి 39 ఉన్నాయి. ఇక వెన్నునొప్పితో బాధపడుతున్న స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ టెస్టుకు దూరం కావడం పెద్ద లోటుగా చెప్పవచ్చు. గుర్బాజ్, రహ్మత్, ఒమర్జాయ్ కీలకం కానున్నారు.
తుది జట్లు (అంచనా)
భారత్: రాహుల్, జైస్వాల్, సాయి సుదర్శన్, గిల్ (కెప్టెన్), పంత్, సుందర్, నితీశ్, హర్ష్ దూబే/ మానవ్, కుల్దీప్, సిరాజ్, ప్రసిద్ధ్.
అఫ్ఘానిస్థాన్: అబ్దుల్ మాలిక్, గుర్బాజ్, రహ్మత్ షా, హస్మతుల్లా షాహిదీ (కెప్టెన్), సెదిఖుల్లా అటల్, అఫ్సర్ జజాయ్, ఒమర్జాయ్, అష్రాఫ్, కైస్ అహ్మద్, జియా షరీఫి, ఖరోతాయ్.
ఈ వార్తలనూ చదవండి:
కీలక వడ్డీరేట్లు యథాతథం.. రెపో రేటులో ఎలాంటి మార్పు లేదన్న ఆర్బీఐ
వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా..