Share News

వణికించిన జపాన్‌

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:29 AM

టీ20 వరల్డ్‌ చాంపియన్‌ భారత క్రికెట్‌ జట్టుకు కనీస పోటీ ఇచ్చినా గొప్పే.. అనుకున్న పసికూన జపాన్‌ ఏకంగా ఓటమి భయాన్ని కళ్లముందుంచింది....

వణికించిన జపాన్‌

2 పరుగుల తేడాతో టీమిండియా విజయం

ఏకైక టీ20

సానో: టీ20 వరల్డ్‌ చాంపియన్‌ భారత క్రికెట్‌ జట్టుకు కనీస పోటీ ఇచ్చినా గొప్పే.. అనుకున్న పసికూన జపాన్‌ ఏకంగా ఓటమి భయాన్ని కళ్లముందుంచింది. భారీ వర్షం కారణంగా ఐదు ఓవర్లకు కుదించిన ఈ ఏకైక టీ20 మ్యాచ్‌లో భారత్‌ కేవలం 2 పరుగుల తేడాతో గెలిచి ఊపిరిపీల్చుకుంది. అంతేకాదు.. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన టీమిండియాను జపాన్‌ స్పిన్నర్లు అద్భుతంగా నియంత్రించారు. వారి బౌలింగ్‌లో పరుగు తీసేందుకే చెమటోడ్చారు. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్లకు 32 పరుగులు చేసింది. ఆరుగురు బ్యాటర్లు బరిలోకి దిగితే కెప్టెన్‌ శ్రేయాస్‌ (16) ఒక్కడే రెండంకెల స్కోరు చేయగలిగాడు. చార్లీ హరా హింజేకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో జపాన్‌ 5 ఓవర్లలో 30/3 స్కోరుతో తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. కెండెల్‌ (12) టాప్‌ స్కోరర్‌. సుందర్‌కు 2 వికెట్లు దక్కాయి.

ఆఖరి ఓవర్‌లో ఉత్కంఠ: మూడో ఓవర్‌లో స్పిన్నర్‌ బిష్ణోయ్‌ ఏకంగా పది పరుగులు ఇవ్వడంతో జపాన్‌లో జోష్‌ కనిపించింది. చివరి ఓవర్‌లో జపాన్‌ విజయానికి 8 రన్స్‌ మాత్రమే కావాల్సి ఉండగా ఉత్కంఠ నెలకొంది. అయితే అక్షర్‌ పటేల్‌ జట్టును ఆదుకున్నాడు. కానీ ఈ ఓవర్‌లో తను వరుసగా రెండు వైడ్లు వేయడంతో ఇక పరాభవం ఖాయమనిపించింది. మొదట అంపైర్‌ మూడో బంతిని వైడ్‌గా ప్రకటించాడు. తర్వాత మరో బంతిని కూడా వైడ్‌ ఇవ్వడంతో కెప్టెన్‌ శ్రేయాస్‌ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. చివరకు అంపైర్‌ తన నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నాడు. ఇక ఆఖరి బంతికి ఫోర్‌ అవసరం కాగా జపాన్‌ సింగిల్‌ మాత్రమే తీయడంతో భారత్‌ ఊపిరిపీల్చుకుంది.


స్పిన్నర్ల కట్టడి: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను జపాన్‌ స్పిన్నర్లు కట్టడి చేశారు. అభిషేక్‌ గోల్డెన్‌ డకౌట్‌ కాగా.. శాంసన్‌ రెండో ఓవర్‌లో అవుటయ్యాడు. ఇషాన్‌ (3) రనౌట్‌గా వెనుదిరగడంతో 14/3 స్కోరుతో నిలిచింది. శ్రేయాస్‌ కాస్త బ్యాట్‌ ఝుళిపించడంతో మిగిలిన రెండు ఓవర్లలో జట్టు 18 పరుగులు చేయగలిగింది.

సంక్షిప్త స్కోర్లు:

భారత్‌: 5 ఓవర్లలో 32/4 (శ్రేయాస్‌ 16, శాంసన్‌ 9; చార్లీ హరా 2/17) జపాన్‌: 5 ఓవర్లలో 30/3 (కెండెల్‌ 12, బెంజమిన్‌ 9 నాటౌట్‌; సుందర్‌ 2/13)

టీ20ల్లో 200 విజయాలు సాధించిన ఏకైక జట్టుగా భారత్‌

ఒకే ఏడాది (2026) అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువసార్లు (5) గోల్డెన్‌ డకౌట్‌ అయిన బ్యాటర్‌గా అభిషేక్‌. కెవిన్‌ ఇరకోజ్‌ (రువాండా, 2023లో), రిచర్డ్‌ ఎన్‌గరవ (జింబాబ్వే, 2024లో) కూడా ఇన్నేసార్లు అవుటయ్యారు. అలాగే ఈ ఏడాది అన్ని టీ20ల్లో కలిపి అభిషేక్‌ పదిసార్లు డకౌట్‌ అయి చెత్త రికార్డు నెలకొల్పాడు.

పతకాల పట్టిక

దేశం స్వ ర కాం మొ

1 చైనా 32 13 8 53

2 జపాన్‌ 11 16 19 46

3 ద. కొరియా 6 4 17 27

4 కజకిస్థాన్‌ 6 1 5 12

5 థాయ్‌లాండ్‌ 4 1 1 6

8 భారత్‌ 1 4 2 7

గమనిక- స్వ: స్వర్ణం; ర: రజతం కాం: కాంస్యం; మొ: మొత్తం

ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం.. భారత మహిళా జట్టుకు మోదీ అభినందనలు

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వీడ్కోలు

Updated Date - Sep 23 , 2026 | 05:29 AM