Share News

కళ్లన్నీ అటే

ABN , Publish Date - Feb 15 , 2026 | 05:25 AM

అవును.. భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ పోరు గురించే ఇదంతా. పాక్‌ క్రికెట్‌ బోర్డు వింత పోకడలతో ఈసారి టీ20 విశ్వక్‌పలో దాయాదుల పోరు జరుగుతుందా? లేదా? అనే సందేహం లకొన్నా.. అదంతా...

కళ్లన్నీ అటే

నేటి మ్యాచ్‌లు

వెస్టిండీస్‌ X నేపాల్‌ (ఉ. 11 గం. నుంచి)

నమీబియా X అమెరికా (మ.3 గం.)

భారత్‌ X పాకిస్థాన్‌ (రా.7 గం.)

మ్యాచ్‌కు వరుణుడి ముప్పు

భారత్‌-పాక్‌ పోరు నేడు

టీ20 వరల్డ్‌కప్‌ ఫేవరెట్‌ హోదాలో..

ఆ ఒక్క మ్యాచ్‌.. ఐసీసీకి వేల కోట్ల ఆదాయాన్నిస్తుంది.

ఆ ఒక్క మ్యాచ్‌.. ప్రసారకర్తలపై కనకవర్షాన్ని కుమ్మరిస్తుంది.

ఆ ఒక్క మ్యాచ్‌.. ఆతిథ్య బోర్డు ఖజానాను ఆర్థిక పరిపుష్టిని చేస్తుంది.

ఆ ఒక్క మ్యాచ్‌.. క్రికెట్‌ ప్రేమికులను మునివేళ్లపై నిలబెడుతుంది.

ఆ ఒక్క మ్యాచ్‌.. వంద కోట్లకు పైగా భారతీయుల భావోద్వేగాలను రెండింతలు చేస్తుంది.

అవును.. భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ పోరు గురించే ఇదంతా. పాక్‌ క్రికెట్‌ బోర్డు వింత పోకడలతో ఈసారి టీ20 విశ్వక్‌పలో దాయాదుల పోరు జరుగుతుందా? లేదా? అనే సందేహం లకొన్నా.. అదంతా పటాపంచలైంది. అంతా అనుకూలించి కొలంబోలో నీ ప్రతాపమో.. నా ప్రతాపమో తేల్చుకుందామంటూ ఇరు జట్లు సమరభేరికి సిద్ధమయ్యాయి. ఇప్పుడు అందరి కళ్లన్నీ ఈ ఫైట్‌పైనే: మరి.. భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా అందరి అంచనాలను అందుకుంటుందా? అనిశ్చితికి మారుపేరైన పాక్‌ సంచలనం సృష్టిస్తుందా? తేలేది నేడే.

పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో పాక్‌పై భారత జట్టు వరుసగా ఎనిమిది మ్యాచ్‌లను గెలిచింది. దీంతో ఈసారి కూడా ఫేవరెట్‌గానే భావిస్తున్నారు. కానీ పాక్‌తో మ్యాచ్‌ అంటే ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. పైగా గతంలో ఎదుర్కోని స్నిన్నర్‌ తారిఖ్‌ అహ్మద్‌ జట్టుకు సవాల్‌గా మారనున్నాడు. బంతిని విసిరినట్టుగా ఉండే అతడి బౌలింగ్‌ శైలి ఇప్పటికే చర్చనీయాంశమైంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై భారత బ్యాటర్లు అతడిని ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక డాషింగ్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శనివారం నెట్స్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్‌ చేయడం కనిపించింది. అంతా సవ్యంగా జరిగితే అభి‘షేక్‌’ విశ్వరూపం చూడవచ్చు. అతను బరిలోకి దిగితే శాంసన్‌ బెంచీకే పరిమితం కానున్నాడు. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లో మిడిలార్డర్‌ నిరాశపర్చింది. కానీ, ఇషాన్‌, అభిషేక్‌, సూర్యకుమార్‌ల పుణ్యమా అంటూ జట్టుకు రెండు విజయాలు లభించాయి. పిచ్‌ను బట్టి జట్టులోకి మూడో స్పిన్నర్‌గా కుల్దీ్‌పను తీసుకోవచ్చు. గత ఆసియాకప్‌ ఫైనల్లో అతను పాక్‌పై 4 వికెట్లతో రాణించాడు. అయితే ఇందుకు పేసర్‌ అర్ష్‌దీ్‌పపై వేటు పడొచ్చు. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిపై భారత్‌ ఎక్కువగా ఆధారపడి ఉంది.


కొలంబో: టీ20 ప్రపంచక్‌పలో హైఓల్టేజ్‌ పోరుకు అంతా సిద్ధం. టోర్నీ ఆరంభమై వారం రోజులైనా ఏదో వెలితిగా భావిస్తున్న ఫ్యాన్స్‌కు మజా పంచేందుకు భారత్‌, పాకిస్థాన్‌ జట్లు స్థానిక ప్రేమదాస స్టేడియంలో ఆదివారం ముఖాముఖి బరిలోకి దిగుతున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన తరుణంలో ఐసీసీ టోర్నీల్లో మినహా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీ్‌సలు ఎప్పుడో ఆగిపోయాయి. ఇక గతేడాది ఆసియాక్‌పలో పాక్‌ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్‌ వివాదం విబేధాలను మరింత పెంచింది. దీనికి తోడు ఆ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్‌కు ఆసియా క్రికెట్‌ మండలి చైర్మన్‌ హోదాలో మొహిసిన్‌ నఖ్వీ ఇప్పటిదాకా కప్‌ అందించలేదు. పైగా బంగ్లాదేశ్‌కు మద్దతుగా మెగా టోర్నీలో టీమిండియాతో మ్యాచ్‌ ఆడమంటూ పాక్‌ బాయ్‌కాట్‌ డ్రామా సరేసరి. ఇన్ని పరిణామాల మధ్య జరుగుతున్న ఈ అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లో ఏ జట్టుది పైచేయి కానుందో మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటిదాకా భారత్‌ 7-1తో పాక్‌పై తిరుగులేని ఆధిక్యంలో ఉంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: అభిషేక్‌, ఇషాన్‌, తిలక్‌, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), హార్దిక్‌, దూబే, రింకూ, అక్షర్‌, కుల్దీప్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా.

పాకిస్థాన్‌: సాహిబ్జాదా, సయీమ్‌ అయూబ్‌, సల్మాన్‌ ఆఘా (కెప్టెన్‌), బాబర్‌ ఆజమ్‌, షాదాబ్‌, ఉస్మాన్‌ ఖాన్‌, సల్మాన్‌ మీర్జా, ఫహీమ్‌ అష్రాఫ్‌, షహీన్‌ అఫ్రీది, ఉస్మాన్‌ తారిఖ్‌, ఎబ్రార్‌ అహ్మద్‌.


0-Sports.jpg

కరచాలనం

చేసుకుంటారా?

టాస్‌ సమయంలో భారత్‌-పాక్‌ కెప్టెన్లు సూర్యకుమార్‌, సల్మాన్‌ ఆఘా ఈసారైనా కరచాలనం చేసుకుంటారా? లేదా? అనే సస్సెన్స్‌ కొనసాగుతోంది. ఇదే విషయమై కెప్టెన్లను మీడియా అడిగితే.. ‘దానిపై అంత ఆసక్తి ఎందుకు? మరో 24 గంటలు వేచిచూడండి’ అని సూర్య బదులిచ్చాడు. ‘మ్యాచ్‌ దాకా ఎదురుచూడాల్సిందే’నంటూ సల్మాన్‌ చెప్పాడు. గతేడాది పహల్గాంలో దాడి తర్వాత ఆసియాక్‌పలో భారత జట్టు పాక్‌ ప్లేయర్లతో షేక్‌హ్యాండ్‌ ఇచ్చేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.

వానా వానా వద్దప్పా!

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల ఉత్సాహంపై వరుణుడు నీళ్లు జల్లే అవకాశం లేకపోలేదు. శ్రీలంక వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఆదివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీంతో ఈరోజు సాయంత్రం స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం 70 శాతంగా ఉంటుందని అంచనా. అదే జరిగితే మ్యాచ్‌ నిర్వహణ సందేహమే. వర్షంతో మ్యాచ్‌ రద్దయితే, ఇరుజట్లకు చెరో పాయింట్‌ దక్కుతుంది. టోర్నీ నిబంధనల ప్రకారం గ్రూప్‌ దశలో మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే లేదు. అందుకే మ్యాచ్‌కు వరుణుడు అడ్డు పడొద్దన్నది ఫ్యాన్స్‌ కోరిక.

స్పిన్నర్‌ తారిఖ్‌పై అందరి దృష్టి

వాస్తవానికి ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు అనుకూలత ఎక్కువ. ఎందుకంటే హైబ్రిడ్‌ విధానం వల్ల ఆ జట్టు తమ అన్ని మ్యాచ్‌లను కొలంబోలోనే ఆడుతోంది. అయితే రెండు మ్యాచ్‌లను ఎస్‌ఎ్‌ససీ మైదానంలో ఆడగా.. ప్రేమదాసలో మాత్రం ఇదే తొలి మ్యాచ్‌. పైగా జట్టులో ఉస్మాన్‌ తారిఖ్‌, సయీమ్‌ అయూబ్‌, ఎబ్రార్‌ అహ్మద్‌, షాదాబ్‌ ఖాన్‌, నవాజ్‌ల రూపంలో ఐదుగురు నాణ్యమైన స్పిన్నర్లున్నారు. తారిఖ్‌ సైడ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ సాహిబ్జాదా ఫర్మాన్‌ భారత్‌తో మ్యాచ్‌ అంటే చెలరేగుతాడు. ఫర్మాన్‌.. ఆసియా కప్‌లో పేసర్‌ బుమ్రా బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొని భారీ సిక్సర్లతో బెదరగొట్టాడు. ఆల్‌రౌండర్లు అయూబ్‌, ఫహీమ్‌ అష్రా్‌ఫలతో పాటు వెటరన్‌ బాబర్‌ ఆజమ్‌ బ్యాటింగ్‌ కీలకం కానుంది. ఇద్దరు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లు ఎబ్రార్‌, తారిఖ్‌లతో పాటు ఇద్దరు ప్రధాన పేసర్లు షహీన్‌, సల్మాన్‌ మీర్జాలతో జట్టు బౌలింగ్‌ పటిష్టంగా ఉంది.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచకప్2026: 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం

భారత్-పాక్ మ్యాచ్: టీమిండియాకు ఒకే ఒక్క ఓటమి.. అదెప్పుడంటే?

Updated Date - Feb 15 , 2026 | 05:27 AM