మన స్పిన్ అదుర్స్ పాక్ ఢమాల్
ABN , Publish Date - Sep 06 , 2026 | 05:48 AM
మహిళల టీ20 ఆసియాక్‌పలో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం జరిగిన తమ గ్రూప్-ఎ ఆఖరి పోరులో హర్మన్‌ప్రీత్ సేన 7 వికెట్లతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది...
మహిళల ఆసియాకప్
ప్రేమా రావత్ (4-0-9-3)
55 పరుగులకే ఆలౌట్
విజృంభించిన శ్రీచరణి, ప్రేమ
గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా భారత్
దుబాయ్: మహిళల టీ20 ఆసియాక్‌పలో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం జరిగిన తమ గ్రూప్-ఎ ఆఖరి పోరులో హర్మన్‌ప్రీత్ సేన 7 వికెట్లతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. మన స్పిన్నర్లు శ్రీచరణి (4-0-7-3) ప్రేమా రావత్ (4-0-9-3) సుడులు తిరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్ల పనిబట్టారు. భారత స్పిన్ జోడీ ధాటికి కేవలం 55 పరుగులకే కుప్పకూలిన పాక్.. తమ టీ20 చరిత్రలోనే అత్యల్ప స్కోరును నమోదు చేసి చెత్త రికార్డును మూటగట్టుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు షవాల్ జుల్ఫికర్ (14), మునీబా అలీ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. స్పిన్నర్ దీప్తిశర్మకు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లకు 57 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. హర్మన్‌ప్రీత్ (18 నాటౌట్), షఫాలీ (12), దీప్తి (12 నాటౌట్) రాణించారు. పాక్ సారథి ఫాతిమా సనాకు 3 వికెట్లు లభించాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా శ్రీచరణి నిలిచింది. వరుసగా రెండు విజయాలతో ఇదివరకే సెమీస్ చేరిన భారత్.. ఇప్పుడు హ్యాట్రిక్ గెలుపుతో గ్రూప్-ఎ టాపర్‌గా నిలిచింది. ఇక, ఈ గ్రూప్ నుంచి సెమీస్ చేరాలంటే పాక్ సోమవారం హాంకాంగ్‌పై కచ్చితంగా గెలవాలి.
8.4 ఓవర్లలోనే..: స్వల్ప ఛేదనను భారత్ సులువుగా ముగించింది. ఇన్నింగ్స్ తొలి బంతినే ఓపెనర్ షఫాలీ సిక్సర్‌గా మలిచింది. ఈ జోరుకు పవర్‌ప్లేలోనే ఫలితం తేలేలా కనిపించింది. అయితే పాక్ కెప్టెన్ ఫాతిమా సనా రెండో ఓవర్‌లోనే షఫాలీ, ప్రతీకా (4) వికెట్లు తీసింది. తన తర్వాతి ఓవర్‌లో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (9)ను కూడా ఫాతిమా పెవిలియన్‌కు చేర్చింది. దీంతో భారత్ 29/3 స్కోరుతో తడబడినట్టు కనిపించింది. అయితే లక్ష్యం తక్కువే కావడం.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, దీప్తి వేగంగా పరుగులు సాధించడంతో తొమ్మిదో ఓవర్‌లోనే భారత్ గెలుపు అందుకుంది.
పేకమేడలా..: పాక్ ఆట తొలి నాలుగు ఓవర్లపాటు నిలకడగానే సాగింది. భారత పేసర్లను ఓపెనర్లు దీటుగా ఎదుర్కోవడంతో కాసిన్ని పరుగులు వచ్చాయి. అయితే ఐదో ఓవర్‌లో మునీబాను స్పిన్నర్ షఫాలీ అవుట్ చేయడంతో పాక్ పతనం మొదలైంది. తర్వాతి ఓవర్‌లోనే శ్రీచరణి చకచకా రెండు వికెట్లు తీయడంతో పాక్ కోలుకోలేకపోయింది. ఓ దశలో ఎనిమిది పరుగుల వ్యవధిలోనే తొలి ఆరు వికెట్లు కోల్పోయిన పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. దీనికి తోడు మరో స్పిన్నర్ ప్రేమా రావత్ విజృంభించడంతో పాక్ బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్థాన్: 18.1 ఓవర్లలో 55 ఆలౌట్ (షవాల్ జుల్ఫికర్ 14, మునీబా అలీ 13; శ్రీచరణి 3/7, ప్రేమా రావత్ 3/9, దీప్తి శర్మ 2/5).
భారత్: 8.4 ఓవర్లలో 57/3 (హర్మన్‌ప్రీత్ 18 నాటౌట్, షఫాలీ 12, దీప్తి 12 నాటౌట్; ఫాతిమా 3/17).
ఇవి కూడా చదవండి
మల్కాజిగిరి నియోజకవర్గంలో 48,505 మందికి ‘సర్’ నోటీసులు
సీఎంతో చర్చలు ఫలప్రదంగా ముగిస్తాయని ఆశిస్తున్నాం: ఏపీ ఎన్జీవో చీఫ్ విద్యాసాగర్