మనోళ్లు గెలిచారోచ్!
ABN , Publish Date - Jul 15 , 2026 | 05:53 AM
ఆహా.. భారత క్రికెట్ జట్టు గెలుపు రుచి చూసింది. ఒకటా, రెండా ఎన్నడూ లేని రీతిలో వరుసగా ఆరు టీ20ల్లో ఓడిన టీమిండియా ఎట్టకేలకు వన్డే సిరీస్‌లో బోణీ కొట్టింది. ఇంగ్లండ్‌తో మంగళవారం...
ఇంగ్లండ్ టూర్‌లో బోణీ
తొలి వన్డేలో బ్రూక్ సేన ఓటమి
కెప్టెన్ గిల్, సుందర్ హాఫ్ సెంచరీలు
అక్షర్ ఆల్‌రౌండ్‌షో
బర్మింగ్‌హామ్: ఆహా.. భారత క్రికెట్ జట్టు గెలుపు రుచి చూసింది. ఒకటా, రెండా ఎన్నడూ లేని రీతిలో వరుసగా ఆరు టీ20ల్లో ఓడిన టీమిండియా ఎట్టకేలకు వన్డే సిరీస్‌లో బోణీ కొట్టింది. ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (75 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 80 రిటైర్డ్ హర్ట్) తన సూపర్ ఫామ్‌ను కొనసాగించగా, అక్షర్ పటేల్ (4/62; 52 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 57 నాటౌట్) ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్‌లో 1-0తో ఆధిక్యం అందుకుంది. అటు ఎడ్జ్‌బాస్టన్‌లో వరుసగా ఏడు వన్డే విజయాల తర్వాత ఇంగ్లండ్‌కిదే తొలి ఓటమి. ముందుగా ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (76 నాటౌట్), డాసన్ (68), డకెట్ (43) రాణించారు. ఛేద నలో భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి గెలిచింది. సుందర్ (52 నాటౌట్), శ్రేయాస్ (35) రాణించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా అక్షర్ నిలిచాడు.
గిల్, అక్షర్ జోరు: ఓ మాదిరి ఛేదనను భారత్ సునాయాసంగా ముగించింది. కెప్టెన్ గిల్ ఈ ఏడాది ఆడిన ఆరు వన్డేల్లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించడం విశేషం. శ్రేయాస్‌తో కలిసి తను మూడో వికెట్‌కు 101 పరుగులు జోడించాడు. చివర్లో అక్షర్ ధనాధన్ ఆటకు సుందర్ సహకరించాడు. అయితే వెటరన్స్ రోహిత్ (11), విరాట్ (5) వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరి నిరాశపర్చారు. గిల్ 80 పరుగుల వద్ద కాలి కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. కాసేపటికే శ్రేయాస్ రనౌట్ కాగా రాహుల్ (1)ను టంగ్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ ఎదురుదాడికి పరుగులు వేగంగా వచ్చాయి. మరో ఆల్‌రౌండర్ సుందర్ సైతం హాఫ్ సెంచరీ సాధించ డంతో, 28 బంతులుండగానే మ్యాచ్ ముగిసింది. ఐదో వికెట్‌కు ఈ జోడీ అజేయంగా 102 రన్స్ జోడించింది.
రూట్-డాసన్ సమన్వయం: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో వెటరన్ జో రూట్ అజేయ ఆటతీరుతో ఆదుకున్నాడు. అతడికి డాసన్ సహకరించడంతో జట్టు గౌరవప్రదమైన స్కోరందుకుం ది. 17 ఓవర్లలోనే ఇంగ్లండ్ 80/5 స్కోరుతో కష్టాల్లో పడిన దశలో 200 కూడా కష్టమనిపించింది. అయితే రూట్-డాసన్ జోడీ జట్టును ఆదుకుంది.
స్కోరుబోర్డు
ఇంగ్లండ్: డకెట్ (సి) బుమ్రా (బి) గుర్నూర్ 43, బెథెల్ (సి) వాషింగ్టన్ (బి) గుర్నూర్ 14, రూట్ (నాటౌట్) 76, బ్రూక్ (సి) రోహిత్ (బి) బుమ్రా 1, బట్లర్ (సి) గుర్నూర్ (బి) ప్రసిద్ధ్ 5, కర్రాన్ (సి) రాహుల్ (బి) ప్రసిద్ధ్ 0, జాక్స్ (సి) రాహుల్ (బి) దూబే 20, డాసన్ (సి) రోహిత్ (బి) అక్షర్ 68, ఆర్చర్ (సి) వాషింగ్టన్ (బి) అక్షర్ 12, రషీద్ (స్టంప్డ్) రాహుల్ (బి) అక్షర్ 1, టంగ్ (బి) అక్షర్ 0, ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 47.5 ఓవర్లలో 258 ఆలౌట్; వికెట్ల పతనం: 1-61, 2-63, 3-64, 4-80, 5-80, 6-107, 7-228, 8-250, 9-258, 10-258; బౌలింగ్: బుమ్రా 9-0-31-1, ప్రసిద్ధ్ 10-2-50-2, గుర్నూర్ 9-0-61-2, దూబే 6-0-27-1, సుందర్ 4-0-13-0, అక్షర్ 9.5-0-62-4.
భారత్: రోహిత్ (సి) బ్రూక్ (బి) కర్రాన్ 11, గిల్ (రిటైర్డ్ హర్ట్) 80, కోహ్లీ (ఎల్బీ) ఆర్చర్ 5, శ్రేయాస్ (రనౌట్) 35, వాషింగ్టన్ (నాటౌట్) 52, రాహుల్ (బి) టంగ్ 1, అక్షర్ (నాటౌట) 57, ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం: 45.2 ఓవర్లలో 262/4; వికెట్ల పతనం: 1-43, 2-48, 3-157, 4-160; బౌలింగ్: ఆర్చర్ 10-0-60-1, టంగ్ 10-0-50-1, కర్రాన్ 10-0-55-1, రషీద్ 5.2-0-34-0, బెథెల్ 1-0-10-0, డాసన్ 2-0-10-0, జాక్స్ 7-0-43-0.
ఈ వార్తలనూ చదవండి:
పునరాగమనాన్ని ఘనంగా చాటిన బుమ్రా.. జడేజాను అధిగమించి..
జపాన్ ఓపెన్ టోర్నీ: పీవీ సింధు శుభారంభం