Share News

ఈసారైనా ‘టాప్‌’ లేపేనా?

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:56 AM

ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ప్రస్థానం నమ్మశక్యంగాని రీతిలో ఆరంభమైంది. లీగ్‌లోకి తొలిసారిగా 2022లో అడుగుపెట్టిన టైటాన్స్‌ అదే ఏడాది విజేతగా నిలిచి అదరహో అనిపించింది. తర్వాతి ఏడాది కూడా...

ఈసారైనా ‘టాప్‌’ లేపేనా?

ఐపీఎల్‌ 10 రోజుల్లో

గుజరాత్‌ టైటాన్స్‌

ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ప్రస్థానం నమ్మశక్యంగాని రీతిలో ఆరంభమైంది. లీగ్‌లోకి తొలిసారిగా 2022లో అడుగుపెట్టిన టైటాన్స్‌ అదే ఏడాది విజేతగా నిలిచి అదరహో అనిపించింది. తర్వాతి ఏడాది కూడా ఫైనల్‌ దాకా వెళ్లింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి టైటాన్స్‌పై పడింది. ఈ రెండు సీజన్లకు హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ మూడో ఏడాది నుంచి జట్టు ఆట లయ తప్పింది. పాండ్యా ముంబైకి వెళ్లడంతో శుభ్‌మన్‌ గిల్‌ జట్టు పగ్గాలు చేపట్టాడు. గిల్‌ ఆధ్వర్యంలో 2024లో లీగ్‌ దశకే పరిమితమైన గుజరాత్‌.. నిరుడు ఎలిమినేటర్‌లో వెనుదిరిగింది. ఈసారి వేలంలో కీలక ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌, టామ్‌ బాంటన్‌, ల్యూక్‌ వుడ్‌లను తీసుకున్న టైటాన్స్‌ పునర్‌వైభవాన్ని చాటాలనుకుంటోంది. మరోవైపు ఈ ఫార్మాట్‌లో సత్తా నిరూపించుకోవడం కూడా గిల్‌కు కీలకం కానుంది.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

బలం

తుది జట్టులో ఎక్కువగా మార్పులు చేయకపోవడం గుజరాత్‌ బలంగా చెప్పవచ్చు. ప్రతీ బ్యాటర్‌కు తమ పాత్రపై స్పష్టత ఉంటుంది. ఇక సాయి సుదర్శన్‌, గిల్‌, బట్లర్‌లతో కూడిన టాపార్డర్‌ నిలకడ ప్రత్యర్థి జట్లను వణికించేదే. 2025లో సాయి సుదర్శన్‌ 759 రన్స్‌తో ఆరెంజ్‌ క్యాప్‌ సాధించగా.. గిల్‌, బట్లర్‌ సైతం 500+ రన్స్‌తో అదుర్స్‌ అనిపించారు. లీగ్‌ చరిత్రలోనే ఇలా జట్టులోని ముగ్గురు బ్యాటర్లు ఓ సీజన్‌లో ఇన్నేసి పరుగులు సాధించడం తొలిసారి. బౌలింగ్‌లోనూ ఈసారి టైటాన్స్‌ పేస్‌ దళం మరింత పదునుగా కనిపిస్తోంది. సిరాజ్‌, ప్రసిద్ధ్‌ క్రిష్ణలకు తోడుగా ఫామ్‌లో ఉన్న అనుభవజ్ఞుడు హోల్డర్‌ జత చేరాడు. వీరికి జతగా రాజస్థాన్‌ బుల్లెట్‌ పేసర్‌ అశోక్‌ శర్మ కొత్తగా జట్టులో చేరాడు. 150కి.మీ వేగంతో బంతులు వేసే సామర్థ్యం అతడికి ఉండడం సానుకూలాంశం కానుంది. సఫారీ స్టార్‌ కగిసో రబాడ మరో చక్కటి ఆప్షన్‌. లెఫ్టామ్‌ పేసర్‌గా ల్యూక్‌ ఉడ్‌ను అవసరమైతే వినియోగించుకోవచ్చు. స్పిన్నర్‌ సాయి కిశోర్‌ ప్రతిభ తక్కువేమీ కాదు.


బలహీనత

టైటాన్స్‌కు ఈసారి కూడా మిడిలార్డర్‌ బలహీనంగా కనిపిస్తోంది. గత సీజన్‌లో నెంబర్‌ 4లో అదరగొట్టిన రూథర్‌ఫోర్డ్‌ను ఆశ్చర్యకరంగా ముంబై ఇండియన్స్‌కు ట్రేడింగ్‌లో వదిలేసింది. తన స్థానంలో గ్లెన్‌ ఫిలిప్స్‌ లేక టామ్‌ బాంటన్‌ అందుబాటులో ఉన్నా వారిలో నిలకడ లేమి కనిపిస్తోంది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు సరైన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేదు. అలాగే ఫినిషింగ్‌ పాత్రలో రాహుల్‌ తెవాటియాపై అధిక భారం పడుతోంది. షారుక్‌ ఖాన్‌ సైతం చివర్లో అండగా నిలిస్తేనే భారీ స్కోర్లు సాధ్యమవుతాయి. ఇక గత రెండు సీజన్లుగా స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ పూర్తిగా తేలిపోయాడు. చివరి సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో తీసింది 9 వికెట్లే. పైగా ఇటీవలి టీ20 వరల్డ్‌క్‌పలో పేలవ ఆటతీరుతో నిరాశపరిచిన బట్లర్‌పై కూడా ఒత్తిడి నెలకొంది. అలాగే గాయంతో విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడలేకపోయిన ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ ఫిట్‌నెస్‌ కూడా తేలాల్సి ఉంది.

జట్టు

స్వదేశీ ఆటగాళ్లు: శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ తెవాటియా, ప్రసిద్ధ్‌ క్రిష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, అశోక్‌ శర్మ, సాయి కిషోర్‌, అనూజ్‌ రావత్‌, నిశాంత్‌ సంధు, అర్షద్‌ ఖాన్‌, షారుక్‌, ఇషాంత్‌, జయంత్‌ యాదవ్‌, మానవ్‌, పృథ్వీరాజ్‌, గుర్నూర్‌ సింగ్‌.

విదేశీ ఆటగాళ్లు: బట్లర్‌, బాంటన్‌, ల్యూక్‌ ఉడ్‌, రషీద్‌ ఖాన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, హోల్డర్‌, రబాడ, కుమార్‌ కుషాగ్ర.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో ఇంకా కలగానే ఆ ఆటగాళ్ల కోరిక!

NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం

Updated Date - Mar 18 , 2026 | 05:56 AM