Share News

ఎవరిదో ఆఖరి అడుగు?

ABN , Publish Date - May 29 , 2026 | 01:24 AM

ఐపీఎల్‌-19వ సీజన్‌ ఫైనల్‌కు ముందు చిట్టచివరి ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. గుజరాత్‌ టైటాన్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య శుక్రవారం క్వాలిఫయర్‌-2 జరుగనుంది. ఈనెల 31న..

ఎవరిదో ఆఖరి అడుగు?

రాత్రి 7.30 నుంచి

నేడు రెండో క్వాలిఫయర్‌

గుజరాత్‌ X రాజస్థాన్‌

స్టార్‌స్పోర్ట్స్‌లో..

విజేత ఫైనల్‌కు..

ముల్లన్‌పూర్‌: ఐపీఎల్‌-19వ సీజన్‌ ఫైనల్‌కు ముందు చిట్టచివరి ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. గుజరాత్‌ టైటాన్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య శుక్రవారం క్వాలిఫయర్‌-2 జరుగనుంది. ఈనెల 31న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగే ఫైనల్లో తలపడేందుకు ఇరు జట్లకిదే ఆఖరి అవకాశం. రాజస్థాన్‌ 2008 ఆరంభ సీజన్‌లో విజేతగా నిలవగా.. ఆ తర్వాత 2022లో మాత్రమే ఫైనల్‌కు రాగలిగింది. ఆ మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలోనే పరాభవం ఎదురుకాగా.. నేడు ఆర్‌ఆర్‌కు బదులు తీర్చుకునే సమయం వచ్చింది. ఇక క్వాలిఫయర్‌ 1లో పేలవ ఆటతీరుతో ఆర్‌సీబీ చేతిలో చిత్తుగా ఓడిన టైటాన్స్‌కిది రెండో అవకాశం. ఇరు జట్లు ఓవరాల్‌గా 10 మ్యాచ్‌ల్లో తలపడగా 7-3తో గిల్‌ సేన ఆధిపత్యంలో ఉంది. ఈ సీజన్‌లో చెరో మ్యాచ్‌ గెలిచాయి. ఏదిఏమైనా ఇదే మైదానంలో 29 బంతుల్లో 97 పరుగులు బాదిన వైభవ్‌ను టైటాన్స్‌ బౌలర్లు ఏమేరకు నిలువరిస్తానేది ఆసక్తికరంగా మారింది.

దూకుడు పెంచాల్సిందే..

ఫైనల్‌కు దూసుకెళ్లాలంటే గుజరాత్‌ ఓపెనర్ల నుంచి మెరుపు ఆరంభం రావాల్సి ఉంటుంది. సాయి సుదర్శన్‌-శుభ్‌మన్‌ గిల్‌ నిలకడకు మారుపేరైనా.. వీరి ఆటలో టీ20 తరహా హిట్టింగ్‌ కనిపించదు. శుక్రవారం ఆ బలహీనతను అధిగమించాల్సి ఉంటుంది. క్వాలిఫయర్‌1లో టాపార్డర్‌ పూర్తిగా విఫలం కావడం దెబ్బతీసింది. తెవాటియాను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపితే ప్రయోజనం ఉంటుంది. మిడిలార్డర్‌లో అండగా నిలిచే బ్యాటర్‌ లేకపోవడం లోపంగా కనిపిస్తోంది. జట్టు బౌలింగ్‌ మాత్రం పకడ్బందీగానే ఉంది. ఆర్‌సీబీపై తేలిపోయినా.. ఓవరాల్‌గా వీరి ప్రదర్శన అద్భుతంగానే ఉంది. పేసర్‌ రబాడ (26), సిరాజ్‌ (17) స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (19) ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టగలరు. ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్‌, జేసన్‌ హోల్డర్‌ రాణిస్తే గుజరాత్‌కు తిరుగుండదు. కానీ నేటి మ్యాచ్‌లో వైభవ్‌ను వీరంతా ఏమేరకు నిలువరించగలరనే దానిపైనే విజయావకాశాలుంటాయి.


జోష్‌లో రాజస్థాన్‌

ఎలిమినేటర్‌లో పటిష్ట సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన జోష్‌లో రాజస్థాన్‌ కీలక మ్యాచ్‌కు సిద్ధం కానుంది. ఎప్పటిలాగే చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీపైనే జట్టు ఆధారపడి ఉంది. పవర్‌ప్లేలోనే తను మ్యాచ్‌ను శాసిస్తున్నాడు. కానీ అతడి జోరును అందుకోవడంలో మిగతా బ్యాటర్లు విఫలమవుతున్నారు. బుధవారం ఓ దశలో ఆర్‌ఆర్‌ 280 రన్స్‌ చేస్తుందని ఆశించారు. కానీ చివరకు 250 కూడా చేయలేకపోవడం గమనార్హం. జురెల్‌ మినహా మిగతా బ్యాటర్లు తడబడ్డారు. వైభవ్‌ సునామీ ఇన్నింగ్స్‌ లేకపోతే జట్టు కచ్చితంగా నిష్క్రమించేదే. అయితే తాజా సీజన్‌లో గుజరాత్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో తను 31, 36 పరుగులు మాత్రమే చేయడం ఆందోళనకరమే. సిరాజ్‌, రబాడ అతడిని అడ్డుకోగలిగారు. అందుకే వైభవ్‌పైనే ఆధారపడకుండా ఓపెనర్‌ జైస్వాల్‌, కెప్టెన్‌ పరాగ్‌, ఫెరీరా, షనక బ్యాట్లు ఝుళిపించాల్సిందే. బౌలింగ్‌లో పేసర్‌ ఆర్చర్‌ ఆరంభంలోనే వికెట్లు తీస్తూ కీలకంగా నిలుస్తున్నాడు. బర్గర్‌ తనకు తోడుండగా.. మధ్య ఓవర్లలో బ్రిజేశ్‌, యష్‌ రాజ్‌, జడేజా ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు. ఫైనల్‌ చేరే క్రమంలో ఈ చివరి అడ్డంకిని స్థాయికి తగ్గ ఆటతీరుతో అధిగమించాలని రాయల్స్‌ భావిస్తోంది.

తుది జట్లు

గుజరాత్‌: గిల్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్‌, బట్లర్‌, నిశాంత్‌, సుందర్‌, హోల్డర్‌, తెవాటియా, రషీద్‌, రబాడ, సిరాజ్‌, ప్రసిద్ధ్‌.

రాజస్థాన్‌: వైభవ్‌, జైస్వాల్‌, జురెల్‌, పరాగ్‌ (కెప్టెన్‌), ఫెరీరా, షనక, జడేజా, ఆర్చర్‌, బర్గర్‌, సుశాంత్‌, బ్రిజేశ్‌, యష్‌ రాజ్‌.

పిచ్‌:

వికెట్‌పై చక్కటి బౌన్స్‌ ఉండడంతో ఆరంభంలో వేగంగా పరుగులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త బంతితో పేసర్లు, మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ప్రభావం చూపవచ్చు. మంచు ప్రభావంతో ఇక్కడ టాస్‌ గెలిచిన జట్లు ఫీల్డింగ్‌కు మొగ్గుచూపాయి. అయినా చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓడిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

కేన్‌ విలియమన్స్‌ వరల్డ్ రికార్డ్

వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్

Updated Date - May 29 , 2026 | 01:24 AM