Share News

అఫ్గాన్ క్రికెట్‌లో విషాదం.. మాజీ క్రికెటర్ కన్నుమూత

ABN , Publish Date - Jul 07 , 2026 | 04:55 PM

అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ మాజీ క్రికెటర్‌ షాపూర్‌ జద్రాన్‌ కన్నుమూశాడు. ఈ విషయాన్ని అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు మంగళవారం ధ్రువీకరించింది.

అఫ్గాన్ క్రికెట్‌లో విషాదం.. మాజీ క్రికెటర్ కన్నుమూత
Shapoor Zadran

స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ మాజీ క్రికెటర్‌ షాపూర్‌ జద్రాన్‌ కన్నుమూశాడు. ఈ విషయాన్ని అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు మంగళవారం ధ్రువీకరించింది. జద్రాన్‌ గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. వ్యాధి కారణంగా అతడి శరీరంలో తెల్ల రక్తకణాల సంఖ్య పూర్తిగా పడిపోయింది.


అతడి ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో అఫ్గాన్‌ నుంచి భారత్‌కు తరలించి అత్యాధునిక చికిత్స అందిస్తున్నారు. గత కొన్నినెలలుగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జద్రాన్‌ ఇవాళ తుదిశ్వాస విడిచాడు. రేపు(బుధవారం) అతడు 39వ వసంతంలో అడుగుపెట్టాల్సి ఉంది. పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానే మరణించడం అతడి కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టేసింది.


అఫ్గాన్‌ క్రికెట్‌ నివాళి

షాపూర్‌ జద్రాన్‌ మరణం పట్ల అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది. అఫ్గాన్‌ క్రికెట్‌ అభివృద్ధిలో అతడూ భాగమయ్యాడని.. చిన్న వయసులోనే జద్రాన్ కన్నుమూయడం కలచివేసిందని విచారం వ్యక్తం చేసింది. షాపూర్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. అలానే సహచర క్రికెటర్లు అతడి మృతికి సంతాపం తెలియజేశారు. జద్రాన్ అఫ్గాన్‌ తరఫున 2009- 2020 మధ్య అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో 44 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడిన షాపూర్‌.. మొత్తం 37 వికెట్లు కూల్చాడు. మూడుసార్లు టీ20 ప్రపంచకప్‌ జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.


ఇవి కూడా చదవండి:

సంజూ శాంసన్‌కు అండగా నిలిచిన అజింక్య రహానే

టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్‌కు మరో షాక్

Updated Date - Jul 07 , 2026 | 05:02 PM