అలెన్ విధ్వంసం
ABN , Publish Date - Mar 05 , 2026 | 05:27 AM
మ్యాచ్ రోజు ఎవరు బాగా ఆడితే వారిదే విజయమన్న నానుడిని న్యూజిలాండ్ నిరూపించింది. ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్లో కివీస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. దాంతో బుధవారం జరిగిన ఏకపక్ష మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో...
ఫైనల్‌కు న్యూజిలాండ్
9 వికెట్లతో దక్షిణాఫ్రికా చిత్తు
ఫిన్ రికార్డు శతకం
తొలి సెమీస్ ఫలితం ఎంత విభిన్నం.. టోర్నీలో అప్రతిహత విజయాలతో సెమీస్‌కు దూసుకొచ్చింది దక్షిణాఫ్రికా.. మరోవైపు సూపర్-8 చివరి పోరులో ఇంగ్లండ్ చేతిలో ఓడి, శ్రీలంక-పాకిస్థాన్ మ్యాచ్ ఫలితం పుణ్యాన సెమీ్‌సలో అడుగుపెట్టింది న్యూజిలాండ్. దాంతో మరో ఆలోచన లేకుండా ఈ సెమీస్‌లో సఫారీలనే హాట్ ఫేవరెట్‌గా క్రికెట్ పండితులు భావించారు. కానీ అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఒత్తిడికి చిత్తయిన సఫారీలు చోకర్స్ ముద్రను నిజం చేస్తూ మరోసారి మెగా టోర్నీ టైటిల్‌కు దూరమవగా.. లీగ్, సూపర్-8కు ఏమాత్రం పొంతనలేని ఆట తీరుతో దుమ్ము రేపిన కివీస్ సగర్వంగా ఫైనల్ చేరింది.
కోల్‌కతా: మ్యాచ్ రోజు ఎవరు బాగా ఆడితే వారిదే విజయమన్న నానుడిని న్యూజిలాండ్ నిరూపించింది. ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్లో కివీస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. దాంతో బుధవారం జరిగిన ఏకపక్ష మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. తొలుత సఫారీలు 20 ఓవర్లలో 169/8 స్కోరు చేశారు. యాన్సెన్ (30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55 నాటౌట్) బ్రెవిస్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) ఆదుకున్నారు. మెకాంచీ, రచిన్, హెన్రీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఫిన్ అలెన్ (33 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 నాటౌట్) రికార్డు సెంచరీకి టిమ్ సైఫర్ట్ (33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) దూకుడైన ఇన్నింగ్స్ తోడవగా న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలోనే 173/1 స్కోరు చేసి గెలుపొందింది. అలెన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
అలెన్ అలజడి..సైఫర్ట్ దూకుడు: అలెన్ ఎడాపెడా బాదుడుకు సైఫర్ట్ దూకుడు తోడవడంతో మోస్తరు ఛేదనను కివీస్ ఇట్టే పూర్తి చేసింది. ఇక..టోర్నీలో ప్రత్యర్థి జట్లను బెదరగొట్టిన సఫారీ బౌలర్లు సెమీస్ పోరులో పూర్తిగా తేలిపోయారు. మొదటి ఓవర్‌నుంచే సైఫర్ట్, అలెన్ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపారు. బాష్ వేసిన ఆరో ఓవర్లో ఒక సిక్స్ నాలుగు ఫోర్లతో అలెన్ కదం తొక్కడంతో పవర్ ప్లేలో 84/0తో న్యూజిలాండ్ సగం లక్ష్యాన్ని పూర్తి చేయడం విశేషం. పదో ఓవర్లో సైఫర్ట్‌ను రబాడ బౌల్డ్ చేయడంతో 117 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడి దక్షిణాఫ్రికాకు ఒకింత ఊరట లభించింది. మరోవైపు తగ్గేదేలే అంటూ అలెన్..యాన్సెన్ వేసిన 13వ ఓవర్లో 4,4,6,6,4తో 24 పరుగులు కొల్లగొట్టడం ద్వారా గ్రాండ్‌గా సెంచరీ పూరించడంతోపాటు జట్టును విజయ పథాన నిలిపాడు.
స్పిన్నర్ల హవా..యాన్సెన్ ఎదురు దాడి: స్పిన్నర్లు అద్భుతంగా రాణించి దక్షిణాఫ్రికా బ్యాటర్లకు కళ్లెం వేసినా..మార్కో యాన్సెన్ ఎదురు దాడికి దిగి భారీ షాట్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. బ్యాటింగ్‌కు కాసింత కష్టమైన పిచ్‌పై భారీ షాట్లు కొట్టే యత్నంలో సౌతాఫ్రికా బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు. ఫలితంగా 77/5 స్కోరుతో తీవ్ర ఇక్కట్లలో పడగా యాన్సెన్ ఆదుకోవడంతో ఆ జట్టు గౌరవప్రద స్కోరు అందుకుంది. టోర్నీలో నిరాశాజనక ప్రదర్శనను కొనసాగిస్తూ ఓపెనర్ డికాక్ ఆదిలోనే నిష్క్రమించాడు. మ్యాట్ హెన్రీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో సిక్సర్ బాదిన డికాక్ టచ్‌లోకి వచ్చినట్టు కనిపించాడు. అయితే న్యూజిలాండ్ తెలివిగా రెండో ఓవర్లోనే ఆఫ్ స్పిన్నర్ మెకాంచీని బౌలింగ్‌కు దించి అద్భుత ఫలితం రాబట్టింది. ఊరించే బంతులతో తొలుత డికాక్ (10)ను, తదుపరి రికెల్టన్ (0)ను మెకాంచీ బోల్తా కొట్టించాడు. దాంతో 12/2తో దక్షిణాఫ్రికా ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో మార్‌క్రమ్, బ్రెవిస్ భారీ షాట్లకు వెళ్లకుండా ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. నాలుగో ఓవర్లో సఫారీలకు మరో ఝలక్ తగిలేదే. మార్‌క్రమ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను మిడ్ వికెట్‌లో రచిన్ వదిలేశాడు.
ఇక నీషమ్ వేసిన ఐదో ఓవర్లో మార్‌క్రమ్ సిక్స్‌తో, బ్రెవిస్ 4,4తో 17 పరుగులు రాబట్టగా..పవర్‌ప్లేను 48/2తో దక్షిణాఫ్రికా ముగించింది. మూడో వికెట్‌కు 43 పరుగులు జోడించి కుదురుకుంటున్న దశలో మార్‌క్రమ్ (18)ని అవుట్ చేసిన రచిన్.. ప్రత్యర్థికి మరో షాకిచ్చాడు. కొద్దిసేపటికే దక్షిణాఫ్రికా ఇంకో వికెట్ కోల్పోయేదే. రచిన్ వేసిన పదో ఓవర్లో మిల్లర్ క్యాచ్‌ను ఫిలిప్స్ చేజార్చాడు. కానీ ఈ లైఫ్‌ను సద్వినియోగం చేసుకోలేని మిల్లర్ ఇదే ఓవర్ చివరి బంతికి మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి నిరాశ పరిచాడు. మరో రెండు బంతుల తర్వాత బ్రెవిస్ కూడా భారీషాట్ కొట్టబోయి పెవిలియన్ చేరాడు. వరుస వికెట్లు చేజారడం.. స్టబ్స్, యాన్సెన్ ఆచితూచి ఆడడంతో దక్షిణాఫ్రికా స్కోరు నెమ్మదించింది. ఈనేపథ్యంలో నీషమ్ వేసిన 18వ ఓవర్లో స్టబ్స్ 4,6తో యాన్సెన్ 4,6తో విజృంభించడంతో 22 రన్స్ లభించాయి. కానీ 19వ ఓవర్ తొలి బంతికి స్టబ్స్‌ను ఫెర్గూసన్ బౌల్డ్ చేయడంతో 73 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇదే ఓవర్లో యాన్సెన్ 6,6 దంచడంతో సౌతాఫ్రికా పోరాడే స్కోరు చేసింది. అయితే ఆఖరి ఓవర్లో బాష్ (2), రబాడ (0)లను హెన్రీ వెనక్కి పంపడమేగాక 6 పరుగులే ఇచ్చి కట్టడిచేశాడు.
స్కోరుబోర్డు
దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్ (సి) మిచెల్ (బి) రచిన్ 18, డికాక్ (సి) ఫెర్గూసన్ (బి) మెకాంచి 10, రికెల్టన్ (సి) అలెన్ (బి) మెకాంచి 0, బ్రెవిస్ (సి) శాంట్నర్ (బి) నీషమ్ 34, మిల్లర్ (సి) మిచెల్ (బి) రచిన్ 6, స్టబ్స్ (బి) ఫెర్గూసన్ 29, యాన్సెన్ (నాటౌట్) 55, బాష్ (బి) హెన్రీ 2, రబాడ (సి) నీషమ్ (బి) హెన్రీ 0, కేశవ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 169/8; వికెట్లపతనం: 1-12, 2-12, 3-55, 4-77, 5-77, 6-150, 7-166, 8-166; బౌలింగ్: హెన్రీ 4-0-34-2, మెకాంచి 1-0-9-2, ఫెర్గూసన్ 4-0-29-1, నీషమ్ 3-0-42-1, శాంట్నర్ 4-0-25-0, రచిన్ 4-0-29-2.
న్యూజిలాండ్: సైఫర్ట్ (బి) రబాడ 58, అలెన్ (నాటౌట్) 100, రచిన్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 12.5 ఓవర్లలో 173/1; వికెట్ పతనం: 1-117; బౌలింగ్: యాన్సెన్ 2.5-0-53-0, రబాడ 3-0-28-1, ఎన్‌గిడి 2-0-22-0, బాష్ 2-0-35-0, కేశవ్ 3-0-33-0.
1
84/0.. పవర్‌ప్లేలో న్యూజిలాండ్ స్కోరు ఇది. టీ20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌ల పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు చేసిన తొలి జట్టుగా కివీస్.
2
టీ20 ప్రపంచ కప్‌లో ఫైనల్ చేరడం న్యూజిలాండ్‌కు ఇది రెండోసారి. అంతకుముందు 2021 లో తుదిపోరుకు వచ్చింది.
1
పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో వేగవంతమైన సెంచరీ (33 బంతుల్లో) చేసిన తొలి ఆటగాడిగా ఫిన్ అలెన్. ఈ క్రమంలో క్రిస్ గేల్ (2016 టోర్నీలో 47 బంతుల్లో) రికార్డును దాటాడు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ వ్యూయర్ షిప్‌లో సంచలన రికార్డ్!
ఐపీఎల్ 2026: చిన్నస్వామి స్టేడియంలోనే ఫైనల్ పోరు