Share News

లంకను పడగొట్టారు

ABN , Publish Date - Feb 23 , 2026 | 04:43 AM

విల్‌ జాక్స్‌ (21, 3/22) ఆల్‌రౌండ్‌ షోతోపాటు పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ (2/20) చెలరేగడంతో.. ఓ మాదిరి స్కోరును ఇంగ్లండ్‌ కాపాడుకొంది. ఫిల్‌ సాల్ట్‌ (62) ఒంటరి పోరాటం చేయడంతో...

లంకను పడగొట్టారు

అదరగొట్టిన జాక్స్‌, ఆర్చర్‌

సాల్ట్‌ అర్ధ శతకం

ఇంగ్లండ్‌ గెలుపు

పల్లెకెలె: విల్‌ జాక్స్‌ (21, 3/22) ఆల్‌రౌండ్‌ షోతోపాటు పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ (2/20) చెలరేగడంతో.. ఓ మాదిరి స్కోరును ఇంగ్లండ్‌ కాపాడుకొంది. ఫిల్‌ సాల్ట్‌ (62) ఒంటరి పోరాటం చేయడంతో.. టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8లో భాగంగా ఆదివారం జరిగిన గ్రూప్‌-2 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 51 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. తొలుత ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 146/9 స్కోరు చేసింది. దునుత్‌ వెల్లలగే మూడు వికెట్లు పడగొట్టగా.. మధుశంక, తీక్షణ చెరో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. ఛేదనలో లంక 16.4 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. షనక (30) మినహా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. డాసన్‌, రషీద్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా జాక్స్‌ నిలిచాడు.

పెవిలియన్‌కు క్యూ..: ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశామనే లంక ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆర్చర్‌తోపాటు ఆఫ్‌ స్పిన్నర్‌ జాక్స్‌ విజృంభించడంతో పవర్‌ప్లే లోపే లంక 34/5తో ఐదు టాపార్డర్‌ వికెట్లు చేజార్చుకొని పీకల్లోతు కష్టాల్లో పడింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ నిస్సాంక (9)ను ఆర్చర్‌ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేర్చడంతో పతనం ఆరంభమైంది. కుశాల్‌ మెండిస్‌ (4), పవన్‌ (0)ను జాక్స్‌ ఒకే ఓవర్‌లో వెనక్కిపంపగా.. ఓపెనర్‌ కమిల్‌ మిషార (6)ను ఆర్చర్‌ అవుట్‌ చేయడంతో లంక ఏమాత్రం కోలుకోలేక పోయింది. కెప్టెన్‌ షనక కొంతసేపు పోరాడినా.. అతడికి సహకారం అందించే వారే కరువయ్యారు.


స్పిన్‌ దెబ్బకు విలవిల:టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. లంక స్పిన్నర్ల ధాటికి విలవిల్లాడింది. ఒకవైపు వికెట్లు టపటపా రాలుతున్నా.. మరో ఎండ్‌లో ఓపెనర్‌ సాల్ట్‌ క్రీజులో నిలవడంతో జట్టు పోరాడగలిగే స్కోరు చేసింది. బట్లర్‌ (7), బెథల్‌ (3) సింగిల్‌ డిజిట్‌కే వెనుదిరగడంతో.. పవర్‌ప్లేలో ఇంగ్లండ్‌ 37/2 స్కోరు చేసింది. సాల్ట్‌ మాత్రం వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. బాంటన్‌ (6) రనౌట్‌ కాగా.. కెప్టెన్‌ బ్రూక్‌ (14)ను వెల్లలగే ఎల్బీగా వెనక్కి పంపాడు. 13వ ఓవర్‌లో హేమంత బౌలింగ్‌లో సింగిల్‌తో సాల్ట్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నాడు. కర్రాన్‌ (11)ను చమీర, సాల్ట్‌ను వెల్లలగే వెనక్కి పంపడంతో ఇంగ్లండ్‌ 106/6తో కష్టాల్లో పడింది. ఈ దశలో ధాటిగా ఆడిన జాక్స్‌ టీమ్‌ స్కోరును 150 మార్క్‌కు చేరువ చేశాడు.

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌: 20 ఓవర్లలో 146/9 (సాల్ట్‌ 62, జాక్స్‌ 21; వెల్లలగే 3/26, మధుశంక 2/25).

శ్రీలంక: 16.4 ఓవర్లలో 95 ఆలౌట్‌ (షనక 30; జాక్స్‌ 3/22, ఆర్చర్‌ 2/20).

ఇవి కూడా చదవండి:

సూపర్ 8: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ

సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌కు గుడ్‍న్యూస్

Updated Date - Feb 23 , 2026 | 04:43 AM