Share News

సంజూ.. సూపర్‌

ABN , Publish Date - May 06 , 2026 | 01:46 AM

సీజన్‌ ఆరంభంలో తడబడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రస్తుతం నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. బౌలర్లు విశేషంగా రాణించిన చోట.. స్టార్‌ ఓపెనర్‌ సంజూ శాంసన్‌...

సంజూ.. సూపర్‌

నేటి మ్యాచ్‌

సన్‌రైజర్స్‌ X పంజాబ్‌

వేదిక : హైదరాబాద్‌, రా.7.30

ఢిల్లీపై 8 వికెట్లతో చెన్నై విజయం

న్యూఢిల్లీ: సీజన్‌ ఆరంభంలో తడబడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రస్తుతం నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. బౌలర్లు విశేషంగా రాణించిన చోట.. స్టార్‌ ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (52 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 87 నాటౌట్‌) అద్భుత బ్యాటింగ్‌తో తుదికంటా నిలిచాడు. దీంతో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎ్‌సకే 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. సమీర్‌ రిజ్వీ (24 బంతుల్లో 4 సిక్సర్లతో 40 నాటౌట్‌), స్టబ్స్‌ (31 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 38) రాణించారు. నూర్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో చెన్నై 17.3 ఓవర్లలో 2 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. సంజూకు కార్తీక్‌ శర్మ (31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 నాటౌట్‌) సహకరించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా శాంసన్‌ నిలిచాడు.

శాంసన్‌-కార్తీక్‌ శతక భాగస్వామ్యం: ఓ మాదిరి ఛేదనలో చెన్నై ఓపెనర్‌ సంజూ శాంసన్‌ నిలకడను చూపాడు. బంతి బ్యాట్‌పైకి రావడం కష్టంగా మారినా క్రీజులో ఓపిగ్గా నిలిచాడు. కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నాక.. ఎదురుదాడికి దిగడంతో ఢిల్లీకి నిరాశ తప్పలేదు. యువ బ్యాటర్‌ కార్తీక్‌ శర్మ మరోసారి ఆకట్టుకుని సంజూతో శతక భాగస్వామ్యం అందించాడు. ఆరంభంలో ఢిల్లీ బౌలర్లు కట్టడి చేయడంతో చెన్నై ఇన్నింగ్స్‌ నిదానంగానే సాగింది. ఓపెనర్‌ రుతురాజ్‌ (6)ను పేసర్‌ ఎన్‌గిడి అవుట్‌ చేయగా, ఉర్విల్‌ (17) రెండు సిక్సర్లతో పవర్‌ప్లేలో జట్టు 44/1తో ఫర్వాలేదనిపించింది. స్పిన్నర్‌ అక్షర్‌ బౌల్డ్‌ చేయడంతో ఉర్విల్‌ వెనుదిరిగాడు. కానీ ఏడో ఓవర్‌ నుంచి శాంసన్‌-కార్తీక్‌ జోడీ క్రీజులో పాతుకుపోయింది. శాంసన్‌ అడపాదడపా బౌండరీలతో స్కోరులో వేగం పెంచాడు. కుల్దీప్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో 6,6,4తో 32 బంతుల్లో తను హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. స్టార్క్‌ ఓవర్‌లోనూ శాంసన్‌ రెండు ఫోర్లతో ఆకట్టుకోవడంతో 13వ ఓవర్‌లో స్కోరు వంద దాటింది. పేసర్‌ నటరాజన్‌ ఓవర్‌లో మరింత చెలరేగిన సంజూ 6,6,4తో 20 పరుగులు అందించాడు. అటు కార్తీక్‌ 6,4తో మరో 15 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు. ఇద్దరి మధ్య మూడో వికెట్‌కు అజేయంగా 114 పరుగులు జత చేరడం విశేషం.


ఆదుకున్న రిజ్వీ-స్టబ్స్‌: టాస్‌ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్‌ తీసుకున్నప్పటికీ ఇన్నింగ్స్‌ మాత్రం నత్తనడకన సాగింది. దీనికి తోడు చెన్నై స్పిన్నర్ల ధాటికి ఆరంభం నుంచే వికెట్లను కూడా కోల్పోయింది. టాప్‌-4 బ్యాటర్లు రెండంకెల స్కోర్లు సాధించినా ఏ ఒక్కరూ 20 పరుగులు చేయలేకపోయారు. కెప్టెన్‌ అక్షర్‌ (2) పేలవ ఫామ్‌ మరోసారి కొనసాగించాడు. ఈ స్థితిలో స్టబ్స్‌, రిజ్వీ అండగా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోరునందించారు. పవర్‌ప్లేలో కేవలం 37 పరుగులే చేసిన ఢిల్లీ.. ఓపెనర్లు నిస్సాంక (19), రాహుల్‌ (12) వికెట్లను కోల్పోయింది. ఇక స్పిన్నర్‌ నూర్‌ తన వరుస ఓవర్లలో కరుణ్‌ నాయర్‌ (13), నితీశ్‌ రాణా(15)లను వెనక్కి పంపగా.. అక్షర్‌ పోరాటం ఆరు బంతులకే ముగిసింది. దీంతో ఢిల్లీ 69 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. అప్పటికి మరో 9 ఓవర్లు మిగిలి ఉన్నాయి. పిచ్‌పై రన్స్‌ సాధించడం కష్టం కావడంతో స్టబ్స్‌, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రిజ్వీ ఓపికగా ఆడారు. వికెట్‌ కాపాడుకుంటూనే అడపాదడపా బౌండరీలపై దృష్టి సారించారు. 11వ ఓవర్‌లో స్టబ్స్‌ క్యాచ్‌ను నూర్‌ వదిలేయడం కలిసివచ్చింది. 18వ ఓవర్‌లో రిజ్వీ రెండు సిక్సర్లతో బ్యాట్‌ ఝుళిపించాడు. ఆ తర్వాతి ఓవర్‌లో స్టబ్స్‌ను పేసర్‌ ఒవర్టన్‌ అవుట్‌ చేయడంతో ఆరో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక చివరి ఓవర్‌లో అశుతోష్‌ (14) రెండు సిక్సర్లు బాది రనవుట్‌ కాగా, ఆఖరి బంతిని రిజ్వీ సిక్సర్‌గా మలిచి స్కోరును 150 దాటించాడు.


స్కోరుబోర్డు

ఢిల్లీ: నిస్సాంక (సి) బ్రెవిస్‌ (బి) ముకేశ్‌ 19, రాహుల్‌ (సి) గైక్వాడ్‌ (బి) హుస్సేన్‌ 12, నితీశ్‌ (సి) కార్తీక్‌ (బి) నూర్‌ 15, కరుణ్‌ (సి) గుర్జపనీత్‌ (బి) నూర్‌ 13, అక్షర్‌ (సి) హుస్సేన్‌ (బి) గుర్జపనీత్‌ 2, స్టబ్స్‌ (సి) ముకేశ్‌ (బి) ఒవర్టన్‌ 38, రిజ్వీ (నాటౌట్‌) 40, అశుతోష్‌ (రనౌట్‌) 14, స్టార్క్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 155/7; వికెట్ల పతనం: 1-29, 2-36, 3-52, 4-61, 5-69, 6-134, 7-149; బౌలింగ్‌: అకీల్‌ 4-0-19-1, ముకేశ్‌ 4-0-31-1, అన్షుల్‌ 4-0-49- 0, నూర్‌ అహ్మద్‌ 3-0-22-2, గుర్జపనీత్‌ 4-0-29-1, ఒవర్టన్‌ 1-0-5-1.

చెన్నై: సంజూ (నాటౌట్‌) 87, రుతురాజ్‌ (సి) రిజ్వీ (బి) ఎన్‌గిడి 6, ఉర్విల్‌ (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) అక్షర్‌ 17, కార్తీక్‌ శర్మ (నాటౌట్‌) 41, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 17.3 ఓవర్లలో 159/2; వికెట్ల పతనం: 1-24, 2-45; బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-30-0, అక్షర్‌ 4-0-25-1, ఎన్‌గిడి 4-0-30-1, కుల్దీప్‌ 3-0-34-0, నటరాజన్‌ 2.3-0-39-0.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

పంజాబ్‌ 9 6 2 1 13 0.855

బెంగళూరు 9 6 3 0 12 1.420

హైదరాబాద్‌ 10 6 4 0 12 0.644

రాజస్థాన్‌ 10 6 4 0 12 0.510

గుజరాత్‌ 10 6 4 0 12 -0.147

చెన్నై 10 5 5 0 10 0.151

ఢిల్లీ 10 4 6 0 8 -0.949

కోల్‌కతా 9 3 5 1 7 -0.539

ముంబై 10 3 7 0 6 -0.649

లఖ్‌నవూ 9 2 7 0 4 -1.076

ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు

ఇవి కూడా చదవండి:

‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్

ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్

Updated Date - May 06 , 2026 | 01:46 AM