Share News

హనీట్రాప్‌లో పడకండి

ABN , Publish Date - May 09 , 2026 | 02:22 AM

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాళ్లు, అధికారులు హనీట్రాప్‌ ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని...

హనీట్రాప్‌లో పడకండి

  • క్రికెటర్లు, అధికారులకు బీసీసీఐ హెచ్చరిక

  • ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై కఠిన నియమావళి సిద్ధం

ముంబై: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాళ్లు, అధికారులు హనీట్రాప్‌ ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తేల్చింది. ఈనేపథ్యంలో భద్రతా లోపాలు, నిబంధనల అతిక్రమణలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే.. తక్షణమే పాటించాల్సిన కఠిన నిబంధనలను బోర్డు రూపొందించింది. అలాగే ఎనిమిది పేజీలతో కూడిన ఈ జాబితాను పది ఫ్రాంచైజీల యజమానులకు, అధికారులకు బోర్డు పంపింది. ముందస్తు అనుమతి లేకుండానే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఇతరులను తమ హోటల్‌ గదుల్లోకి అనుమతించడాన్ని తాము గమనించినట్టు అందులో పేర్కొంది. ఇక నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా ఆటగాళ్లు లేదా సహాయక సిబ్బంది గదుల్లోకి ఏ సందర్శకుడినీ అనుమతించరు. అలాగే వీరి గదులను ఆకస్మికంగా తనిఖీ చేసే అవకాశం కూడా ఉంటుంది. అతిథులతో సమావేశాలు హోటల్‌ లాబీల్లోనే జరగాలని సూచించింది. అంతేకాకుండా మైదానం వెలుపల జరిగే వ్యవహారాలపై ఆయా ఫ్రాంచైజీలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మ్యాచ్‌లు జరిగేటప్పుడు డగౌట్‌ లేదా మైదానంలోని ఆటగాళ్లను ఫ్రాంచైజీ యజమానులు, అధికారులు ఎట్టి పరిస్థితిల్లోనూ కలవడానికి వీల్లేదు. జట్టు పరిసరాల్లో వేపింగ్‌, ఈ సిగరెట్ల వంటి నిషేధిత పదార్ధాల వినియోగంపై బోర్డు పూర్తి నిషేధం విధించింది. భవిష్యత్‌లో ఈ ఆదేశాలను అతిక్రమిస్తే క్రమశిక్షణా చర్యలు కఠినంగా ఉంటాయని బీసీసీఐ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి:

సోషల్ మీడియా వ్లాగింగ్ ఆపేయాలి.. అర్ష్‌దీప్ సింగ్‌ను కోరిన బీసీసీఐ!

ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్

Updated Date - May 09 , 2026 | 02:22 AM